దేశంలో తగ్గిన పత్తి దిగుబడి
గత మూడేళ్లుగా దేశంలో పత్తి పంట దిగుబడి తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ సిపి ఎంపి విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాత పూర్వక జవాబిస్తూ కరవు పీడిత ప్రాంతాల్లో పత్తి దిగుబడి తక్కువ కావడంతో ప్రత్యేకించి ఎర్ర భూములలో తెలంగాణా ప్రభుత్వం పప్పులు, సోయాబీన్ పంటలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా పత్తి ఉత్పాదకత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పప్పులు, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందన్నారు. అంతేకాకుండా సూక్ష్మ సేద్యంను కూడా ప్రోత్సాహమిస్తోందని వివరించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) దేశీయ ధరల పరిస్దితిని పర్యవేక్షిస్తోందన్నారు. ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పత్తి పంటపై కరవు ప్రభావం లేదని కేంద్ర మంత్రి చెప్పారు.