breaking news
Russian Oil
-
రష్యా చమురు.. ఏకాకిగా భారత్?
అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్‌పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్ ఏకాకిగా మారిందంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్‌లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్‌నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన. ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, ల్యూక్ ఆయిల్‌తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్ తరఫున గోయల్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో భారత్ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్‌లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే.. మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత్ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్‌హౌజ్ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. -
రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు..
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజాలపై అమెరికా ఆంక్షల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారత్‌కు చౌకగా క్రూడ్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా లేరంటూ తాజాగా రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లూక్ ఆయిల్‌పై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల కొరఢా ఝులిపించారు.దీంతో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకుంటున్న రష్యా డిస్కౌంట్ క్రూడ్‌కు అడ్డుకట్ట పడొచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్ నిర్వహిస్తోంది. భారత్‌కు రష్యా రోజుకు 1.7–1.8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఎగుమతి చేస్తుండగా.. ఇందులో దాదాపు సగం వాటా రిలయన్స్‌దే కావడం గమనార్హం. జామ్‌నగర్ రిఫైనరీలో ఉత్పత్తి చేస్తున్న పెట్రోలియం ప్రొడక్టుల్లో అత్యధికంగా యూరప్, అమెరికాకు మార్కెట్ ధరతో విక్రయిస్తున్న రిలయన్స్... దీని ద్వారా భారీగా మార్జిన్లను ఆర్జిస్తోంది. అయితే, అమెరికా తాజా ఆంక్షలతో అమెరికన్ లేదా విదేశీ సంస్థలేవీ రష్యా సంస్థలతో వాణిజ్య లావాదేవీలు జరపకూడదు. ఉల్లంఘిస్తే, సివిల్ లేదా క్రిమినల్ జరిమానాలకు గురికావాల్సి వస్తుంది. అమెరికాతో పటిష్టమైన వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో రష్యా క్రూడ్ దిగుమతులను రిలయన్స్ గణనీయంగా తగ్గించుకోవడం లేదా పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 35 బిలియన్ డాలర్లు.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రిలయన్స్ దాదాపు 35 బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ క్రూడ్‌ను డిస్కౌంట్ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ఉక్రెయిన్ వార్‌కు ముందు, అంటే 2021లో రిలయన్స్ రష్యా నుంచి కొనుగోలు చేసిన క్రూడ్ విలువ కేవలం 85 మిలియన్ డాలర్లు మాత్రమే కావడం విశేషం. 25 ఏళ్ల పాటు రోజుకు 5 లక్షల బ్యారెల్స్ వరకు ముడి చమురు దిగుమతి చేసుకునేలా (ఏడాదికి 25 మిలియన్ టన్నులు) రాస్నెఫ్ట్తో 2024లో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా రాస్‌నెఫ్ట్, లూక్ఆయిల్పై విధించిన ఆంక్షలతో నవంబర్ 21 లోపు ఆయా కంపెనీలతో రిలయన్స్ లావాదేవీలను నిలిపేయాల్సి ఉంటుంది. కాగా, ఈ పరిణామాలపై రిలయన్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోపక్క, తాజా ఆంక్షలతో నయారా ఎనర్జీకి కూడా మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. ఈ కంపెనీలో రాస్‌నెఫ్ట్‌కు 49.12 శాతం వాటా ఉంది. ఇది పూర్తిగా రష్యా క్రూడ్ దిగుమతులపైనే ఆధారపడి రిఫైనరీ, రిటైల్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జూలైలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన ఆంక్షలతో ఇప్పటికే నయారా ఇబ్బందుల్లో చిక్కుకుంది.ప్రభుత్వ రిఫైనరీలకు నో ప్రాబ్లమ్! అమెరికా ఆంక్షల ప్రభావం ప్రభుత్వ రంగ రిఫైనింగ్ సంస్థలపై (ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతరత్రా) ఉండకపోవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ప్రభుత్వ రిఫైనరీలు రాస్‌నెఫ్ట్, లూక్‌ఆయిల్ నుంచి నేరుగా క్రూడ్ దిగుమతి చేసుకోవడం లేదు. మధ్యవర్తి ట్రేడర్లు, ప్రధానంగా యూరోపియన్ ట్రేడర్ల (వారిపై ఆంక్షలు లేవు) నుంచి ముడి చమరు కొనుగోలు చేస్తుండటం వల్ల, ప్రస్తుతానికి దిగుమతులు యథాతథంగా కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నేరుగా రాస్‌నెఫ్ట్ ప్రమేయం లేకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందనేది వారి అభిప్రాయం. రష్యా చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని, మోదీ ఈ మేరకు హామీనిచ్చారంటూ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇప్పటిదాకా అలాంటి ప్రకటనేదీ చేయలేదు. పైగా, రష్యా క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను కూడా ట్రంప్ విధించడం తెలిసిందే. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత రష్యా క్రూడ్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా అవతరించిన నేపథ్యంలో తాజా ఆంక్షలను భారత్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
అమెరికా నుంచి శుభవార్త!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్ వార్’లో మెత్తబడనున్నారా?. వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో త్వరలో భారత్‌కు గుడ్‌న్యూస్ అందించబోతున్నారా?. ఇప్పటికి అమలవుతున్న 50 శాతం సుంకాలను గణనీయంగా తగ్గించబోతున్నారా?.. భారత్ చెందిన ఓ వార్తా సంస్థ కథనం అవుననే అంటోంది.అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ తాజాగా దీపావళి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీతోనూ ఈ అంశంపైనే మాట్లాడానని అన్నారాయన. ఇటు ట్రంప్ ఫోన్‌కాల్‌ను ధృవీకరించిన మోదీ.. ఏ అంశాలపై మాట్లాడరనేది మాత్రం చెప్పలేదు. ఈలోపు.. జాతీయ ఆంగ్ల పత్రి మింట్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ట్రేడ్‌డీల్‌కు భారత్-అమెరికా చేరువయ్యాయని, ఇందులో భాగంగానే భారత్‌పై అమెరికా విధించిన సుంకాల్లో భారీగా తగ్గుదల ఉండబోతోందని ఆ కథనంలో ఉంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోళ్లపైనా ఈ ఒప్పందం ప్రభావం చూపించబోతోందని పేర్కొంది. క్రమక్రమంగా తగ్గించే అవకాశం ఉందని ప్రస్తావించింది.అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం శక్తి(ఎనర్జీ), వ్యవసాయ రంగాలపై ఆధారపడి ఉండబోతోంది. ఈ తగ్గింపుతో సుంకాలు 50 శాతం నుంచి 15-16 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ముగ్గురికి మాత్రమే తెలుసు అని మింట్ కథనం పేర్కొంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే జన్యుపరంగా మార్పులు చేయని మొక్కజొన్న, సోయా ఆహార పదార్థాలపై పన్నులు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని తరచుగా సమీక్షించే విధానాన్ని కూడా చేర్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాసింది. ఈ కథనంపై మరో ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్.. ఇటు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖను, అటు వైట్‌హౌజ్‌ను సంప్రదించింది. అయితే.. ఇరువర్గాలు దీనిపై స్పందించలేదు.47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశానికి ఆసియాన్ దేశాల నాయకులతో పాటు అమెరికా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సైప్రస్, ఫిన్లాండ్ దేశాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ప్రాంతీయ సహకారానికి, ద్వైపాక్షిక ఒప్పందాలకు కీలక వేదికగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఓ పేరుంది.అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల టైమ్‌లైన్2023 జూన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయం, టెక్నాలజీ, ఇంధన రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.2023 ఆగస్టు: అమెరికా భారత దిగుమతుల పన్నులపై సమీక్ష ప్రారంభించింది. దీంతో చర్చలు కొంతకాలం నిలిచిపోయాయి.2024 ఫిబ్రవరి: వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతుల పరిమితులు, పన్నుల తగ్గింపు అంశాలపై చర్చలు కొనసాగాయి.2024 జూన్: భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(MSMEs), రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.2024 డిసెంబర్: పన్నుల సమీక్ష విధానం ప్రతిపాదించబడింది. మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తుల దిగుమతులపై దృష్టి సారించాయి.2025 సెప్టెంబర్ 16: ఆగిపోయిన వాణిజ్య చర్చలు.. ట్రంప్ సుంకాల ప్రభావంతో తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధులు భారత్‌కు చర్చల కోసం వచ్చారు.2025 అక్టోబర్ 13–20: చర్చలు తుది దశకు చేరాయి. ట్రంప్-మోదీలు ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.2025 అక్టోబర్ 22: వాణిజ్య ఒప్పందం తుది రూపు దిద్దుకుంటోంది. మింట్ నివేదిక ప్రకారం.. అమెరికా 50% టారిఫ్‌ను 15–16%కి తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది -
దీనదయాళ్ పోర్ట్‌లో తగ్గిన రష్యా చమురు సరఫరా
ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో అత్యంత ముఖ్యమైన దీనదయాళ్ పోర్ట్(Deendayal Port)లో గణనీయంగా సరఫరా దెబ్బతింది. రష్యన్ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ నౌకాశ్రయం తాజా గణాంకాల ప్రకారం క్రూడ్ వాల్యూమ్ క్షీణతను నమోదు చేసింది.2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దీనదయాళ్ పోర్ట్ నిర్వహించిన ముడి చమురు, ఎల్పీజీ/ఎల్ఎన్జీ మొత్తం వాల్యూమ్ 30.07 లక్షల టన్నులకు తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 32.5 లక్షల టన్నుల వాల్యూమ్‌తో పోలిస్తే దాదాపు 6% క్షీణతను సూచిస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో దీనదయాళ్ పోర్ట్ రష్యన్ చమురును అధికంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.తగ్గుదలకు కారణాలుభారతదేశంపై రష్యా చమురు దిగుమతులకు సంబంధించి ప్రత్యక్ష ఆంక్షలు లేనప్పటికీ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ద్వితీయ పరిమితుల (Secondary sanctions) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రష్యన్ చమురు సరఫరాపై పడింది. రవాణా, బీమా, ఆర్థిక లావాదేవీలు కఠినతరం కావడంతో దిగుమతిదారులు రష్యన్ చమురును నిలిపేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు మళ్లుతున్నారు.భారత్‌పై ఒత్తిడిభారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా ముడి చమురుపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించాలని యూఎస్, ఈయూ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు ఉంది. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడం ఈ సంబంధాలకు ఇబ్బంది కలిగిస్తుంది. రష్యా చమురుతో సంబంధం ఉన్న సంస్థలు, బ్యాంకులపై భవిష్యత్తులో అమెరికా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.రిఫైనరీలపై ప్రభావందీనదయాళ్ పోర్ట్ ద్వారా సాగే ముడి చమురు సరఫరా ప్రధానంగా నయారా ఎనర్జీ (Nayara Energy- రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ మద్దతు కలిగిన సంస్థ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి రిఫైనరీలపై పడుతుంది. నయారా ఎనర్జీకి రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. అయితే ఈ ఒత్తిళ్ల మధ్య కూడా నయారా చమురు సరఫరా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 6,700కు పైగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇంధనాన్ని నింపుతూ దేశీయ సరఫరాను కొనసాగిస్తున్నాయి. తాత్కాలికంగా ఐఓసీకి చెందిన వదినార్ రిఫైనరీలో నిర్వహణ పనులు కూడా ముడి చమురు వినియోగం తగ్గడానికి మరో కారణంగా నిలిచింది.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
‘భారత్‌కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో.. ‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్‌లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ.. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు. భారత్‌పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్‌పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్‌పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).ఇదీ చదవండి: ట్రంప్‌ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే! -
రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో వైట్‌హౌజ్‌లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్ అయోమయావస్థ!


