సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, ముంబై: షిర్డీలో 2018లో జరగనున్న సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ యాజ మాన్యం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. రూ.1,104 కోట్లతో కూడిన ప్రతి పాదనను పరిపాలనా విభాగానికి సమర్పించింది.
ఇందుకోసం ముఖ్యమంత్రి ృథ్వీరాజ్ చవాన్ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. రహదారులు, నీరు, విద్యుత్, ఆరోగ్యం తదితరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచనున్నారు. 2018 డిసెంబర్లో జరగనున్న సాయి సమాధి శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాదిమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. వారందరికి భోజనం, ప్రసాదంతోపాటు బస తదితర వసతులను కల్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు వేలాదిగా వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.
ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి రాధాకృష్ఱ విఖేపాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలకోసం షిర్డీ సాయి ఆలయ సంస్థాన్‌తోపాటు ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తొలి విడత కింద కనుక రూ.153 కోట్లు మంజూరైతే షిర్డీలో రహదారుల మెరుగు పనులను ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు. గత సంవత్సరం నాందేడ్‌లో సిక్కు మత పెద్దల శతాబ్ది ఉత్సవాలు ఏ స్థాయిలో జరిగాయో అదే స్థాయిలో షిర్డీలో కూడా సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు.