కొత్త నోట్లు దాచుకోవద్దు: ఆర్బీఐ
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నోట్ల కష్టాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తెలిపింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నెల రోజుల వ్యవధిలో 4 లక్షల 61 వేల కోట్ల విలువ చేసే నోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా పంపిణీ చేశామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ఇందులో 1.70 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రూ. 2 వేల నోట్లు, కొత్త రూ. 500 నోట్లు ఉన్నాయని చెప్పారు. మిగతా మొత్తానికి చిన్న నోట్లు పంపించామన్నారు.
కొత్త నోట్లను దాచుకోవద్దని, చెలామణి చేయాలని ప్రజలకు సూచించారు. డిసెంబర్ 10 వరకు బ్యాంకుల్లో రూ.12 లక్షల 44 వేల కోట్ల విలువైన పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ఇవన్నీ తమ వద్దకు వచ్చాయని చెప్పారు.
పాత పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారాల్లో పలు బ్యాంకుల్లో వెలుగు చూసిన అక్రమాలపైనా ఆర్బీఐ స్పందించింది. బ్యాంకుల ఆడిటింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా అన్నారు. బ్యాంకు కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో లావాదేవీలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. బెంగళూరులో అవకతవకలకు పాల్పడిన ఆర్బీఐ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. నకిలీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన ఢిల్లీ యాక్సిస్ బ్యాంకుకు షోకాజ్ నోటీసు జారీచేసినట్టు ముంద్రా తెలిపారు.