S Ravi
-
మరోసారి ఎలైట్ ప్యానెల్లో ఎస్ రవి
న్యూఢిల్లీ:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ఎలైట్ ప్యానెల్లో భారత్ అంపైర్ ఎస్ రవి(సుందరం రవి)కి మరోసారి స్థానం దక్కింది. గతేడాది ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో తొలిసారి చోటు దక్కించుకున్న ఎస్ రవి నియమాకాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించనున్నట్లు అంపైర్ల సెలక్షన్ ప్యానెల్ తాజాగా స్పష్టం చేసింది. 2015లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో భారత తరపున ఎస్ రవికి చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 12 ఏళ్ల క్రితం భారత అంపైర్ ఎస్.వెంకట్రాఘవన్ ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ చోటు దక్కించుకోగా.. ఆ తరువాత ఎస్ రవి ఆ అరుదైన గౌరవాన్ని వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. 2011 విశాఖపట్నంలో జరిగిన వన్డేతో అంపైర్‌గా అరంగేట్రం చేసిన రవి ఇప్పటిదాకా 11 టెస్టులు, 26 వన్డేలు, 18 టి 20ల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా అంపైర్ల సెలక్షన్ ప్యానెల్ అయిన 'ఎమర్జింగ్ ప్యానెల్' కు మరో భారత్ అంపైర్ సి షంసుద్దీన్ ప్రమోట్ అయ్యారు. షంసుద్దీన్ ఏడు వన్డేలు, 10 టీ 20లకు అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. -
అలీమ్ దార్ స్థానంలో ఎస్ రవి
దుబాయ్: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య గురువారం చెన్నైలో జరుగనున్న నాల్గో వన్డేలో అంపైరింగ్ చేసేందుకు పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ స్థానంలో సుందరమ్ రవిని నియమించారు. భద్రతా కారణాలతో పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కు పిలిచిన నేపథ్యంలో ఎస్ రవిని ఎంపిక చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం శివసేన కార్యకర్తలు ముట్టడించిన అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మ్యాచ్ కు తటస్థ అంపైర్ తో పాటు, ఆతిథ్య అంపైర్ ఉంటే బావుంటుందని భావించిన ఐసీసీ.. సుందర్ రవిని అంపైర్ గా నియమించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడైన రవి.. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న సిరీస్ కు అంపైర్ గా వ్యవహరించాల్సి ఉంది. కాగా, దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగే తదుపరి వన్డేకు రవి అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాల్గో వన్డేకు ఇద్దరూ కూడా భారత్ కు చెందిన అంపైర్లే ఉంటారని పేర్కొంది. -
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో రవి
దుబాయ్: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఓ భారత అంపైర్‌కు స్థానం దక్కింది. ఎస్.వెంకట్రాఘవన్ అనంతరం 11 ఏళ్లుగా ఈ అత్యుత్తమ అంపైర్ల ప్యానెల్లో మరో భారతీయుడికి చోటుదక్కలేదు. అయితే తాజాగా సుందరం రవి ఈ ఘనత సాధించారు. అంపైర్లు స్టీవ్ డేవిస్ రిటైర్ కాగా, బిల్లీ బోడెన్ (కివీస్)ను తప్పించడంతో ఇంటర్నేషనల్ ప్యానెల్ నుంచి రవితో పాటు క్రిస్ గఫానే (కివీస్) ఎలైట్ ప్యానెల్‌కు ప్రమోట్ అయ్యారు. ఎలైట్ ప్యానెల్లో మొత్తం 12 మంది అంపైర్లుంటారు. 2011 విశాఖపట్నంలో జరిగిన వన్డేతో అంపైర్‌గా అరంగేట్రం చేసిన రవి ఇప్పటిదాకా ఆరు టెస్టులు, 24 వన్డేలు, 12 టి20ల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ విషయంలో బీసీసీఐకి, ఐసీసీకి కృతజ్ఞతలు తె లుపుకుంటున్నాను’ అని 49 ఏళ్ల రవి అన్నారు.