సీజ్డ్ ఇసుక ముసుగులో..
శ్రీకాకుళం: సీజ్డ్ ఇసుక ముసుగులో..ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. సీజ్ చేసిన ఇసుక తరలింపు గడువును పెంచుకునేం దుకు కాంట్రాక్టుదారులు కొత్త ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఇటీవల సీజ్డ్ ఇసుక తరలింపునకు టెండర్లు పిలవడం, నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి టెండర్ దాఖలు చేసినా.. వారికే కాంట్రాక్టును అప్పగించిన విషయం విదితమే. అనంతరం సంబంధిత గుత్తేదారు.. శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ సమీపంలో నదీతీరం నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువచ్చి లారీల ద్వారా తరలిస్తున్న వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం గార మండలం బూరవెల్లి, గార, శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం సమీపం నుంచి రాత్రి వేళల్లో తీరం నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు.
రోజూ రూ.10 లక్షలకు పైగా ఆదాయం
గుత్తేదారునికి అక్రమ ఇసుక రవాణా ద్వారా రోజుకు రూ. 10 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని అనధికార లెక్క లు ప్రకారం తెలుస్తోంది. టెండర్ సమయంలో విధించిన షరతుల ప్రకారం నెల రోజుల్లో సీజ్ చేసిన ఇసుకను తరలించాల్సి ఉంది. కానీ గుత్తేదారు సీజ్ చేసిన ఇసుకను కాకుండా నదీతీరంలోని ఇసుకను తరలించేస్తున్నారు. సీజ్డ్ ఇసుకను మాత్రం అలాగే ఉంచేస్తున్నారు. గడువు ముగిసిన తరువాత సీజ్డ్ ఇసుక గుట్టలను చూపిం చి, తాము గడువులోగా తరలించలేక పోయామని మరికొద్ది గడువు కావాలని అధికారులను కోరాలనేది ఎత్తుగడగా తెలుస్తోంది. ఈ కాలంలో అక్రమంగా మరింత ఇసుకను రవాణా చేసుకోవచ్చని వ్యూహం. ఇటువంటి యోచనతోనే బినామీ పేరుతో జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు కాంట్రాక్టును దక్కించుకున్నారని, ఆయన అండతోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చెబుతున్న మాటలు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
మైన్స్ ఏడీ తీరు విడ్డూరం
ఇసుక అక్రమ తరలింపు, గడువు పెంపునకు సం బంధించి మైన్స్ ఏడీ రౌతు గొల్ల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తాము నిఘా ఉంచామని చెబుతూనే.. గార మండలంలోని బూరవెల్లి వద్దకు వెళ్తున్నట్టు చెప్పారు. అదే సమయానికి సాక్షి ప్రతినిధి కూడా అక్కడకు వస్తారని ఏడీకి చెప్పగా మీరెందుకు అంటూ..కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. రావాలనుకుంటే..ప్రస్తుతం కరజాడ తీరంలో ఉన్నానని కూడా సలహా ఇచ్చారు. ఇసుక రవాణా ఆగిపోయిన చోటుకు ఎందుకు రావాలని ప్రశ్నించగా..సమాధానాన్ని దాటవేశారు. గడువు పెంచాలని కోరితే.. అప్పుడు మాట్లాడవచ్చని.. ముందుగా ఊహించుకోవడం ఎందుకని ఎదురు ప్రశ్నవేశారు. కరజాడ నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఆ ప్రాంత వాసులు ఆగ్రహిస్తూ.. దారికి అడ్డంగా కొద్దిరోజుల క్రితం ట్రాక్టర్ ట్రక్కును అడ్డుగా ఉంచినప్పుడు పోలీసులు అక్రమ తరలింపు వాహనాలను కాకుండా.. ట్రక్కును పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై అనుమానాలు వెల్లువెత్తాయి.