ఏసీబీ వలలో వాటర్‌షెడ్ టీఏ
► ఇద్దరు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
► మార్కాపురం వాటర్‌షెడ్ పథకం కార్యాలయంలో ఘటన..
మార్కాపురం : ఇద్దరు రైతుల నుంచి లంచం తీసుకుంటున్న వాటర్‌షెడ్ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న వాటర్‌షెడ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం మండలం బిరుదుల నరవకు చెందిన సీహెచ్ చిన్న సాల్మన్, పెద్దనాగులు ఈ ఏడాది మేలో తమ పొలంలో పంట సంజీవని పథకం కింద నీటి కుంటలు తొవ్వుకున్నారు.
ఒక్కో కుంటకు 1.80 లక్షల రూపాయలతో వాటర్‌షెడ్ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ (కాంట్రాక్టు ఉద్యోగి) త్రిపురారెడ్డి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలలు నుంచి బిల్లులు మంజూరు చేయకుండా రైతులను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కొక్కరు తనకు 20 వేల రూపాయలు ఇస్తేనే నిధులు మంజూరు చేయిస్తానని రైతులతో చెప్పాడు. ఈ నెల 13న సాల్మన్, పెద్ద నాగులు కలిసి ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వాటర్‌షెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసిన పది రూ.2 వేల నోట్లు మొత్తం రూ.20 వేలు బాధిత రైతులకు ఇచ్చారు.
ఆ నగదు తీసుకున్న రైతులు నేరుగా త్రిపురారెడ్డి వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆయన వెంటనే ఆ నగదును జేబులో పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐ ప్రతాప్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఎస్ఐ కరీముల్లా, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌లు లోపలికి వెళ్లి త్రిపురారెడ్డిని అదుపులోకి తీసుకుని రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. తమను ఆరు నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో విసిగి వేసారి ఏసీబీ అధికా>రులను ఆశ్రయించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ వార్త పట్టణంలో క్షణాల్లో తెలిసి పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది అలర్ట్ అయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.