హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్ నాగారం : వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత దాన్ని వదిలించుకునేందుకు హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకున్నట్లు నగర డీఎస్పీ ఎస్.అనిల్‌కుమార్ తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెంజల్‌కు చెందిన అగ్గు పోశెట్టి బ్రహ్మంగారి బుర్ర కథలు చెబుతూ కుటుంబాన్ని పోషించాడు. అతడు ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం బామిని గ్రామంలోని బోయిడి లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా కథలు చెపుతూ నిత్యం ఆమెతోనే గడిపాడు. ఈ విషయం పోశెట్టి భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొవడలు వచ్చాయి.
దీంతో పిల్లలతో సహా తన పుట్టినిల్లు నిజామాబాద్ మండలం అమ్రాద్‌కు వెళ్లింది. పోశెట్టికి ఏం చేయాలో తోచక లక్ష్మితో వివాహేతర సంబంధాన్ని తెంచుకుందామనుకున్నాడు. అందుకు పక్కా పథకం వేశాడు. లక్ష్మికి ఫోన్ చేసి మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామ శివారులోని మొసలికుంట చెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరు కల్లు తాగారు. ఇక మన సంబంధం వద్దని లక్ష్మికి చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు చేతిలోని బీరు సీసాతో లక్ష్మి గొంతుపై పొడిచి చంపాడు. ఆమె ఒంటిపైనున్న బంగారు పుస్తెలతాడు, బంగారు ఉంగరము, మాటీలు, సెల్‌ఫోన్‌ను తీసుకుని శవాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయాడు. బోర్గాం వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఫోన్ కాల్స్ ఆధారంగా..
మొదట గుర్తు తెలియని శవంగా మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మి బంధువులు ఆమె ఫొటోతో ఆచూకీ కోసం తిరిగారు. ఆమె వివరాలను పోలీసులకు చెప్పారు. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆమె సెల్‌ఫోన్ ఐఎంఏ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. నిందితుడు పోశెట్టి లక్ష్మి ఫోన్‌ను వాడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించారు. హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. లక్ష్మి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు రిమాండ్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసు ఛేదనలో కానిస్టేబుల్ నరేందర్ కృషి అభినందనీయమని, రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. సీఐ సూదిరెడ్డి దామోదర్‌రెడ్డి, మాక్లూర్ ఎస్సై సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.