దుబాయ్: వచ్చే 2020-21 సీజన్‌లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తమ అంపైర్ల ఎలైట్ ప్యానల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌కు చోటు కల్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్‌ను ఎలైట్ ప్యానల్ చేర్చే విషయాన్ని ఐసీసీ సోమవారం ప్రకటించింది. దాంతో ఈ సీజన్‌లో ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానల్‌లో చోటు దక్కించుకున్న పిన్నవయస్కుడిగా 36 ఏళ్ల నితిన్ నిలిచారు. ఇప్పటివరకూ మూడు టెస్టులకు, 24 వన్డేలకు, 16 టీ20లకు నితిన్ అంపైర్‌గా వ్యహరించారు. ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్ ఎల్‌లాంగ్ స్థానంలో నితిన్‌కు అవకాశం దక్కింది. గతంలో శ్రీనివాస్ వెంకట్రాఘవన్, సుందర్ రవిలు ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో పని చేసిన భారత అంపైర్లు. కాగా, గతేడాది సుందర్ రవిని ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి ఐసీసీ తప్పించింది. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి)
అంతకుముందు ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానల్‌లో ఉన్న నితిన్‌ను.. ఎలైట్ ప్యానల్ అంపైర్‌గా ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్, మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్‌లతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. చాలా ఏళ్లుగా భారత అంపైర్ల స్టాండర్డ్స్‌పై విమర్శలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరొకసారి భారత్‌కు చెందిన అంపైర్‌కు ఎలైట్ ప్యానల్‌లో చోటు దక్కడం విశేషం. కొంతకాలంగా నితిన్ అంపైర్‌గా కొన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలోనే అతనికి ఎలైట్ ప్యానల్‌లో చోటు కల్పించారు. ‘ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌కు తనను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా, గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రముఖ అంపైర్లు, రిఫరీలతో ఉన్న ఎలైట్ ప్యానల్‌లో చేరాలనేది నా కల. కల ఇన్నాళ్లకు నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని నితిన్ ఆనందం వ్యక్తం చేశారు. (30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..)
నా తండ్రి కూడా అంపైరే
‘నా తండ్రి నరేంద్ర మీనన్ కూడా అంతర్జాతీయ అంపైరే. 2006లో బీసీసీఐ అంపైర్ల కోసం ఒక ఎగ్జామ్ నిర్వహించింది. అంతకు పూర్వం పది సంవత్సరాల క్రితం నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వు క్లియర్‌గా ఉంటే అంపైరింగ్ కోసం ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకో అన్నారు. నాకు అంపైరింగ్ అంటే ఇష్టం దాంతోనే అంపైరింగ్ పరీక్ష రాయడం జరిగింది. అలా నేను అంపైర్‌ను అయ్యాను’ అని మీనన్ తన జర్నీని రెండు మాటల్లో చెప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment