ముల్తాన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం ఎదురైన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసక్తికర నిర్ణయం తీసుకుంది. పీసీబీ ఆ దేశ సెలెక్షన్ కమిటీలో పలు మార్పులు చేసింది. ఓ మాజీ అంపైర్ సహా మరో ఇద్దరిని కొత్తగా చేర్చింది. ఇటీవలే అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అలీం దార్, మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావెద్, అజర్ అలీ కొత్తగా సెలెక్షన్ కమిటీలో చేరారు. ఈ ముగ్గురికి పీసీబీ ఓటింగ్ హక్కు కల్పించింది.
వీరితో పాటు ఇదివరకే సెలెక్షన్ కమిటీలో ఉన్న హసన్ చీమాకు కూడా పీసీబీ ఓటింగ్ హక్కు కల్పించింది. కాగా, పది రోజుల కిందటే మొహమ్మద్ యూసఫ్ సెలెక్షన్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంతలోనే పీసీబీ కొత్తగా మరో ముగ్గురిని సెలెక్షన్ కమిటీలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోనని పాక్ క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ముల్తాన్ టెస్ట్‌లో పాక్ పర్యాటక ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.
చదవండి: డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment