ఆవ్ తుఝే మోకోర్తా
గోవా అనగానే.. అందమైన సముద్రం.. కెరటాలు ముద్దాడే తీరం.. ఆ ఇసుక తిన్నెల్లో సేదతీరుతున్న అందాలు.. ఇవే కళ్లముందు కదలాడుతాయి. కాస్త ముదుర్లయితే గోవా టూర్ అనగానే ఎగిరి గంతేస్తారు. పబ్బులు.. పార్టీలు.. కడలిలో ద్వీపాలు.. ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేసే చోటనుకుంటారు. రవి కాంచని చోటును కవే కాదు.. కుంచెకారుడూ చూస్తాడు. అందుకే ఇండియా మ్యాప్‌లో వేలెడంత కూడా కనిపించని ఈ కొంకణ్ తీరాన్ని.. కుంచెతో ఆకాశమంత చూపించారు. గోవాలోని విశేషాలను కాన్వాస్‌పై నిలిపి ‘గోవా ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు గోవాకు చెందిన కళాకారులు. ఈ ఎక్స్‌పోను సందర్శించినవారంతా ఆవ్ తుఝే మోకోర్తా గోవా (ఐ లవ్ యూ గోవా) అంటున్నారు.
- ఎస్.శ్రావణ్‌జయ
మన దేశంలోని విభిన్న సంస్కృతులకు నిలయమైన గోవాలో చిత్రకారులు లెక్కకు మించి ఉన్నారు. వారిలో మారియో మిరండా, ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, వాసుదేవ ఎస్ గైటాండే లాంటివారు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవారే. వీరు గీసిన కళారూపాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి గొప్ప కళాకారుల చిత్రాలతో పాటు మరికొంత మంది యువ ఔత్సాహిక చిత్రకారులు గోవా గొప్పదనాన్ని చాటుతూ గీసిన చిత్రరాజాలు ఇప్పుడు హైదరాబాద్ వాకిట వెలిశాయి. గోవాకు చెందిన 22 మంది కళాకారులు వేసిన పెయింటింగ్స్‌తో హైటెక్ సిటీలోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ‘గోవా ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గోవా సంస్కృతి, అక్కడి ప్రజల జీవన చిత్రం.. తమ చిత్రాల్లో చూపించారు.
ఫరెవర్ మిరండా..
ప్రముఖ కార్టూనిస్ట్, పెయింటర్ .. మిరండా గీసిన అద్భుతమైన చిత్రం ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విరాజ్ వసంత్ నాయక్ గీసిన ‘కల్చర్ కాన్వర్జేషన్ ఆఫ్ గోవా’.. చిత్రం గోవావాసుల జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ‘గోవాలో చిత్రకారులకు కొదవలేదు. మారియా మిరండా, ఫ్రాన్సిస్, వాసుదేవ్ వంటి వాళ్లు తప్ప మిగిలిన వారి ప్రతిభ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వారి గురించి నలుగురికి తెలియజేయడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం’ అని తెలిపారు గోవాకు చెందిన కళాకారుడు విరాజ్.
కుంచె ఘనం..
ఆర్ట్ గ్యాలరీలో తలపండిన మేధావుల చిత్రాల సరసన 20 ఏళ్ల కుర్రాడు సాగర్ నాయక్ ములే గీసిన పెయింటింగ్స్ కళాప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ‘నేను మా టీమ్‌లో పెయింటర్స్ అందరి కంటే చాలా చిన్నవాడిని. గోవా గురించి ఆలోచిస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది ఏసు ప్రభువే. యెహోవా అంతిమ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని క్రూసిఫిక్స్‌ను రూపొందించాను’ అని వివరించాడు సాగర్. ఇంకా ఎగ్జిబిషన్లో గోవాకు చెందిన కేదార్ దొందు, ప్రదీప్ నాయక్, రాజశ్రీ తక్కర్, అస్మినీ కుమత్, శ్రీపాద గురవ్.. తదితర కళాకారులు గీసిన ఈ చిత్రాల ప్రదర్శన ఈ నెల 28 వరకూ కొనసాగనుంది.