మీడియాను లొంగదీసుకునే యత్నం
హైదరాబాద్ పౌరసమాజ ప్రతినిధుల వేదిక
సాక్షి, హైదరాబాద్: ‘హిందూ’ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్‌కుమార్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు నిజాం కాలంకన్నా ఘోరంగా ఉందని హైదరాబాద్ నగర పౌరసమాజ ప్రతినిధుల వేదిక ధ్వజమెత్తింది. ఈ ఘటనపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది. ఇదే విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు వేదిక ప్రతినిధులు తెలిపారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎ.గోపాలకిషన్ , హనుమాన్‌చౌదరి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమరాజు, నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయంలోనూ జర్నలిస్టులు, పత్రికలపై ఇంతటి నిర్బంధం లేదన్నారు. ఇది కేవలం ఒక పత్రికపై దాడి కాదని, మొత్తం మీడియాను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమని వారు ఆరోపించారు. ఈ విషయంపై జర్నలిస్టు సమాజం మొత్తం స్పందించడం అభినందనీయమన్నారు.