దుకాణదారులపై ముప్పేట దాడి
ఆకస్మికంగా అధికారుల రాకతో తీరంలో ఉద్రిక్తత
20వ తేదీలోగా దుకాణాలు ఖాళీ చేయాలని ఆదేశాలు
ససేమిరా అంటున్న రుషికొండ బీచ్ వర్తకులు
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : రుషికొండ బీచ్‌ను నమ్ముకుని వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న చిల్లర వరక్తలపై వివిధ శాఖల అధికారులు మంగళవారం ముప్పేట దాడి చేశారు. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా కారు పార్కింగ్ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ చిల్లర వర్తకులపై విరుచకుపడ్డారు. ఈ నెల 20లోగా ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఏపీ టూరిజం సంస్థ నేతృత్వంలో జీవీఎంసీ చీఫ్ టౌన్ ప్లానింగ్, జోనల్ కమిషనర్, మెరైన్ పోలీస్, బీచ్ పెట్రోలింగ్ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఇలా మొత్తం 15మందికి పైగా అధికారులు అకస్మాత్తుగా విచ్చేశారు. దీంతో ప్రశాంతంగా వ్యాపారం సాగిస్తున్న వర్తకులు కంగుతిన్నారు. బీచ్‌లో వ్యాపారం చేసుకుంటున్న వారందరికీ న్యాయం చేసే వరకు ఖాళీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. దీంతో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఆధునికీకరణలో భాగంగా తరలింపు
రుషికొండ తీరంలో పదేళ్లుగా çరుషికిండ, వాడపాలెం మత్స్యకార గ్రామాలకు చెందిన 76మంది గవ్వలు, పాన్‌షాపు, ఫుడ్‌కోర్టులు, మొక్కజొన్న, కొబ్బరి వంటి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పర్యాటక రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రుషికొండ తీరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఏపీ టూరిజం సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే రూ.3.44కోట్లు వ్యయంతో ఆధునికీకరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా మెరైన్ వాచ్ టవర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కారు పార్కింగ్‌కు కేటాయించారు. అదే స్థలంలో చిల్లర దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రుషికొండ తీరం చిల్లర వర్తకుల జీవన స్థితిగతులపై ఏపీ టూరిజం సంస్థ 2014లో సర్వే చేపట్టింది. ఆ సర్వేలో 30 మంది దుకాణాలు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం అటవీ సామూహిక వనం పక్కన 25 షాపులు, విలేజ్ బీచ్ హట్స్ పక్కన మరో 30 షాపులు మొత్తం 55 దుకాణాలు కొత్తగా నిర్మించారు. అయితే సర్వేలో గుర్తించిన 30 మందికి మాత్రమే దుకాణాలు కేటాయిస్తామని, మిగిలినవి అద్దెలకు ఇచ్చుకుంటామని అధికారులు చెప్పడంతో వర్తకులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఈ దుకాణాలు నిర్మిస్తున్నట్టు చిల్లర వర్తకులకు సమాచారం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది.
కలెక్టర్ ఆదేశాల మేరకు జేఏసీ
ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం సంస్థ ప్రాంతీయ సంచాలకులు శ్రీరాములు నాయుడు జిల్లా కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్‌ను ఆశ్రయించి ఇక్కడి వివాదాన్ని వివరించారు. దీనిపై కలెక్టర్ ఓ జాయింట్ యాక్షన్ కమిటీని నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, మెరైన్ పోలీస్, మధురవాడ జోనల్ కమిషనర్, ఏపీ టూరిజం సంస్థ అధికార యంత్రాంగం దుకాణాలను ఖాళీ చేయించడానికి మంగళవారం వచ్చారు. వచ్చీ రాగానే దుకాణాలు ఖాళీ చేయాలని వర్తకులను బెదరించారు. దీంతో వారంతా ఏకమై ఆకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే ఎలా చేస్తాం... ఇక్కడ 76 మంది వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాం. మాకందరికీ సరిపడా దుకాణాలు కేటాయిస్తేనే ఖాళీ చేస్తామని, లేకుంటే కదలమని తేల్చి చెప్పారు.
కొద్దిసేపు అధికారుల ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు. దీనిపై టూరిజం రీజినల్ సంచాలకులు శ్రీరాములు నాయుడు, తదితర అధికారులు ఎంత సర్దిచెప్పినా వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ నెల 20వ తేదీలోగా దుకాణాలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పి.ఎం.సత్యవేణి, ఏపీ టూరిజం జిల్లా అధికారి కె.జ్ఞానవేణి, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ చీఫ్ సురేష్, ఇన్చార్జి తహసీల్దార్ లాలం సుధాకర్‌నాయుడు, మెరైన్ పోలీస్ సీఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.