russian revolution
-
విప్లవానికి వందనం
-
వందేళ్ల వసంతం
అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది. సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్ - ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం - ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత - రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు - రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం - ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం - పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది. రెడ్ అక్టోబర్... ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్విక్లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది. విప్లవ కెరటాలు రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్లాండ్, వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు. అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు... సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది. ప్రచ్ఛన్న యుద్ధం... మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి విప్లవం... ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం. సోవియట్ పతనం... 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది. కమ్యూనిజం భవిష్యత్? సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు. నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..! రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు. -
నూరు వసంతాల ‘అక్టోబర్’
అక్టోబర్ విప్లవం పెట్టుబడిదారీ విధానానికి, పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఆదర్శవాద స్వప్నం కాదని రుజువు చేసింది. అందుకు ఆచరణాత్మక మార్గమైంది. ఖండఖండాలలో కార్మికవర్గ, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊపిరులూదింది. సోషలిజాన్ని ఆవిష్కరించింది. ఆ మహత్తర శ్రామికవర్గ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృత్వ ప్రతీకయైన గోర్కీ ‘అమ్మ’ వంటి అసంఖ్యాకులైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం. నిన్నటి నెత్తుటి విజయాల జ్ఞాపకాలు, గాయాల గురుతులు, త్యాగాల ఆనవాళ్లను ఆలపిస్తూ ఆగమించే విప్లవాల అక్టోబర్ ఎప్పుడూ వినూత్నమే. నేటి కర్తవ్యాల, రేపటి మజిలీల, అంతిమ గమ్యాల నెమరువేతకు సమాయ త్తమయ్యే సందర్భమే. ఈ విప్లవాల అక్టోబర్... మహత్తర శ్రామికవర్గ అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ వత్సర సంరంభంతో వస్తోంది. నిండు గుండెలతో ఆహ్వానిద్దాం, హత్తుకుందాం, ఆవాహన చేద్దాం. 1917 నవంబర్ 7న రష్యాలో జరిగిన మొట్టమొదటి శ్రామికవర్గ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి నాంది పలికింది. రష్యన్ల పాత జూలియన్ కాలెండర్ ప్రకారం అక్టోబర్ 25 అంటే నేడు వాడుకలో ఉన్న గ్రెగెరియన్ కాలండర్ ప్రకారం నవంబర్ 7 అవుతుంది. 