S. sravan jaya
-
హైసియా టెక్‌ఫెస్ట్‌లో రికార్డులు బ్రేక్ చేసిన మేజ్
రికార్డులు బ్రేక్ చేసిన మేజ్, హార్లీ డేవిడ్సన్- మేడిన్ ఇండియా, వీల్‌చెయిర్ ను కంట్రోల్ చేసే స్మార్ట్ ఫోన్.. ఇలా ఇన్నోవేటివ్ థాట్స్‌కు వస్తు రూపమిచ్చారు యువ టెకీలు. ప్రోత్సాహం ఉండాలే కానీ.. సృజనకు కొదవ లేదని నిరూపించారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెజైస్ అసోసియేషన్ (హైసియా) ఇటీవల నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లో ఆకట్టుకున్న కొన్ని ఆవిష్కరణల గురించి... - ఎస్.శ్రావణ్‌జయ పిల్లలు ఆడుకునే ‘మేజ్’ గుర్తుందా? గజిబిజి గీతలతో కన్ఫ్యూజ్ చేసి.. దారి కనుక్కోమని సవాల్ విసిరే గేమ్. ‘ఓ అదా.. చాలా ఈజీ’ అని భుజాలెగరేయకండి! ఆ మేజ్ అర పేజీలోనో, ఒక పేజీలోనో ఉంటే.. ఈజీగా కనిపెట్టేయొచ్చు. 300 అడుగులున్న మేజ్లో దారి కనిపెట్టడమంటే పద్మవ్యూహంలోకి అడుగు పెట్టడమే. యువ ఇంజనీర్లు లాస్య, ఝాన్సీ ఈ మేజ్‌ను రూపొందించారు. ఇండియాలోనే అతి పెద్ద‘మేజ్ గేమ్’ను తయారు చేసిన ఈ టెక్ ద్వయం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు గిన్నిస్ రికార్డు కోసం కూడా ట్రై చేస్తామని చెబుతున్నారు. హార్లీ డేవిడ్సన్ మేడ్ బై ఇండియన్ హార్లీ డేవిడ్సన్.. అమెరికాలో తయారయ్యే ఈ బైక్స్‌కి మనదగ్గర ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బేసిక్ వర్షన్ హార్లీని తీసుకుని, దానికి అత్యాధునిక హంగులు జోడించి ‘ఔరా!’ అనిపించేలా డిజైన్ చేశాడు రైజా హుస్సేన్. ఏడు లక్షలకు బేసిక్ బైక్ కొని.. మాడిఫికేషన్ కోసం 18 లక్షలు ఖర్చు చేసి స్పోర్ట్స్ మోడల్స్‌ను తలదన్నేలా తయారు చేశాడు. ‘ఈ బైక్ టైర్స్ మిగతా వాటికంటే పూర్తిగా భిన్నమైనవి. విమాన చక్రాలకు వినియోగించే అత్యుత్తమ మెటీరియల్‌ను వాడాం. కేవలం టైర్లకే రూ.5 లక్షలు ఖర్చు పెట్టాం’ అని చెబుతున్నాడు హుస్సేన్. హైదరాబాదీ తయారు చేసిన ఈ ైబె క్‌ను చూసినవారెవరైనా కచ్చితంగా ఇంపోర్టెడ్ అనడం ఖాయం. మరికొన్ని... సాధారణంగా వీల్ చైర్‌ను కంట్రోల్ చేయడానికి జాయ్‌స్టిక్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో వీల్ చైర్‌ను కంట్రోల్ చేయవచ్చని నిరూపించారు బీవీ రాజు ఇనిస్టిట్యూట్ విద్యార్థులు. అంతేకాదు.. సాంకేతికతను ఉపయోగించి వీల్ చైర్‌కు ఓ బెల్ట్‌ను యాడ్ చేశారు. దీన్ని చేతికి పెట్టుకుంటే బీపీ, హార్ట్ అటాక్‌లను గమనించి హెచ్చరించడం ఇందులో విశేషం. అలాగే అంధుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పీకింగ్ మ్యాప్.. ఫొటోలు, వీడియోలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసుకునేందుకు కనిపెట్టిన సరికొత్త ఆన్ లైన్ డైరీ ‘మెమిలాగ్’ వంటివి ఈ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆక ర్షణగా నిలిచాయి. -
వుడ్ ఎక్స్ప్రెషన్
చెక్కముక్కలే కాన్వాస్‌గా... ఉలే కుంచెగా అద్భుత కళారూపాలకు ప్రాణం పోశారు కళాకారులు. అమీర్‌పేట ‘ది ఆర్ట్ స్పేస్’లో గురువారం ప్రారంభమైన ‘వుడ్ కట్ ఆర్ట్ క్యాంప్’లో బహుచక్కని చిత్రాలు ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు మంది వుడెన్ ఆర్ట్ కళాకారులంతా ఒక చోట చేరి నిర్వహించే ఈ వారం రోజుల వర్క్‌షాపులో మరెన్నో కళాకృతులు జీవం పోసుకుంటున్నాయి. మనసులోని ఊహా చిత్రాన్ని ఒక చెక్క పలక పై ప్రతిబింబింపజేయడమే వుడ్‌కట్ ఆర్ట్. కంబ కర్ర అనే ఒక విధమైన కలపను ఇందుకు ఉపయోగిస్తారు. మనసులో ఆలోచనకు చెక్కపై తగిన విధంగా రూపురేఖలు గీసి, ఆ తర్వాత దశల వారీగా పూర్తి చిత్రంగా రూపొందిస్తారు. ఈ దశల్లో ఒకసారి తప్పు జరిగినా మొత్తం చెక్క వేస్టవుతుంది. అందుకే ఒక్కోసారి ఒక కళారూపాన్ని తయారు చేయడానికే నెలలు పడుతుంది. బైబిల్‌ను ముద్రించేందుకు తొలుత వుడ్ కట్ ఆర్ట్‌ను ఉపయోగించిన ట్టు చెబుతారు. కానీ, ఈ విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం జపనీయులే అంటారు ప్రముఖ వుడ్ కట్ ఆర్టిస్ట్, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ టి.సుధాకర్‌రెడ్డి. 40 ఏళ్లుగా ఆయన ఈ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వర్సిటీలో వందల మందికి నేర్పించారు. ‘చెక్కపై భావోద్వేగాలను ప్రస్ఫుటం చేయడమే వుడ్ కట్ ఆర్ట్. దీన్నే ఎక్స్ప్రెషనిజం అంటాం. 18వ శతాబ్దంలో పేపర్ ప్రింటింగ్ వేగవంతం అయ్యాక అక్షరాలను ముద్రించేందుకు వుడ్ కట్ బ్లాక్స్‌ను వాడారు. దేశ ంలో 1970 వరకూ ఈ విధానం ఉండేది. జర్మన్లు చిన్న చిన్న సంకేతాలను చూపడం కోసం వుడ్ కట్‌ను ఉపయోగించారు. నేటికీ వాడుతున్నారు. భారత్‌లో మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ కళపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అందరికంటే తెలుగు వారికే దీనిపై మక్కువ ఎక్కువ’ అని చెప్పారు వర్క్‌షాప్ నిర్వాహకులు, ఆర్టిస్ట్ భార్గవి గుండుల. సిటీలో నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. - ఎస్.శ్రావణ్‌జయ -
ఆవ్ తుఝే మోకోర్తా
గోవా అనగానే.. అందమైన సముద్రం.. కెరటాలు ముద్దాడే తీరం.. ఆ ఇసుక తిన్నెల్లో సేదతీరుతున్న అందాలు.. ఇవే కళ్లముందు కదలాడుతాయి. కాస్త ముదుర్లయితే గోవా టూర్ అనగానే ఎగిరి గంతేస్తారు. పబ్బులు.. పార్టీలు.. కడలిలో ద్వీపాలు.. ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేసే చోటనుకుంటారు. రవి కాంచని చోటును కవే కాదు.. కుంచెకారుడూ చూస్తాడు. అందుకే ఇండియా మ్యాప్‌లో వేలెడంత కూడా కనిపించని ఈ కొంకణ్ తీరాన్ని.. కుంచెతో ఆకాశమంత చూపించారు. గోవాలోని విశేషాలను కాన్వాస్‌పై నిలిపి ‘గోవా ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు గోవాకు చెందిన కళాకారులు. ఈ ఎక్స్పోను సందర్శించినవారంతా ఆవ్ తుఝే మోకోర్తా గోవా (ఐ లవ్ యూ గోవా) అంటున్నారు. - ఎస్.శ్రావణ్‌జయ మన దేశంలోని విభిన్న సంస్కృతులకు నిలయమైన గోవాలో చిత్రకారులు లెక్కకు మించి ఉన్నారు. వారిలో మారియో మిరండా, ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, వాసుదేవ ఎస్ గైటాండే లాంటివారు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవారే. వీరు గీసిన కళారూపాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి గొప్ప కళాకారుల చిత్రాలతో పాటు మరికొంత మంది యువ ఔత్సాహిక చిత్రకారులు గోవా గొప్పదనాన్ని చాటుతూ గీసిన చిత్రరాజాలు ఇప్పుడు హైదరాబాద్ వాకిట వెలిశాయి. గోవాకు చెందిన 22 మంది కళాకారులు వేసిన పెయింటింగ్స్‌తో హైటెక్ సిటీలోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ‘గోవా ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గోవా సంస్కృతి, అక్కడి ప్రజల జీవన చిత్రం.. తమ చిత్రాల్లో చూపించారు. ఫరెవర్ మిరండా.. ప్రముఖ కార్టూనిస్ట్, పెయింటర్ .. మిరండా గీసిన అద్భుతమైన చిత్రం ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విరాజ్ వసంత్ నాయక్ గీసిన ‘కల్చర్ కాన్వర్జేషన్ ఆఫ్ గోవా’.. చిత్రం గోవావాసుల జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ‘గోవాలో చిత్రకారులకు కొదవలేదు. మారియా మిరండా, ఫ్రాన్సిస్, వాసుదేవ్ వంటి వాళ్లు తప్ప మిగిలిన వారి ప్రతిభ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వారి గురించి నలుగురికి తెలియజేయడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం’ అని తెలిపారు గోవాకు చెందిన కళాకారుడు విరాజ్. కుంచె ఘనం.. ఆర్ట్ గ్యాలరీలో తలపండిన మేధావుల చిత్రాల సరసన 20 ఏళ్ల కుర్రాడు సాగర్ నాయక్ ములే గీసిన పెయింటింగ్స్ కళాప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ‘నేను మా టీమ్‌లో పెయింటర్స్ అందరి కంటే చాలా చిన్నవాడిని. గోవా గురించి ఆలోచిస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది ఏసు ప్రభువే. యెహోవా అంతిమ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని క్రూసిఫిక్స్ను రూపొందించాను’ అని వివరించాడు సాగర్. ఇంకా ఎగ్జిబిషన్లో గోవాకు చెందిన కేదార్ దొందు, ప్రదీప్ నాయక్, రాజశ్రీ తక్కర్, అస్మినీ కుమత్, శ్రీపాద గురవ్.. తదితర కళాకారులు గీసిన ఈ చిత్రాల ప్రదర్శన ఈ నెల 28 వరకూ కొనసాగనుంది.