దుబాయ్: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య గురువారం చెన్నైలో జరుగనున్న నాల్గో వన్డేలో అంపైరింగ్ చేసేందుకు పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ స్థానంలో సుందరమ్ రవిని నియమించారు. భద్రతా కారణాలతో పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కు పిలిచిన నేపథ్యంలో ఎస్ రవిని ఎంపిక చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం శివసేన కార్యకర్తలు ముట్టడించిన అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ మ్యాచ్ కు తటస్థ అంపైర్ తో పాటు, ఆతిథ్య అంపైర్ ఉంటే బావుంటుందని భావించిన ఐసీసీ.. సుందర్ రవిని అంపైర్ గా నియమించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడైన రవి.. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న సిరీస్ కు అంపైర్ గా వ్యవహరించాల్సి ఉంది. కాగా, దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగే తదుపరి వన్డేకు రవి అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాల్గో వన్డేకు ఇద్దరూ కూడా భారత్ కు చెందిన అంపైర్లే ఉంటారని పేర్కొంది.