‘పంట కాలనీ’లో రైతు సమితులు కీలకం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్రంలో పంటకాలనీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న ఈ పంట కాలనీల ఏర్పాటులో ‘రైతు సమన్వయ సమితులను క్రియాశీలకం చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వం అమలు చేసిన ‘రైతుబంధు, ‘రైతుబీమా’పథకాలు విజయవంతం కావడంలో క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులతోపాటు సమన్వయ సమితులు నిర్వహించిన పాత్రను ప్రభు త్వం గుర్తించింది. దీంతో పంటకాలనీల ఏర్పాటులోనూ ‘సమితుల సేవలను విని యోగించుకోవడంతోపాటు వారిని క్రియాశీలకంగా వ్యవ హరించేలా చూడాలని సీఎం భావిస్తున్నారు. సమితుల్లోని సభ్యులకు గౌరవవేతనం ఇవ్వడంతోపాటు విధులకు సంబంధించి నిర్ధిష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు మార్గదర్శకాలకు సంబంధించి కసరత్తు చేయాలని అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను కోరగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి అందజేశారు. దీనిపై త్వరలోనే సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
వ్యవసాయ శాఖ సర్వే
పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించి పంటల వివరాలతోపాటు రైతుల వివరాలను సేకరించడానికి వ్యవసాయశాఖ సర్వే చేపట్టనుంది. గ్రామాలు, మండలాలవారీగా వ్యవసాయ, ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని రైతులవారీగా, సర్వే నంబర్లు, పంటలవారీగా సేకరించి జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి అందించనున్నారు. ఈ వానాకాలం నుంచే పైలట్ ప్రాజెక్టు కింద పంట కాలనీలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించే సమాచారంతో పట్టాదారు నంబర్, రైతు పేరు, తండ్రిపేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, సోషల్ స్టేటస్, మొత్తం ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది.. అనే వివరాలను సర్వే నంబర్‌వారీగా నమోదు చేసుకుంటారు. ఎంత విస్తీర్ణం సాగుకు పనికొస్తుందనే వివరాలు తీసుకోనున్నారు.
నీటి సదుపాయం బోర్ ద్వారా ఉందా? కాలువల ద్వారా ఉందో కూడా వివరాలు నమోదు చేస్తారు. వర్షాధార సాగు విస్తీర్ణం, భూసార పరీక్షకార్డులు అందాయా? లేదా? అనే అంశాలు కూడా సేకరించనున్నారు. సాగయ్యే పంటలు, ఏ సర్వే నంబర్లో ఏ పంటలు సాగవుతున్నాయనే వివరాలు నమోదు చేస్తారు.. ఇలా వానాకాలం, యాసంగి పంటలకు వేర్వేరుగా వివ రాలు నమోదు చేయనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మనీటి సేద్యం ఎంత మేరకు ఉన్నదో కూడా సేకరించనున్నారు. ఎంత విస్తీర్ణానికి పంటలబీమా చేయించారనే సమగ్ర సమాచారాన్ని నమోదు చేస్తారు. పంటరుణాలు ఎంత తీసుకున్నారు? పండించిన పంటలో మార్కెట్లో ఎంత అమ్మారు.. వివరాలు నమోదు చేయించడం లో సమితుల సభ్యులు సహాయం చేయనున్నారు.
పకడ్బందీగా రైతు సమన్వయ సమితుల నియామకం
రైతు సమన్వయ సమితుల్లో సభ్యుల నియామకం మరింత పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో సమన్వయ సమితులను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది వివిధ కారణాలతో తప్పుకోవడం, మరికొందరు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డుసభ్యులుగా ఎన్నికయ్యారు. అందువల్ల రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా రాజకీయాలకు అతీతంగా, రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేసేవారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.