1917 నాటి రష్యాలో అక్టోబర్ 25న రాజధాని పెట్రోగ్రాడ్‌లో బోల్షివిక్కులు సార్వత్రిక తిరుగుబాటును జరపడం వల్ల రష్యా విప్లవానికి అక్టోబర్ విప్లవం పేరు స్థిరపడిపోయింది. పైగా చైనా విప్లవం విజయవంతమైనది కూడా అక్టోబర్ మాసంలోనే (1949 అక్టోబర్ 1). అందుకే అక్టోబర్ అంటేనే విప్లవాల మాసంగా మారింది. రష్యా అక్టోబర్ విప్లవ విజయం పెట్టుబడిదారీ విధానానికే కాదు, ఒక మనిషిని మరో మనిషిని దోచుకునే వేల ఏళ్ల పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఒక ఆదర్శవాద స్వప్నం కాదని మానవ సమాజ చారిత్ర గమ్యమనే సత్యానికి రుజువైంది. ఆ మార్గా నికి వెలుగై నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలోనూ కార్మికవర్గ ఉద్యమాలకు, సోషలిజానికి, కమ్యూనిజానికి ఊపిరులూదింది. సామ్రాజ్య వాదంగా మారి పండుటాకుగా మారిన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యా మ్నాయంగా సోషలిజాన్ని నిలిపింది. ‘అమ్మ’... అక్టోబర్ విప్లవం అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవాలు ఆరంభం కానుండగా రష్యా విప్లవంలో కీలక భూమికను నిర్వహించిన మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ గుర్తుకొస్తోంది. శ్రామికవర్గ తల్లుల విప్లవ చైతన్యానికి ప్రతీక అమ్మ. దోపిడీ, పీడనలను ధిక్కరించే చైతన్యాన్ని అందిపుచ్చుకొని, కొడుకు ఆశయసాధనలో లీనమైన ఆ అమ్మ తల్లుల త్యాగనిరతికి చిరునామా. అక్టోబర్ మహావిప్లవానికి ముందు అత్యంత నిర్బంధం మధ్య సాహసోపేత కార్మికవర్గ పోరాటంలో కొడుకుకి తోడుగా తొలిసంతకం చేసిన అమ్మ... పావెల్ తల్లి. గోర్కీ 1906లో రాసిన ‘అమ్మ’ నవలే. కానీ ఆ అమ్మ నిన్న, నేడూ, రేపు సర్వత్రా వాస్తవమే. నాటికీ, నేటికీ విప్లవకారుల త్యాగాల బాటన నడిచే ‘అమ్మ’కు సోషలిజం, కమ్యూ నిజం, విప్లవం, రాజకీయాలు, సిద్ధాంతాలు, వైరుధ్యాలు అర్థం కాకపోవచ్చు. కానీ దోపిడీ, పీడనలకు, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా సాగే అన్ని ఉద్యమాలను వెన్నంటే ఆమె ఉంటుంది. రష్యాలో పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని కూడ గట్టిన కొడుకు పావెల్ పోరాటంలో అమ్మ భాగం అవుతుంది. పోలీసు జులుంకు వెరవక ఎర్రజెండాను దించకుండా కార్మిక దినోత్సవ ప్రదర్శనకు అగ్రభాగాన నిలిచిన కొడుకు పావెల్‌ను వెన్నంటే ఉన్నది అమ్మే. పావెల్ చేజారిన జెండాను ఎత్తిపట్టి జనం మధ్య నిలిచి ఆ అమ్మ కార్మికులనుద్దేశించి మాట్లాడిన మాటలివి.. ‘‘నాయనలారా వినండి! మన రక్తంలో రక్తమైన పిల్లలు, అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు. మీకందరికీ, మీకు పుట్టబోయే పిల్లలందరికీ మంచి జరిగే రోజుల కోసం వెతకడానికి వారు కంకణం కట్టుకున్నారు. సత్యమూ, న్యాయమూగల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు. జనానికందరికీ వాళ్ళు మంచిని కోరుతున్నారు’’. ఉద్యమసారథియైన కొడుకు పావెల్ జైలుపాలు కాగా, అతని ఆశయాన్ని కొనసాగించేందుకు చీరలో దాచుకున్న కరపత్రాలతో నీలోవ్నా వర్గదోపిడీకి వ్యతిరేకంగా సాగుతోన్న కార్మికోద్యమానికి ప్రాణం పోస్తుంది. చివరకు పోలీసు తూటాలకు ఎదనడ్డం పెట్టి మరీ కొడుకు ఆశయాల కరపత్రాలను వెదజల్లుతూ ఆ అమ్మ అన్న మాటలు చిరస్మరణీయం.. ‘‘రక్తసముద్రం కూడా సత్యాన్ని ముంచెయ్యలేదు’’ అని. ఏ అమ్మయినా ఎప్పుడూ కొడుకు సత్యమని నమ్ముతుంది. అతడు సత్యదూరుడైతే నయానా, భయానా నచ్చజెప్పి సన్మార్గంలో పెడుతుంది. తనలో ఊపిరి ఉన్నంత వరకు బిడ్డ ప్రాణాలకు తన ప్రాణాలడ్డుపెడుతుంది. రక్తప్రవాహాలు సైతం తన బిడ్డ నమ్మిన సత్య మార్గాన్ని