విశాఖ తీరంలో చమురు, గ్యాస్!
విశాఖ పోర్టుకు దక్షిణాన 3 చమురు లోయలు.. భీమిలికి ఉత్తర దిశలో మరో 3 లోయలు
♦ ఒక్కోటి 50 – 60 కి.మీ. మేర విస్తరణ
♦ ఎన్ఐవో అన్వేషణలో వెలుగులోకి లోయలు
♦ విశాఖ, సంకల్ప్గా నామకరణం
♦ మరింత లోతుగా శాస్త్రవేత్తల పరిశోధనలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగర తీరంలో కృష్ణా, గోదావరి(కేజీ) బేసిన్ తరహాలో చమురు, సహజ వాయువులకు అనువైన లోయలు(కాన్యన్లు) ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విశాఖ నుంచి భీమునిపట్నం మధ్య తీరానికి ఆనుకుని సముద్రంలో ఈ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) శాస్త్రవేత్తలు ఆర్వీ సింధు సంకల్ప్ అనే అత్యాధునిక పరిశోధక నౌక ద్వారా విశాఖపట్నం–శ్రీకాకుళంల మధ్య సముద్రంలో ఇటీవల పరిశోధన సాగించారు. ఈ అధ్యయనంలో విశాఖ పోర్టుకు దక్షిణాన మూడు కాన్యన్లు, భీమిలికి ఉత్తర దిశలో మరో మూడు కాన్యన్లు ఉన్నట్టు తేల్చారు.
గురువారం విశాఖలోని ఎన్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఐఓ(గోవా) యాక్టింగ్ డైరెక్టర్ ఎస్.ప్రసన్నకుమార్, సైంటిస్ట్ ఇన్చార్జి (విశాఖ), సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ జీపీఎస్ మూర్తి వివరాలను వెల్లడించారు. 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర అధ్యయన విభాగం తొలిసారిగా కోస్తాంధ్రలో ఖనిజ నిక్షేపాలపై అన్వేషణ జరిపిందని చెప్పారు. అప్పట్లో విశాఖకు సమీపంలో మూడు కాన్యన్లు ఉన్నట్టు గుర్తించారన్నారు. దీంతో పరిశోధన సాగించిన విశ్వవిద్యాలయానికి ఆంధ్ర(ఎ), ప్రొఫెసర్ మహదేవన్(ఎం), వీసీ వీఎస్ కృష్ణ(కె) పేర్లతో ఏఎంకేగా నామకరణం చేశారని పేర్కొన్నారు.
వచ్చే నెలలో కోస్తా తీరం మ్యాపింగ్
మళ్లీ 54 ఏళ్ల తర్వాత అత్యా«ధునిక వెసల్తో మార్చి 2 నుంచి నాలుగు రోజుల పాటు మల్టీబీమ్ సర్వే చేపట్టామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పరిశోధనలో సరికొత్తగా ఈ రెండు లోయలు వెలుగు చూశాయన్నారు. ఈ కాన్యన్లు మూడేసి చొప్పున (మొత్తం ఆరు) వేర్వేరుగా ఏర్పడి కొంత దూరం తర్వాత కలిసినట్టు గుర్తించామని తెలిపారు. ఇవి మిలియన్ల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయని, ఒక్కొక్కటి 50–70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని చెప్పారు. వీటిలో హైడ్రో కార్బన్ నిక్షేపాలున్నాయన్నారు. సేకరించిన శాంపిళ్లను అధ్యయనం చేస్తామని, మరో ఏడాది నాటికి ఎంత పరిమాణంలో నిక్షేపాలున్నాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం మ్యాపింగ్ చేస్తామని పేర్కొన్నారు. తీరంలో మార్పులపై సముద్ర గర్భంలో మరింత లోతుగా పరిశోధనలు సాగిస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని వివరించారు.
విశాఖ, సంకల్ప్గా నామకరణం
కొత్తగా వెలుగుచూసిన కాన్యన్లుకు విశాఖ, సంకల్ప్గా నామకరణం చేసినట్టు ఎన్ఐఓ చీఫ్ సైంటిస్ట్, సంకల్ప్ సింధు రీసెర్చి వెసల్ మేనేజ్మెంట్ అధిపతి పీఎస్ రావు వెల్లడించారు. ఎన్ఐవో కార్యాలయం లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇతర దేశాలు, ప్రాంతాల్లో కాన్యన్లు్లన్న సమీప నగరాల పేరును పెడుతున్నారన్నారు. విశాఖకు ఆనుకుని పోర్టుకు సమీపంలో ఉన్న కాన్యన్లకు ‘విశాఖ’ కాన్యన్గాను, భీమిలి వద్ద ఉన్న కాన్యన్ను కనుగొనడంలో సింధు సంకల్ప్ వెసల్ దోహదపడినందున ‘సంకల్ప్’ కాన్యన్గాను పేర్లను సూచించామని చెప్పారు. వీటిని రిజిస్టర్ చేయించాక అధికారికంగా ఖరారు చేస్తామ న్నారు. 2008లో జపాన్ నుంచి కొనుగోలు చేసిన సింధు సంకల్ప్ పరిశోధక వెసల్ ఇప్ప టిదాకా సముద్ర గర్భంలో 100 అన్వేషణ లను సాగించిందని రావు తెలిపారు. వందో క్రూయిజ్లో విశాఖ తీరంలో అత్యద్భుత మైన కాన్యన్లను కనుగొనడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.