రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష
పాతగుంటూరు: జిల్లా సూపరింటెండెంట్ కె.నారాయణ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నేర సమీక్షసమావేశం ఆదివారం ఉమేష్ చంద్ర సమావేశమందిరంలో జరిగింది. సమావేశంలో కృష్ణా పుష్కరాలు అత్యంత సమర్థవంతంగా పనిచేసిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ఈనెల 11న జరిగిన లోక్ అదాలత్లో జిల్లాపోలీసులు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాను మూడో స్థానం నిలిపినందుకు అభినందనలు తెలిపారు. రానున్న మహాశివరాత్రికి కోటప్పకొండ, జిల్లాలోని ఇతర శైవక్షేత్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేసి, నేరాలను అరికట్టాలన్నారు. స్టేషన్ల పరిధిలో బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఆప్రాంతంలో ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు రామాంజనేయులు, వై.టి.నాయుడు, ఏఎస్పీ తుళ్లూరు విక్రమ్పాటిల్, డీఎస్పీలు మధుసూధనరావు, నాగేశ్వరరావు, మహేష్, రమణమూర్తి, వెంకటనారాయణ, సుధాకర్, సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు, లక్ష్మయ్య, విక్రమ్ శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పాల్గొన్నారు.