7 వేల ఏళ్ల కిందటే నది కలుషితం
టొరాంటో: ప్రపంచంలోనే తొలిసారిగా కలుషితమైన నదిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది దాదాపు 7 వేల ఏళ్ల కిందట నియోలిథిక్ యుగానికి చెందిన మానవులు రాగి లోహాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఈ నది కలుషితమైందని భావిస్తున్నారు. దక్షిణ జోర్డాన్‌లో వడీ ఫేనాన్ ప్రాంతంలో ప్రస్తుతం ఎండిపోయిన నదీ భూతలంలో ఇది చోటు చేసుకుందని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రస్సెల్ ఆడమ్స్ పరిశోధనల్లో తేలింది. రాగిని విచక్షణారహితంగా కరిగించడం వల్ల నదీ వ్యవస్థ కలుషితమైందని ఆయన చెబుతున్నారు.
రాతి యుగం చివరి దశ లేదా కాంస్య యుగం తొలి దశల్లో ఆదిమ మానవులు పనిముట్లను తయారు చేసినట్లు ఈ పరిశోధనలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ‘అప్పటి మానవులు నిప్పు, కుండలు, గనుల నుంచి తవ్వి తీసిన ముడి రాగి ద్వారా తొలిసారిగా రాగి లోహాన్ని తయారు చేశారు’ అని ఆడమ్స్ పేర్కొన్నారు.