విదేశీ కోడలికి మంత్రి బాసట
రష్యన్ యువతి ఓల్గా ఎఫిమెన్కోవా, ఆగ్రాకు చెందిన విక్రాంత్ సింగ్ చండేల్లు గోవాలో కలుసుకున్నారు. స్నేహంగా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2011లో పెళ్లి చేసుకున్నారు. ఓ పిల్లాణ్ని కూడా కన్నారు. విక్రాంత్ గోవాలో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుకదా. వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో విక్రాంత్ భార్యపిల్లలతో సొంత ఊరు ఆగ్రాకు వెళ్లాడు. ఆస్తి పంచి ఆర్థికంగా ఆదుకోవాలని తల్లిని కోరాడు. 'నీకు నయాపైసా ఇచ్చేది లేదు'అని తల్లి తేల్చిచెప్పడంతో కంగుతిన్నాడు.
అతను షాక్ లో ఉండగానే, భర్త తరఫున పోరాటానికి ఉద్యుక్తురాలైందా రష్యన్ వనిత. ఇంద్రపురి ప్రాంతంలోని అత్తారింటి ముందే దీక్షకు దిగింది. శనివారం ప్రారంభమైన ఓల్గా దీక్షను మీడియా ద్వారా తెలుసుకున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. రష్యన్ కోడలికి బాసటగా నిలిచారు. ఓల్గాకు తగిన సహాయం చేయండంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేఖ్ యాదవ్ ను అభ్యర్థించారు.
ఆస్తిలో భర్త వాటా చివరి పైసా ఇచ్చేదాకా ధర్నా విరమించబోనని ఓల్గా అంటున్నారు. ఈ వ్యవహారంపై ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, రష్యన్ ఎంబసీకి సైతం సమాచారం అందించానని ఆమె చెప్పారు. కాగా, రష్యన్ కోడలి అత్తగారు(విక్రాంత్ తల్లి) నిర్మలా చండేల్ వాదన మరోలా ఉంది. విక్రాంత్, ఓల్గా లకు ఇప్పటికే రూ.11 లక్షలు ఇచ్చానని, ఉన్న ఇంటిని కూతురికి రాసిచ్చానని, భర్తకు దూరమైన ఆ కూతురు సదరు ఇంట్లో స్కూల్ నడుపుతూ జీవిస్తోందని చెబుతోంది. కొడుకు, రష్యన్ కోడలు మోసకారులని, నిత్యం మద్యం సేవిస్తారని, ఏనాడూ తనను పట్టించుకున్న పాపాన పోలేదని అత్తగారు నిర్మల ఆరోపిస్తున్నారు. ఈ ఝటిలమైన సమస్యను యువ సీఎం అఖిలేశ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలిమరి..