I Love You
-
రాజుగారి అమ్మాయి ప్రేమకథ
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి –నాయుడుగారి అబ్బాయి’. రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మించారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యు..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ‘‘అందమైన ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
అమ్మాయిలు ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెబుతారు? ఆశ్చర్యపరుస్తున్న రిపోర్టు!
గర్ల్‌ఫ్రెండ్ తనబాయ్ ఫ్రెండ్‌కు ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్నిరోజులు పడుతుంది? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించిన పరిశోధకులు పలు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. ఎవరైనా యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఐ లవ్ యూ చెప్పేందుకు 122 రోజులు తీసుకుంటుందని పరిశోధకులు తెలిపారు. యువకులు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేస్తారన్నారు. ఈ పరిశోధనను స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఎబర్ట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. ది బ్రిటీష్ సైకలాజికల్ సొసైటీ ద్వారా వెలువడిన ఈ రిపోర్టులో విభిన్న సంస్కృతులు కలిగిన పలుదేశాల్లోని యువకుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ బృందం ఆస్ట్రేలియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్,పోలాండ్,యూకేలకు చెందిన 3,109 మంది యువతీయువకులను ఈ పరిశోధనలో భాగస్వాములను చేసింది. వీరిలో 70 శాతం మంది యువతులు, 30 శాతం మంది యువకులు ఉన్నారు. వారి ముందు కొన్ని ప్రశ్నలను ఉంచి, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వారు భాగస్వామికి ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 60 శాతం యువకులు తమ గర్ల్‌ప్రెండ్‌కు 69 రోజుల తరువాత ఐ లవ్ యూ చెప్పారని వెల్లడయ్యింది. యువతులతో పోలిస్తే యువకులు 15 రోజుల ముందుగానే తమ గర్ల్‌ఫ్రెండ్‌కు ఐ లవ్ యూ చెబుతుంటారని వెల్లడయ్యింది. యువతులు ఐ లవ్యూ చెప్పేందుకు కనీసంగా 77 రోజులు తీసుకుంటారని, గరిష్టంగా 122 రోజల సమయం తీసుకుంటారని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది కూడా చూడండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
కొత్త జంట.. సెల్‌ఫోన్.. ప్రతిరోజూ 50 సార్లు ఐ లవ్ యూ.. విషాదం
తమిళనాడు: భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని మనస్తా పం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేక భర్తా ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి అయిన నెలరోజులు కూడా గడవకముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన పట్టుకోట్టైలో జరిగింది. పట్టుకోట్టై సమీపంలోని నాటుచాల గ్రామానికి చెందిన సతీష్ (28)కు నెల రోజుల క్రితం సువిత (22)తో వివాహమైంది. వారు ప్రతిరోజూ కనీసం 50 సార్లు ఐ లవ్ యూ అనే సందేశాన్ని పంపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సువిత భర్తకు ఫోన్ చేసింది. అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందింది. మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. సతీష్ ఆమెను వెంటనే పట్టుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. భార్య మృతి చెందడంతో సతీష్ కూడా మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా?
ప్రేమను ఎన్ని పదాల్లోనూ, ఎన్ని విధాల్లోనూ వర్ణించినా తీరనిది. ప్రేమకు భాషతో పని లేదు భావం చాలు.. ఎంతటి వారినైనా ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ప్రేమ మాయలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారంటారు. అలాంటి ప్రేమను గెలవాలంటే మన మనుసులోని మాటను ముందుగా ఎదుటి వారికి తెలియజేయాలి. ప్రేమను తెలిపేందుకు ఎన్ని మార్గాలున్నా.. సూటిగా చెప్పే పదం ఐ లవ్ యూ. దీనినే షార్ట్‌కట్‌లో 143 అంటారు. చంటి పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ల వరకు కూడా ఈ పదం సుపరిచితమే.. మరి 831 224 అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా దీని గురించి విన్నారా..? ప్రస్తుతం ఈ నెంబర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇది ఏంటో తెలుసుకుందాం. 831 224 అనే సంఖ్య కూడా ప్రేమకు సంబంధించినదే. ‘ఐ లవ్ యు టుడే, టుమారో, ఫర్ ఎవర్’ (I love you today, tomorrow, forever) అనే అర్థంలో దీనిని వాడతారు. అయితే ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే.. సాధారణంగా స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ టిక్‌టాక్ వంటి వాటిల్లో 831ను తరుచూ వాడుతుంటారు. 831 అనేది "ఐ లవ్ యు" అని అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే సంక్షిప్త పదం. ఇందులోని ప్రతి సంఖ్యకు నిర్దిష్ట నిర్వచనం ఉంటుంది. 8 = "ఐ లవ్ యు" అనే పదసమూహంలోని మొత్తం అక్షరాల సంఖ్య. 3 = "ఐ లవ్ యు" అనే పద సమూహంలోని మొత్తం పదాల సంఖ్య. 1 = ఈ ఎనిమిది అక్షరాలు, మూడు పదాల అర్థం ఒక్కటే. అయితే 224 సంఖ్యను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాడుతుంటారు. నేడు, రేపు, ఎప్పటికీ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే పదం 2 = ‘టు’డే (ఈరోజు) 2 = ‘టు’మారో(రేపు) 4 = ‘ఫర్’ ఎవర్ (ఎప్పటికీ) ఇప్పుడు తెలిసిందిగా 831 224 నెంబర్‌ను ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో.. ప్రస్తుతం ఈ సంఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాగే ఇటీవల మరో నెంబర్ 5201314 కూడా వైరల్ అయ్యింది. దాని అర్థం "నేను నిన్ను జీవితకాలం ప్రేమిస్తున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం మరి మీ ప్రియురాలు/ ప్రియుడిని ఇలా కొత్తగా, ఢిఫరెంట్‌గా ప్రపోజ్ చేసి చూడండి. చదవండి: Viral Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఏమాత్రం సిగ్గు పడకుండా ఆమెకు ముద్దు పెడుతూ.. -
ఐ లవ్ యూ చెబుతారా?
కన్నడ, తెలుగు భాషల్లో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్ యూ’ చెప్పించారు దర్శకుడు ఆర్. చంద్రు. ప్రేమలో కొత్తకోణం చూపించాం అంటూ తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ తమిళ రీమేక్‌ను కూడా ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్. చంద్రునే డైరెక్ట్ చేస్తారట. ‘‘ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడం సంతోషంగా ఉంది. ఇంకా నటీనటులను ఫైనలైజ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్‌లో కార్తీ నటిస్తే బావుంటుంది అనుకుంటున్నాను. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో చేస్తాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. మరి తమిళంలో కార్తీ ‘నాన్ ఉన్నై కాదలిక్కరేన్’ అని చెబుతారా? అదేనండీ... తమిళంలో ఐ లవ్ యూ చెబుతారా? వేచి చూడాలి. -
‘ఐ లవ్ యూ’ ప్రీ రిలీజ్ వేడుక
-
జూన్ 14న ‘ఐ లవ్ యు’
ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంచలనం సృష్టించిన ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఐ లవ్ యు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు ఉపేంద్ర సిద్ధమౌతున్నాడు. తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 8న విశాఖ సముద్రతీరంలో ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఉపేంద్ర ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ మూవీలో రచిత రామ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో ఆ అంశాలతో పాటు లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. -
మాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి
‘‘ఉపేంద్ర లెగసీ వల్లే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి మాకంటూ ఒక పేరును సంపాదించుకుంటున్నాం. నాతో సహా చాలామందికి ఉపేంద్ర హార్డ్‌వర్క్, అంకితభావం స్ఫూర్తినిస్తాయి ’’ అని నటుడు, దర్శకుడు సుదీప్ అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ లవ్ యు’. ‘నన్నే.. ప్రేమించు’ అనేది ఉపశీర్షిక. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రచితా రామ్ కథానాయికగా నటించారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆర్. చంద్రు స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బెంగళూరులో ఈ సినిమా ప్రీ–రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘ఈగ’ ఫేమ్ సుదీప్ మాట్లాడుతూ– ‘‘ఉపేంద్ర ఇంట్రడక్షన్ సాంగ్ ట్రెండీగా ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇది చూశాక ఉపేంద్రతో మళ్లీ పోటీపడాలనిపిస్తోంది. ఉపేంద్రలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. చంద్రు, ప్రేమ్ వంటి దర్శకులకు ఆయనే స్ఫూర్తి. ఆయన మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నాకు, సుదీప్‌కు 25ఏళ్లుగా పరిచయం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సుదీప్‌లో ఎంత ఫైర్ ఉందో ఇప్పుడూ అంతే ఉంది. దర్శకుడు చంద్రు అద్భుతమైన కథ రాసుకుని పెద్దకలలతో వచ్చాడు’’ అన్నారు ఉపేంద్ర. ‘‘ఉపేంద్రగారు అభిమానుల చక్రవర్తి. ఇండస్ట్రీ కీర్తిప్రతిష్ఠలను ఇతర చిత్రసీమలకు తీసుకెళ్లిన అభినయ చక్రవర్తి సుదీప్‌గారు.. త్వరలో విశాఖ తీరంలో తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు చంద్రు. -
జీరో నుంచి మొదలయ్యా
‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి, పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అవుతున్న టైమ్. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత ‘ఆర్య’ స్క్రిప్ట్ చూసినప్పుడు ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్ చేశారు? అనేది చూశాను. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన చిత్రం ‘ఐ లవ్ యు’. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్. రచితారామ్ హీరోయిన్. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘పెద్ద మనుషులు ఉంటేనే ఇండస్ట్రీ మరింత పెద్దది అవుతుంది. ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకులు, రచయితలు మా ఫంక్షన్‌కి వచ్చి, నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్స్పైర్ అవుతున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. నా సీక్రెట్ ఒక్కటే... నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశా. రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 80 శాతం మంది ఇన్నోసెంట్ పీపుల్ని 20 శాతం మంది రూల్ చేస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను’’ అన్నారు. ‘‘నన్నే.. ప్రేమించు’ లాంటి ట్యాగ్ ఉపేంద్రగారికి మాత్రమే సరిపోతుంది. ‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ మూవీస్ జాబితాలోకి ఈ సినిమా చేరుతుంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ‘‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలకి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలిగేది. ఉపేంద్ర, పూరి జగన్నాథ్‌గార్ల ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది’’ అని దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి అన్నారు. ‘‘నన్ను తెలుగుకు పరిచయం చేసిన లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. ఇండియాలో టాప్ టెన్ దర్శకుల్లో ఉపేంద్రసార్ ఉంటారు అని డైరెక్టర్ శంకర్‌గారు ఓ సందర్భంలో చెప్పారు. అటువంటి గొప్ప దర్శకుణ్ణి రెండోసారి దర్శకత్వం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కథ విన్న ఉపేంద్రగారు ‘ఇది ఒక ‘గీతాంజలి’ అవుతుంది’ అన్నారు’’ అన్నారు ఆర్. చంద్రు. హీరో సుధాకర్ కోమాకుల, నటి సంజన, హైకోర్టు లాయర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మునీంద్ర కె. పుర, కెమెరా: సుజ్ఞాన్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ సూర్య, సంగీతం: డా. కిరణ్. -
ఉపేంద్ర 'ఐ లవ్ యూ' టీజర్ విడుదల
-
ఐలవ్యూ అంటే ఐలవ్యూ..!
ఇండియన్ సినిమా గర్వించే దర్శకుల్లో ఒకరైన దర్శకుడు తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. రొమాన్స్ జానర్ సినిమాల్లో ఈ సినిమాది ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేశారు. తెలుగులో ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? కార్తీక్ ఆమెను మళ్లీ చూశాడు. ఆరోజు ఒక పెళ్లిలో చూసినప్పట్నుంచీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడతను. ఆమె మళ్లీ కనిపించదన్న ఆలోచనే అతనికి ఎలాగో ఉండింది ఇన్నాళ్లూ. ఇప్పుడామె మళ్లీ కనిపించింది. కార్తీక్ ఉన్న లోకల్ ట్రైన్‌కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతోన్న ట్రైన్లో ఆమె కనిపించింది. ఆమె కార్తీక్‌నే చూస్తోంది. కార్తీక్ ఆమెనుండి చూపు తిప్పుకోలేకపోయాడు. కొన్ని క్షణాల్లో ఆ రైళ్లు వాటి వాటి దిశల్లో ముందుకెళ్లిపోయాయి. ఇద్దరూ దూరమైపోయారు. కార్తీక్ ఫ్రెండ్స్‌తో మీటింగ్ పెట్టాడు. ‘‘ఆమె ఎక్కడుంటుందో ఎలాగైనా కనిపెట్టి తీరాలి!’’ అన్నాడు వాళ్లతో. ఆమె మెడిసిన్ స్టూడెంట్ అన్న విషయం, లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుందన్న విషయం తప్ప వాళ్లకు ఇంకేం తెలీదు. కానీ కనిపెట్టారు. ఆ వెంటనే కార్తీక్ ఆమె వెంటపడడాన్ని డైలీ రొటీన్‌గా మార్చేసుకున్నాడు. ఆమె రైలెక్కే ప్లేస్, ఇల్లు.. అన్నీ రౌండ్లు వేయడం మొదలుపెట్టాడు. ఆమెకూ ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. ఒకవిధంగా కార్తీక్ అలా వెంటపడ్డాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది కూడా! ఒకరోజు ఆమె రైల్లో కాలేజీకి వెళుతోంటే, ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు కార్తీక్. ఈ ఐదారు రోజుల్లో అతనామెకు అంత దగ్గరగా వెళ్లడం అదే మొదటిసారి. ఆమె చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కొని అందులో పేరు చూశాడు. ‘‘శాంతి..!’’ అన్నాడు నవ్వుతూ. శాంతి ఏం మాట్లాడలేదు. ‘‘నువ్వంటే నాకిష్టం లేదు. నీమీద ఆశ పడటం లేదు. నువ్వు అందగత్తెవు అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు..’’ రైలు కొంచెం కొంచెం కదులుతూ ఉంటే, చెప్పాలనుకున్నదంతా చెప్పేసి అక్కణ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు కార్తీక్. రైలు కూడా వేగమందుకొని ప్లాట్‌ఫామ్ దాటేసింది. శాంతి సిగ్గుపడుతూ నవ్వింది. తర్వాతిరోజు శాంతి చదువుతున్న కాలేజీకి వెళ్లాడు కార్తీక్. ‘ఇక్కడ కూడా వచ్చిపడ్డాడు..’ అనుకుంటూ శాంతి అతనికి దగ్గరగా వెళ్లింది. అతణ్ని సమీపిస్తున్నా కొద్దీ అంతకంతకూ పెరిగిపోతోన్న సిగ్గుతో ‘‘పేరేంటీ?’’ అనడిగింది. ‘‘కార్తీక్..’’ శాంతి కార్తీక్ వైపు నవ్వుతూ చూసి, ‘‘కార్తీక్! నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్‌లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిలవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్లే బుద్ధిలేకుండా అన్నీ వదిలేసి ఇలా అమ్మాయిల వెంటపడుతుంటారు..’’ అని తిరిగి వెళ్లిపోతూంటే, ‘‘ఏయ్!’’ అన్నాడు కార్తీక్. శాంతి చిన్నగా నవ్వింది, ఆ పిలుపుకి వెనక్కి తిరుగుతూ. ‘‘హేయ్! తను నన్ను చూసి నవ్విందీ..’’ అంటూ గట్టిగా అరుస్తూ ఆ రోజంతా శాంతి పేరే తల్చుకుంటూ కూర్చున్నాడు కార్తీక్. శాంతి ఫోన్ నంబర్ కనుక్కున్నాడు కార్తీక్. ఫోన్ చేశాడు. శాంతి ఫోన్ ఎత్తింది. ‘‘హలో ఎవరూ?’’ ‘‘హలో!’’ అన్నాడు కార్తీక్. ‘‘ఏయ్! నంబర్ ఎలా తెలిసిందీ?’’ ‘‘నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను.’’ ‘‘పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికొచ్చింది. ఫర్వాలేదు.. ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం?’’ ‘‘ఆ! రేపు మా ఇంట్లో ఫంక్షన్.’’ ‘‘అయితే?’’ ‘‘అందుకని నువ్వు రావాలి..’’ ‘‘నేనా? ఎందుకు?’’ ‘‘ఇలా చూడూ! నేన్నిన్ను బీచ్‌కు రమ్మనలేదు. సినిమాకు రమ్మనలేదు. పార్క్‌కు రమ్మనలేదు. ఇంటికేగా రమ్మందీ..’’ ‘‘నేనెందుకు రావడం?’’ ‘‘నువ్విక్కడికి రాకపోతే, నేనే అక్కడికి వస్తాను. చక్కగా చీర కట్టుకొని రా..’’ తను చెప్పాలనుకున్నదంతా చెప్తూ, అడ్రెస్ కూడా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు కార్తీక్. శాంతి చెప్తున్నదేదీ అతను వినిపించుకోలేదు. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్. ‘నేనేందుకు రావాలి?’ అన్న శాంతి కూడా ఆ ఫంక్షన్‌కు వచ్చింది. ఇల్లంతా కార్తీక్ చుట్టాలు. ‘‘ఎవర్రా ఆ అమ్మాయి?’’ కార్తీక్‌ను అడిగింది వాళ్లమ్మ. ‘‘తనే నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి..’’ అన్నాడు కార్తీక్. ఆ మాట కార్తీక్ వాళ్లమ్మతో పాటు అక్కడున్న ఇంకో ఇద్దరు విన్నారు. వెంటనే ‘ఆ అమ్మాయినే అంట.. కార్తీక్ పెళ్లి చేసుకునేది.’ ఇల్లంతా పాకింది ఈ మాట. ఫంక్షన్ అయిపోయింది. శాంతి తిరిగి రైల్లో ఇంటికి వెళ్లిపోతోంది. కార్తీక్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ‘‘అసలు నువ్వెందుకలా అన్నావ్?’’ అడిగింది శాంతి. ‘‘నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అన్లేదే? నేను ఆశపడుతున్నా అన్నాను. అది నిజమేగా!’’ ‘‘నన్నొక మాట అడగొచ్చుగా?’’ ‘‘సరే! ఇప్పుడడుగుతా..’’ ‘‘వద్దు..’’ ‘‘ఏయ్! అడక్కుండా చెప్తే కోప్పడతావ్. అడుగుతానంటే వద్దంటావ్?’’ ‘‘ఏమిటిది పెళ్లీ గిల్లీ అనీ..’’ కార్తీక్ శాంతి చెయ్యి పట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ‘‘ఏయ్! చెప్పనా..?’’ ‘‘ఏంటి?’’ ‘‘ఐలవ్యూ..’’ ‘‘అంటే..? దానర్థమేమిటీ?’’ ‘‘ఐలవ్యూ అంటే ఐలవ్యూ..’’ ‘‘ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా?’’ ‘‘తెలీదు. కానీ ఐ లవ్యూ..’’ కార్తీక్ శాంతికి ఈమాట చెప్పిన కొన్ని రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఆశపడి. -
‘ఎందుకింత మోసం చేశావ్?'
జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు! షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘సోనా... ఐ లవ్యూ. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. నీ ప్రేమ నాకో వరం.’ చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. మంద్రంగా పలుకుతోన్న ఆ స్వరం మత్తెక్కిస్తోంది. అంత వరకూ శూన్యాన్ని చూపులతో కొలిచిన నేను, తన్మయత్వంతో తన ముఖంలోకి చూశాను. చిన్నగా నవ్వాడు. చిలిపిగా కన్ను గీటాడు. సిగ్గు ముంచుకొచ్చింది. తన కళ్లలోకి చూడలేక చప్పున తల దించుకున్నాను. గడ్డం పుచ్చుకుని నా తలను పైకి లేపాడు. ఆ స్పర్శ నాలో ఏవో మధురానుభూతుల్ని రేపుతోంది. నన్ను వివశురాలిని చేస్తోంది. పరవశంతో నా పెదవులు అదురుతున్నాయి. సిగ్గు బరువుతో కనురెప్పలు సోలిపోయాయి. తను నన్ను మరింత దగ్గరకు లాక్కున్నాడు. నడుం చుట్టూ వేసిన తన చేయి మెల్లగా బిగుసుకుంటోంది. నా ముఖం తన వదనానికి చేరువగా వెళ్తోంది. తన శ్వాస నన్ను వెచ్చగా సోకుతోంది. కళ్లు మూసుకుని అనిర్వచనీయమైన ఆ అనుభూతిని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. అంతలో ఓ బలమైన పవనం అత్యంత వేగంగా వచ్చి నా ముఖానికి ఛెళ్లున తగిలింది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. ఎదురుగా ఎవరూ లేరు. ఏ చేయీ నన్ను పెనవేయలేదు. అంటే... ఇదంతా ఊహా? ఎంత అందమైన ఊహ! రైలు వేగంగా పరుగులు తీస్తోంది. భవంతులు, చెట్లూ చేమలూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. స్వర్గలోకంలో పాదం మోపడానికి నేను ముందుకెళ్తుంటే, నా పాత జీవితం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను వదిలి వెనక్కి వెళ్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రైలు హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ఆగింది. కాలు ప్లాట్‌ఫామ్ మీద పెడుతోంటే ఏదో గమ్మత్తయిన ఫీలింగ్ మనసంతా ఆవరించుకుంది. ఆ రోజుతో నా జీవితం ఒక కొత్త రంగు పులుముకోబోతోందన్న ఆలోచనే నన్ను నిలువనీకుండా చేస్తోంది. ఆనందం కెరటమై ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. హుషారుగా ఎగ్జిట్ వైపు నడిచాను. ఓ ఆటోవాణ్ని పిలిచి నేను వెళ్లాల్సిన చోటు చెప్పాను. అరగంట తిరిగేసరికల్లా అక్కడ ఉన్నాను. తనని చూడాలని మనసు తహతహలాడుతోంది. అతని రూపాన్ని తనలో ముద్రించుకోవాలని ఉవ్వి ళ్లూరుతోంది. అసలు ఎవరు తను? ఎలా వచ్చాడు నా జీవితంలోకి? కొన్ని నెలల క్రితం వరకూ ఒకరి పేరు ఒకరికి తెలియదు. ఒక గురించి ఒకరు విన్నది లేదు. అలాంటిది ఈరోజు ఒక్కటి కాబోతున్నాం. ఇద్దరి జీవితాలనూ పెనవేసి ఒక్కటిగా జీవించబోతున్నాం. తనతో మాట్లాడిన మాటలు... తనతో పంచుకున్న భావాలు... అన్నీ యెదలో మెదిలి రొదపెడుతున్నాయి. ఏవేవో చిలిపి ఊహలు మనసంతా పరచుకుని అల్లరి పెడుతున్నాయి. పరిసరాలను సైతం మర్చిపోయి పులకించిపోతున్నాను. అంతలో నా వీనులను తీయగా తాకిందో స్వరం... సోనా! అదే స్వరం. నాతో ఫోన్లో మాట్లాడిన మధురమైన స్వరం. తనే. అది తనే. తనని చూడబోతున్నానన్న సంతోషం సాగరమై ఉప్పొంగుతుంటే విప్పారిన కన్నులతో వెనక్కి తిరిగాను. అంతే... అవాక్కయిపోయాను. జీవమున్న శిలలా నిలబడిపోయాను. సారీ సోనా... లేటయ్యింది’... తను మాట్లాడుతున్నాడు. అంతే మార్దవంగా... అంతే ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు సంతోషం కలగడం లేదేంటి? ఇంత వరకూ నాకు కుదురులేకుండా చేసిన కమ్మని ఊహలు చెదిరిపోయాయేంటి? నా ఆశలన్నీ నా కళ్లముందే ఎండుటాకుల్లా రాలిపోతున్నా యేంటి? ఎవరితను? తన ప్రేమ మత్తులో నన్ను ముంచేసి... కోటి ఆశలు నాలో రేపి... నా వాళ్లను, నా ఊరిని, చివరికి నా రాష్ట్రాన్నే వదిలి వచ్చేంతగా నన్ను మార్చేసిన వ్యక్తి ఇతనా?! మనసు రగిలిపోతుంటే... అణువణువూ అవమానంతో మండిపోతుంటే ఆవేశంగా అన్నాను... ‘ఎందుకింత మోసం చేశావ్?’ నా ప్రశ్నకి అతను షాక్ తినలేదు. సంజాయిషీ కూడా ఇవ్వలేదు. ‘ఇందులో మోసం ఏముంది? నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నా ప్రేమ స్వచ్ఛమైనది. నన్ను నమ్ము.’ నాకు నవ్వొచ్చింది. పిచ్చిదానిలా పగలబడి నవ్వాను. దీనికేమైనా మతి పోయిందా అని చూసేవాళ్లంతా అనుకునేలా విరగబడి నవ్వాను. నవ్వి నవ్వి నరాలు తెగిపోతాయేమోనన్నట్టు తెరలు తెరలుగా నవ్వాను. ఆ నవ్వు తెరలు కన్నీటి పొరలుగా మారేంతవరకూ నవ్వుతూనే ఉన్నాను. ఏమిటి ప్రేమ? ఏది స్వచ్ఛమైన ప్రేమ? ఒకరోజు ఫేస్బుక్లో పాత ఫ్రెండ్స్ కోసం వెతుకుతుంటే హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. పరిచయం ఉన్నవాడిలా పలకరించాడు. స్పందించేవరకూ వేధించాడు. మాట కలిపాడు. మనసును అందంగా అక్షరాల్లో పరిచాడు. రాతలకు ఫుల్స్టాప్ పెట్టి, ఫోన్లో కబుర్లు మొదలెట్టాడు. స్నేహమన్నాడు. దాన్ని ప్రేమగా మార్చేశాడు. ప్రేమకు కొత్త నిర్వచనాలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. సంప్రదాయాలకు ప్రాణమిచ్చే అమ్మానాన్నలు ఒప్పు కోరంటే... తానే అమ్మా నాన్నా అవుతానన్నాడు. తానొక్కడినే అందరి ప్రేమనూ అందించగలనంటూ నమ్మబలికాడు. నిజమే అనుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను. అమ్మానాన్నలకు తెలియకుండా రహస్యంగా రెలైక్కాను. గతాన్ని సమాధి చేసి భవిష్యత్తుకు తనతో కలిసి పునాది వేసుకోవాలనుకున్నాను. కానీ అతను... అతను నా కలల రాకుమారుడు కాడు. కరిగిన వయసును కళ్లకు కడుతోంది అతడి నెరసిన జుత్తు. వృద్ధాప్యపు వాకి ట్లో అప్పటికే అడుగు పెట్టాడని చెబుతోంది ముడతలు పడిన అతడి మేను. నాన్న వయసువాడా? కాదు. అంతకంటే పెద్దవాడేనేమో. ఎంత నటించాడు? ఎంత దారుణంగా మోసం చేశాడు? పిచ్చిగా ప్రేమించాను. తన కోసం కడుపున మోసి కన్న అమ్మని వద్దనుకున్నాను. కళ్లల్లో పెట్టుకుని పెంచిన నాన్నను కాదనుకుని వచ్చేశాను. చూడకుండా ప్రేమించడం గొప్ప అనుకున్నాను కానీ, అదే పెద్ద తప్పవుతుందని ఊహించలేకపోయాను. పోలీసుల సాయంతో వాడి కబంధ హస్తాల నుంచి తప్పించు కున్నాను కానీ, వాడు చేసిన ద్రోహాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అమ్మానాన్నలు నన్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. కానీ సిగ్గుతో మనసు చితికిపోతోంది. నేటికీ వాళ్ల చూపులు ‘ఎందుకిలా చేశావ్’ అని అడుగుతున్నట్టే అనిపిస్తోంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు. నాకే కాదు... నాలా తప్పటడుగులు వేసే ఏ అమ్మాయికీ జవాబు చెప్పే ధైర్యం ఉండదు. అర్హత అంతకన్నా ఉండదు!! - సోనాలి (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఇంటర్నెట్‌ని విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోకుండా నేరాలకు వేదికగా మార్చేయడం నిజంగా దురదృష్టకరం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఇటువంటివాళ్లు ఉన్నారని తెలిసి కూడా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండకపోవడం. తానెవరో ఎలాగూ తెలియదు కదా, ఆ అమ్మాయికి కనబడను కదా అని ఆ వ్యక్తి ధైర్యంగా మోసం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ అమ్మాయి కూడా నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం అతడు చెప్పిన విషయాలు నమ్మేసి, అతని కోసం వచ్చేసింది. తీరా చూశాక గానీ తెలియలేదు అతగాడి నిజస్వరూపం. నేను చెప్పేది ఒకటే. ఇప్పటికైనా అమ్మాయిలు ఫేస్బుక్ పరిచయాల విషయంలో జాగ్రత్తపడితే మంచిది. ఎవరేది చెబితే అదే నిజం అనేసుకోకూడదు. ముందూ వెనుకా ఆలోచించి అడుగేయాలి. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. -
ఆవ్ తుఝే మోకోర్తా
గోవా అనగానే.. అందమైన సముద్రం.. కెరటాలు ముద్దాడే తీరం.. ఆ ఇసుక తిన్నెల్లో సేదతీరుతున్న అందాలు.. ఇవే కళ్లముందు కదలాడుతాయి. కాస్త ముదుర్లయితే గోవా టూర్ అనగానే ఎగిరి గంతేస్తారు. పబ్బులు.. పార్టీలు.. కడలిలో ద్వీపాలు.. ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేసే చోటనుకుంటారు. రవి కాంచని చోటును కవే కాదు.. కుంచెకారుడూ చూస్తాడు. అందుకే ఇండియా మ్యాప్‌లో వేలెడంత కూడా కనిపించని ఈ కొంకణ్ తీరాన్ని.. కుంచెతో ఆకాశమంత చూపించారు. గోవాలోని విశేషాలను కాన్వాస్‌పై నిలిపి ‘గోవా ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు గోవాకు చెందిన కళాకారులు. ఈ ఎక్స్పోను సందర్శించినవారంతా ఆవ్ తుఝే మోకోర్తా గోవా (ఐ లవ్ యూ గోవా) అంటున్నారు. - ఎస్.శ్రావణ్‌జయ మన దేశంలోని విభిన్న సంస్కృతులకు నిలయమైన గోవాలో చిత్రకారులు లెక్కకు మించి ఉన్నారు. వారిలో మారియో మిరండా, ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, వాసుదేవ ఎస్ గైటాండే లాంటివారు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవారే. వీరు గీసిన కళారూపాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి గొప్ప కళాకారుల చిత్రాలతో పాటు మరికొంత మంది యువ ఔత్సాహిక చిత్రకారులు గోవా గొప్పదనాన్ని చాటుతూ గీసిన చిత్రరాజాలు ఇప్పుడు హైదరాబాద్ వాకిట వెలిశాయి. గోవాకు చెందిన 22 మంది కళాకారులు వేసిన పెయింటింగ్స్‌తో హైటెక్ సిటీలోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ‘గోవా ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గోవా సంస్కృతి, అక్కడి ప్రజల జీవన చిత్రం.. తమ చిత్రాల్లో చూపించారు. ఫరెవర్ మిరండా.. ప్రముఖ కార్టూనిస్ట్, పెయింటర్ .. మిరండా గీసిన అద్భుతమైన చిత్రం ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విరాజ్ వసంత్ నాయక్ గీసిన ‘కల్చర్ కాన్వర్జేషన్ ఆఫ్ గోవా’.. చిత్రం గోవావాసుల జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ‘గోవాలో చిత్రకారులకు కొదవలేదు. మారియా మిరండా, ఫ్రాన్సిస్, వాసుదేవ్ వంటి వాళ్లు తప్ప మిగిలిన వారి ప్రతిభ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వారి గురించి నలుగురికి తెలియజేయడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం’ అని తెలిపారు గోవాకు చెందిన కళాకారుడు విరాజ్. కుంచె ఘనం.. ఆర్ట్ గ్యాలరీలో తలపండిన మేధావుల చిత్రాల సరసన 20 ఏళ్ల కుర్రాడు సాగర్ నాయక్ ములే గీసిన పెయింటింగ్స్ కళాప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ‘నేను మా టీమ్‌లో పెయింటర్స్ అందరి కంటే చాలా చిన్నవాడిని. గోవా గురించి ఆలోచిస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది ఏసు ప్రభువే. యెహోవా అంతిమ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని క్రూసిఫిక్స్ను రూపొందించాను’ అని వివరించాడు సాగర్. ఇంకా ఎగ్జిబిషన్లో గోవాకు చెందిన కేదార్ దొందు, ప్రదీప్ నాయక్, రాజశ్రీ తక్కర్, అస్మినీ కుమత్, శ్రీపాద గురవ్.. తదితర కళాకారులు గీసిన ఈ చిత్రాల ప్రదర్శన ఈ నెల 28 వరకూ కొనసాగనుంది. -
అంత సీన్ లేదండీ బాబూ!
మిల్క్ బ్యూటీ తమన్నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పినవాళ్లూ, చెబుతున్నవాళ్లూ చాలామందే ఉన్నారు. మరి, తమన్నా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? ఇంతవరకూ ఆమెకు నచ్చిన వ్యక్తి తారసపడలేదా? ఈ ప్రశ్నలే తమన్నా ముందుంచితే - ‘‘ఒకవేళ ప్రేమలో పడాలని లక్ష్యంగా పెట్టుకుని ఉంటే, ఎవరో ఒకరు నచ్చేవారేమో. కానీ, ఇప్పటివరకు నాకు పరిచయమైనవాళ్లల్లో ఏ అబ్బాయినీ ఆ కోణంలో చూడలేదు. అసలు నాకంత తీరిక ఎక్కడుంది? హీరోయిన్ అయ్యి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లూ ఎలా గడిచిపోయాయో తెలియడంలేదు. ఏదో నిన్నా, మొన్నా వచ్చినట్లుంది’’ అన్నారు. డేటింగ్ పై మీ అభిప్రాయం? అనడిగితే - ‘‘బాగానే ఉంటుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకూ ఆ అనుభవం లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడానికే కష్టంగా ఉంది. ఇక, మిగతావాటికి ఎక్కడ టైముంటుంది? ఇప్పట్లో డేటింగ్ చేసే సీన్ లేదండీ బాబూ. ప్రస్తుతం నా ప్రేమనంతా సినిమాలకు అంకితం చేసేశా’’ అని తమన్నా తెలిపారు. -
అంతకు మించి...ఐ లవ్ యు
సినోయెమ్ సౌందర్యంతో కాలుస్తావో మోహపు మంట ఎగదోస్తావో విరహపు చింత రగిలిస్తావో అంతకు మించి ప్రేమించి బూడిదే చేస్తావో ప్రియురాలా! ఐ లవ్ యు రంగుల కళల్ని కళ్లలో జల్లుతావో రసాత్మకమైన వాక్యపు దండకే గుచ్చుతావో పారవశ్యపు నాట్యభంగిమ కిందే నలిపేస్తావో రాగసాగర దీవిలో ఒంటరిగా వదిలిపెడతావో అంతకు మించి జీవించడమే అసలైన కళ అని కణకణానికీ ఇంజెక్ట్ చేస్తావో సృజనశీలా! ఐ అడ్మైర్ యు మరింత మాయ చేస్తావో మరో లోయలోకి మళ్లీ తోస్తావో అంతకు మించి కుట్రతో హృదయాన్ని పదవీచ్యుతుణ్ని చేసి లోపలి ప్రపంచానికి నువ్వే రాజువవుతావో మనసా! ఐ అబ్జర్వ్ యు జీవితపు కషాయాన్ని తాగిస్తావో నిర్జీవ క్షణాలముందు దోషిగా నిలబెడతావో నన్ను చూసి నేనే నవ్వుకోలేకపోయిన రోజుల్ని వెక్కిరిస్తావో అంతకు మించి అకారణ ఆనందాన్ని యావజ్జీవం విధిస్తావో తాత్వికుడా! ఐ ఇన్వైట్ యు అనంతరం ఆకాశానికే అప్పగిస్తావో దాని అవతలికే విసిరేస్తావో అంతకు మించి విశాల విశ్వంలో మానవుడి నూరేళ్ల అల్పాయుష్షుని గుర్తుచేసి హఠాత్తుగా కలవరపెడతావో మృత్యువా! ఐ రిమెంబర్ యు (‘అంతకు మించి’... శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’లోని అతి ముఖ్యమైన డైలాగ్. ఆ డైలాగ్ సృష్టికర్తకు ఈ యాంటీవైరస్ కవిత అంకితం.) -
ఐ లవ్ యూ చెప్పలేదని..
మూడేళ్ల చిన్నారిపై ఎనిమిదేళ్ల బాలుడి హత్యాయత్నం మదనపల్లె: మూడేళ్ల బాలిక ‘ఐ లవ్ యూ’ అని చెప్పలేదని ఎనిమిది సంవత్సరాల బాలుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. స్థానిక కాలనీలో కూలి పనులు చేసుకుంటూ ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక తనకు ఐ లవ్ యూ చెప్పలేదని పక్కనే నివాసముంటున్న ఎనిదేళ్ల బాలుడు (3వ తరగతి విద్యార్థి) ఆగ్రహించాడు. ఇంటికి సమీపంలోకి తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పాలని వేధించాడు. ఎంతకీ ఆ బాలిక చెప్పకపోవడంతో తాడుతో గొంతుకు ఉరేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. టుటౌన్ పోలీసులు ఆ బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయం
Those three little words అర్థం: Those three little words = The words ''I love you'' వాక్య ప్రయోగం: After several months of dating the young man finally said those three little words to his girlfriend. ఎన్నో నెలల ప్రేమ వ్యవహారం తర్వాత చివరకు ఆ యువకుడు తన ప్రియురాలికి ‘ఐ లవ్ యూ’ అనే ప్రేమ మాటలు చెప్పాడు. వివరణ: మనలో చాలా మంది ప్రేమిస్తారు. ప్రేమించే వారిలో కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్త, స్నేహితులు, ప్రియుడు లేదా ప్రియురాలు ఎవరైనా ఉండొచ్చు. ప్రియుడు, ప్రియురాలికి సంబంధించి sensuous/sensual love, platonic love అని రెండు రకాల ప్రేమ గురించి ఆంగ్లంలో ప్రస్తావిస్తారు. sens- uous/ sensual love శారీరక ఆకర్షణకు సంబంధించింది. ఇది ఇంద్రియాల స్పంద నకు లోనై ఉంటుంది. గ్రీకు తత్వవేత్త ప్లేటో platonic love ను ఇంద్రియాలకు అతీతమైందిగా నిర్వచించాడు. ‘ఐ లవ్ యూ(నేను నిన్ను ప్రేమిస్తున్నాను) అనే ఆ ప్రేమ మాటలు’, ‘ఐ లవ్ యూ అనే ఆ మూడు ఇంగ్లిషు ప్రేమ ముక్కలు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడుతున్నాం. Almost in all movies, hero and heroine would eagerly wait for hearing those three little words from each other. అంటే దాదాపు అన్ని సినిమాల్లో కథానాయకుడు, కథా నాయకురాలు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే ఆ మూడు ప్రేమ మాటల్ని ఒకరి నుంచి ఒకరు వినడానికి ఉవ్విళ్లూరు తుంటారని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com