మరోసారి ఎలైట్ ప్యానెల్లో ఎస్ రవి
న్యూఢిల్లీ:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ఎలైట్ ప్యానెల్లో భారత్ అంపైర్ ఎస్ రవి(సుందరం రవి)కి మరోసారి స్థానం దక్కింది. గతేడాది ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో తొలిసారి చోటు దక్కించుకున్న ఎస్ రవి నియమాకాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించనున్నట్లు అంపైర్ల సెలక్షన్ ప్యానెల్ తాజాగా స్పష్టం చేసింది.
2015లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో భారత తరపున ఎస్ రవికి చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 12 ఏళ్ల క్రితం భారత అంపైర్ ఎస్.వెంకట్రాఘవన్ ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ చోటు దక్కించుకోగా.. ఆ తరువాత ఎస్ రవి ఆ అరుదైన గౌరవాన్ని వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. 2011 విశాఖపట్నంలో జరిగిన వన్డేతో అంపైర్‌గా అరంగేట్రం చేసిన రవి ఇప్పటిదాకా 11 టెస్టులు, 26 వన్డేలు, 18 టి 20ల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా అంపైర్ల సెలక్షన్ ప్యానెల్ అయిన 'ఎమర్జింగ్ ప్యానెల్' కు మరో భారత్ అంపైర్ సి షంసుద్దీన్ ప్రమోట్ అయ్యారు. షంసుద్దీన్ ఏడు వన్డేలు, 10 టీ 20లకు అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.