ముంచెయ్యలేవని ప్రకటిస్తుంది నవల చివర్లో గోర్కీ ‘అమ్మ’. ‘ఒక తల్లి’ విప్లవ సమిధలందరి కన్న తల్లి విప్లవకారులను కన్న నిజమైన తల్లుల జీవితాలన్నీ గుండెలను పిండిచేసే మహోన్నత కావ్యాలే. బిడ్డ ప్రాణాలకు ముప్పని తెలిసీ ఎందరో బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు తన బిడ్డని త్యాగం చేసిన తల్లులెందరో. తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఉద్యమానికి ఊతమిచ్చిన అమ్మలెందరో. అందుకే ఉద్యమ నెలబాలుడు సత్యమూర్తి అంటాడు. ‘‘అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు’’ అని. చావు నన్ను సమీపించి గుసగుసలాడక ముందే, ఆంక్షల సంకెళ్ళు దాటి నిన్ను ఒక్కసారి చూడాలని వుందని చివరికోర్కెను ప్రకటిస్తాడు. మహాశ్వేతా దేవి ‘ఒక తల్లి’ పోలీసులు కాల్చి చంపిన తన బిడ్డ మరణానికి కారణాలను వెతుక్కుంటూ వెళ్లిన ఎందరో అమ్మలను జ్ఞప్తికి తెస్తుంది. తన బిడ్డ రాసిన గోడ రాతలను తడుముకుంటూ, మరణంలో సైతం కొడుకును వీడని అతని స్నేహితుల తల్లులను వెతుక్కుని వెళ్లి, ఆ చింకిపాతల పేద తల్లులను తనివితీరా హత్తుకుంటుంది. తన బిడ్డ గడిపిన సాహసోపేత జీవిత జ్ఞాపక శకలాలను ఏరుకుని గుండెలకు అదు ముకుంటూ... తన కొడుకు కోటానుకోట్ల తల్లుల బిడ్డల ఉద్యమ శిశువని, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం విలువైన తన ప్రాణాలను త్యజించాడని అర్థం చేసుకుంటుంది. కొడుకు మార్గమే సరి యైనదిగా భావిస్తుంది. మిగిలినదంతా ఉత్త కల్పన అనుకుంటుంది. కొడుకు ఆశయాలు ఆ అమ్మకు అంతుబట్టకపోయినా కొడుకు తప్పు చేయడన్న విశ్వాసం భరోసానిస్తుంది. అమ్మంటే తెలంగాణ పోరు పాట, ఉద్యమాల బాట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్లనెదిరించి, యూనియన్ సైన్యాన్ని ధిక్కరించి నడిపిన పోరాటంలో ఎందరో తల్లుల గుండె చెదిరే త్యాగాలున్నాయి. పాలిచ్చే బిడ్డలను పంటపొలాల్లో వదిలేసి ఆయుధాలు పట్టిన వీరమాతలెందరో. తమ బిడ్డలు ఎక్కడున్నారో, ఏమై పోయారో కూడా తెలియకుండా ఏళ్ళు, దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న తల్లులను కూడా ఉద్యమం మనకి అనుభవంలోకి తెచ్చింది. ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం బిడ్డల ప్రాణ త్యాగాలను ప్రోత్సహించిన వారు కొందరైతే, బిడ్డల పోరాటంలో భాగం పంచుకొన్నవారు మరికొందరు. బానిస బతుకుల విముక్తి కోసం అమ్మ ఆ రోజున అన్నీ భరించింది. కొడుకు జాడచెప్పమన్న పోలీసులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తల్లి ధీరోదాత్తత ముందు ఓటమిపాలు కాక తప్పలేదు. తల్లుల పోరాట పటిమ ముందు అన్నీ దిగదుడుపే. దొరల పెత్తనానికీ, పోలీసుల దాష్టీకాలకూ చరమ గీతం పాడుతూ ప్రతి తల్లీ ఆనాడొక చైతన్యకెరటమయ్యింది. ఊరిదొరల ఆట కట్టించే ఉప్పెనయ్యింది. ఉద్యమానికి ఊపిరయ్యింది. చంటి బిడ్డలను వదిలేసి చంకన తుపాకులనెత్తుకున్న తల్లులెందరో. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమైన ఒక్కో తల్లిదీ ఒక్కో విలక్షణమైన అనుభవం. చాకలి ఐలమ్మ మొదలుకొని ఎందరో తల్లులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం నాటి మహత్తర తెలంగాణ పోరా టంలో సమిధలుగా మారారు. ఆ తదుపరి నక్సల్బరీ మొదలుకొని శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, గోదావరీ లోయ, కరీంనగర్ పోరాటాల నుంచి నిన్న మొన్నటి మలి తెలంగాణ ఉద్యమం వరకు ఎందరో తల్లులు తమ బిడ్డల త్యాగాలను ప్రేమించారు. వారి ఆశయాలను అనుసరించారు. వారి లక్ష్యాలను గౌరవించారు. లాఠీలకూ, తూటాలకూ, నిర్బంధాలకూ వెరువని ఆ తల్లులే నిన్న నేడు, రేపూ కూడా విప్లవోద్యమానికి వెన్నెముక. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో దళాల్ని కాపాడుకునేందుకు బిడ్డల్ని త్యాగం చేసిన తల్లులు ఉద్యమంలోనూ, వెలుపలా కూడా ఉన్నారు. తల్లులు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు పడ్డ కష్టాలు ఒక ఎత్తై, తల్లులను జైల్లో పెట్టినప్పుడు ఆ కుటుంబాలు అనుభవించిన అంతులేని దుఃఖం మరో ఎత్తు. తమ బిడ్డల ఆచూకీ చెప్పమంటూ ఎందరో తల్లులను జైలుపాల్జేసిన బాధామయ గాధలు శ్రీకాకుళ పోరాటంలో కోకొల్లలు. తండ్రి చనిపోతే కొరివి పెట్టాల్సిన కొడుకు అడవిబాటపడితే, భర్త చితికి నిప్పుపెట్టిన విప్లవ మాతృమూర్తులెందరో. తండ్రి శవాన్ని సైతం చూడలేకపోయిన పరిస్థితి కల్పించినందుకు రహస్య జీవనంలోంచి తల్లికి బహిరంగ లేఖ రాసిన అనుభవాలూ మనకి ఎరుకే. అందుకే కవి మిత్ర అంటాడు... ‘నిను కడసారి చూడని కొడుకులం/ కన్నీళ్ళల్లో కరిగే కొవ్వొత్తులం/లోకమంతా అమ్మ రూపమే, నీ ఆకలి మా ఆర్తనాదమే.’ వీరగాథలను చనుబాలతో నూరిపోసి, విప్లవమార్గాన్ని చూపిన వీరమాతలను చరిత్ర మరచిపోదు. ‘అమ్మ’ అలుపెరుగని పోరాట గీతం, అమ్మ త్యాగానికి ప్రతీక. మహత్తర అక్టోబర్ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృ పతాకకు ప్రతీకయైన గోర్కీ అమ్మల లాంటి అసంఖ్యాకమైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం. ఆ అమ్మలందరి ఆశలను నిజం చేసేందుకు అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మా అమ్మ పోసమ్మ యాదిలో... అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవం ప్రారంభం కానున్న సందర్భంగా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
ఆ మహత్తర విప్లవానికి 98 ఏళ్లు
సందర్భం ఒకనాటి సోవియట్ యూనియన్ ఒక దేశంగా నేటికీ మనుగడసా గిస్తూ ఉండి ఉన్నట్ల యితే ఈ 7వ తేదీని ప్రపంచంలో మార్క్సిస్టు సిద్ధాంతం ఆలంబనగా ఏర్పడిన తొలి సోషలిస్టు రాజ్య 98వ వార్షికోత్సవ వేడుకగా యావత్ ప్రపంచంలోని శ్రమజీవులూ, తదితర పీడితులూ ఆనందోత్సాహాలతో జరుపు కుని ఉండేవారు! 70 సంవత్సరాలకుపైగా ఆ సోష లిస్టు సోవియట్ యూనియన్ అక్కడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన అంతవరకూ, ప్రపంచం ఎరుగని ప్రత్యామ్నాయ ప్రజాపాలనను సాగించింది. 1. తమ ప్రజలందరికీ జీవన భద్రత, సామాజిక న్యాయం అందించింది. 2. తమ దేశ మహిళా లోకానికి గుణాత్మకంగా ఎన్నదగిన సామాజిక స్వేచ్ఛను, సమాన హక్కులను, ప్రత్యేక గౌరవాలను కల్పిం చింది. 3. ప్రజలలో ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ అస మానతలను కనిష్ట స్థాయికి కుదించే కృషి చేసింది. 4. అంతర్జాతీయంగా విముక్తి పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచింది. 5. నూతనంగా స్వాతంత్య్రం పొందిన మన దేశం వంటి దేశాలు తిరిగి వెనువెంటనే సామ్రాజ్యవాద కబంధ హస్తాలలో చిక్కుకో కుండా సోవియట్ యూనియన్ అందించిన నిస్వార్థ సహాయం నిరుపమానమైనది. 6. హిట్లర్ ఫాసిజాన్ని ఓడించడంలో ప్రధాన భూమిక ధరించింది సోవియట్ యూని యన్. 7. సామ్రాజ్యవాదాన్ని నిలువరిస్తూ - ప్రపంచ శాంతికి పెట్టని కోటలా నిలిచింది. 8. ఆ తర్వాత సోషలిస్టు సమాజాలుగా ఏర్పడిన చైనా తదితర దేశాల ఉనికి, మనుగడను సోవియట్ సహకారం లేకుండా ఊహిం చలేం! అలాంటి సోవియట్ యూనియన్ ప్రపంచ పీడిత, తాడిత ప్రజలకు విషాదాన్నీ... సామ్రాజ్య వాద, దోపిడీ శక్తులకు ఆనందాన్నీ కలిగించే రీతిలో తన సోషలిస్టు వ్యవస్థను కోల్పోవడమే గాక, ప్రపంచ చిత్రపటం నుండి అంతరించింది. ఇందుకు అప్పటి బహిర్గత భౌతికవాస్తవ పరిస్థి తులు ఏమిటి? సోవియట్ యూనియన్ అంతర్గత పరిస్థితి ఏమిటి? ఈ విశ్లేషణ ఈ వ్యాస పరిధిలో లేదు. కానీ ఈ పరిస్థితి స్టాలిన్, కృశ్చేవ్, గోర్బచేవ్, ఇత్యాదుల తప్పిదాల వలననే జరిగిందని చెప్ప బూనడం మార్క్సిజం రీత్యానే సరైంది కాదు. చరిత్రలో వ్యక్తుల పాత్రను తక్కువ అంచనా వేయ కపోయినా నిర్ణయాత్మక శక్తి అని మాత్రం చెప్ప లేము. తన భౌతిక పరిస్థితి దృష్ట్యా చరిత్ర అందుకు అనువైన నేతలను సృష్టించుకుంటుంది. మార్క్స్ కాకపోతే మరొకరు కొంచెం ఆలస్యంగా నైనా అదనపు విలువ శాస్త్రీయ అవగాహనతో కూడిన మానవ పరిణామ చరిత్రగా గతితార్కిక భౌతిక వాదాన్ని తప్పక ప్రతిపాదించి ఉండేవారని స్వయంగా ఏంగిల్స్ అన్నారు. ఇక చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్థ తిరిగి రూపుదిద్దుకుంటున్నదనీ, తదనుగుణమైన రాజ్య వ్యవస్థ ఏర్పడటమే మిగిలి ఉందనీ భావించే ఆస్కారం నేడున్నది. వియత్నాం, క్యూబాలు సైతం తమ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూప గల సంస్కరణలను చేపట్టాయి. తూర్పు జర్మనీతో సహా తూర్పు యూరప్ రాజ్యాలలో సోషలిస్టు వ్యవస్థ మిగలలేదు. సోషలిజం విఫలమయిందనీ, దానితో మార్క్సిజం కూడా తన సైద్ధాంతిక వాస్త వితకను కోల్పోయిందనీ, పెట్టుబడిదారీ విధా నమే శాశ్వతమనీ ప్రచారం చేస్తూ సంబరపడే సామ్రాజ్యవాద దోపిడీ శక్తులు కోకొల్లలు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గానికి పరాకాష్ట అయిన సామ్రాజ్యవాద దశకు చేరుకున్నాం. అయినా, సర్వం దాసోహం అని, ప్రపంచ మాన వాళి, దాని పాదాల ముందు మోకరిల్లకుండా దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాం. ప్రస్తు తం ఇంకా మానవాళి పురోగమనానికి ఆ ప్రయా ణం దోపిడీ, అణచివేత రహిత వ్యవస్థకు చేరుకోక పోవచ్చు. అందుకు ఇంకా చాలా సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఆ దిశ మాత్రం అదేనని సూచించే మైలురాళ్లే - నాటి పారిస్ కమ్యూన్గానీ, ఆ తదు పరి వచ్చిన సోషలిస్టు సమాజాలు గానీ! అప్పుడే సోషలిజం స్థిరపడింది అని అర్థం కాదు. ఆ సోష లిస్టు వ్యవస్థ ఇలా ఉంటుంది అని ప్రజలు గ్రహిం చగలిగే సూచికలు మాత్రమే అని. వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తూ, వ్యక్తి తన శక్తి కొద్దీ స్వచ్ఛందంగా కృషి చేసి తనకు అవసరమైన భౌతిక ఆధ్యాత్మిక సంప దను అనుభవించగల వ్యవస్థకు జన్మనిచ్చే క్రమంలో పుడమి తల్లి పడుతున్న పురిటి నొప్పుల కవి చిహ్నాలు! ఎందుకు సోషలిజం విఫలమ యింది? అన్న ప్రశ్నకు అర్థం లేదు. అదొక వ్యవస్థీ కృతమైన సమాజంగా ఏర్పడితేగదా విఫలమవడానికి? మార్క్స్ మరణానంతరం ఏంగిల్స్ ‘నేనూ, మార్క్స్ రాసిన రచనలన్నింటినీ తిరిగి పరిశీలనా త్మకంగా చదివాను. మా ప్రతిపాదనలలో అక్షరం కూడా మార్సాల్సిన అవసరం లేదు. కాకుంటే అదేదో నేడో రేపో సంభవించనున్నదన్నట్లు భావించిన మా యవ్వనోద్రేకానికి మాత్రం తనివి తీరా నవ్వుకున్నాను’ అని రాశారు. లక్షల సంవత్స రాల మానవ పరిణామ క్రమంలో మార్క్సిజం అవతరించిన (కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ఆరంభం అనుకుంటే) ఈ 175 సంవత్సరాలు ఎంత? సోష లిజం సోవియట్ యూనియన్ ఆవిర్భవించిం దనుకున్న ఈ 98 సంవత్సరాలు ఎంత? ఆ సోష లిస్టు దశ నుండి కమ్యూనిస్టు దశకు చేరబోతు న్నామని బ్రెజ్నేవ్ సోవియట్ యూనియన్ గురించి ప్రకటిస్తే దాన్ని ఎంత పసితనంగా భావించాలి. ఏది ఏమైనా ముందుగా చెప్పుకున్నట్లు ఆ 70 సంవత్సరాల మనుగడలో సోషలిస్టు వ్యవస్థ శ్రమజీవులు, పీడితులకు ఒక గుణాత్మకమైన మెరుగైన జీవితాన్ని తానెంత స్థాయిలో ప్రసాదిం చగలను అనే విషయాన్ని ప్రజల ముందుంచింది. సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ఆ దిశగా ప్రజలు పోరాడేందుకు ఒక భౌతిక చిత్రణను, ఆశను, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. ఆ సోవి యట్ పుణ్యానే నేడు ప్రపంచ వ్యాపితంగా ప్రజా నీకాన్ని ఆ మార్గంలో పయనింప చేసే కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరులొచ్చాయి. మార్క్సిజం ప్రస్తావన లేకుండా నేడు చరిత్రను, మానవ చరిత్రను అధ్యయనం చేయలేరనడం అతిశయోక్తి కాదు. అందుకే మార్క్సిజం నేటికీ ఆచరణాత్మ కమైన సజీవ సిద్ధాంతమే. మన దేశంలోని పరిస్థితులన్నింటిపైనా కమ్యూనిస్టు ఉద్యమం నిజాయితీగా ఆత్మపరిశీ లనా దృష్టితో మేధోమథనం జరపాలి! నిరాశాజన కంగా నేటి కమ్యూనిస్టు ఉద్యమ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుగా కమ్యూనిస్టులలో ఐక్యత సాధిం చాలి! మార్క్స్ చెప్పిన దాన్ని మరో మాటల్లో చెప్పాలంటే కమ్యూనిస్టుల అపజయ కారణం వారి అనైక్యతలోనే ఉన్నది. అలాగే మన దేశంలో కష్టజీవులు గ్రామీణ పేదల రైతాంగ ఐక్యతతో పాటు చాలా బలంగా, శతాబ్దాల తరబడి వేళ్లూను కున్న మనుస్మృతి భావజాల పరిధిలోని నిచ్చెన మెట్ల లాంటి కులవ్యవస్థలో అణచివేయబడు తున్న దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారి టీలు, ఇతర వెనుకబడిన కులాల వారు ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం ఈ ప్రజా సమూహాన్ని కూడా తనలో ఇముడ్చుకోవాలి. అస్తిత్వ ఉద్య మాలు శ్రామిక వర్గ ఐక్యతకు భంగం కలిగిస్తా యని, వాటిపట్ల విముఖత కూడదు. వర్గవైరుధ్యం గుర్తించడానికి ముందే వర్గ వైరుధ్య తీవ్రతను గమ నించి వ్యతిరేకించిన గౌతమ బుద్ధుడి బోధనలు ప్రభవిల్లిన చోట, ఆ రెండు రూపాల దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనకుండా శ్రామిక వర్గ విప్లవం జయప్రదం కాదు. నూటికి పదిమందికి మించని దోపిడీ, దుర్మార్గ శక్తులకు వ్యతిరేకంగా మిగిలిన 90 శాతం మందిని తనలో ఇముడ్చుకోగల విశాల ఐక్య ప్రజాపోరాటాలను, ప్రజల సమస్యలపై ఐక్యమైన కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించాలి. ఆ ఉద్యమమే మన దేశ ప్రజల అభ్యున్నతికే కాక, తమ పునరుజ్జీ వనానికి కూడా ప్రాణప్రదమన్న స్పృహతో కమ్యూ నిస్టు ఉద్యమం పూర్వవైభవాన్ని పొందాలని ఆశిద్దాం.. డా॥ఏపీ విఠల్ (నేడు రష్యన్ విప్లవం 98వ వార్షికోత్సవం సందర్భంగా...) వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్: 98480 69720