
బంజారాహిల్స్: నిన్ను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. సర్‌ప్రైజ్ చేస్తానంటూ హోటల్ గదికి తీసుకెళ్లాడు. శుక్రవారం వాలెంటైన్స్ డే కదా.. ఇదిగో గులాబీ పువ్వు తీసుకో అంటూ ఆమెకు ఇచ్చాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్‌లోని ఓ ఫర్నిచర్ షాప్ లో ఖాజామోహినుద్దీన్ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఓ వివాహిత ఈ షాపులో సేల్స్ గర్ల్‌గా చేరింది. మరుసటి రోజు నుంచి ఖాజా మోహినుద్దీన్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడసాగాడు. తనకు ఇప్పటికే వివాహమైందని చెప్పగా భర్త నుంచి విడాకులు తీసుకోవాలని సూచించాడు. దీంతో ఖాజా మోహినుద్దీన్ ప్రేమను ఆమె అంగీకరించింది.
ఈ నేపథ్యంలో ఖాజామొహినుద్దీన్ నీకు సర్‌ప్రైజ్ అంటూ బుధవారం ఆమెను బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ గదికి తీసుకెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. మాయమాటలతో లోబర్చుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఖాజామోహినుద్దీన్ భార్యల పేరుతో వేర్వేరు నంబర్లతో బాధితురాలికి ఫోన్‌లో బెదిరింపులు రాసాగాయి. ఖాజాకు దూరంగా ఉండాలని.. అతడిని పెళ్లి చేసుకుంటే నీ అంతు చూస్తామంటూ హెచ్చరించసాగారు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ.. ఖాజామోహినుద్దీన్‌తో పాటు ఈ వ్యవహారానికంతటికీ కారకుడైన తజ్‌ముల్ హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడంతో పాటు తనను మానసికంగా హింసించి.. ఆత్మహత్యా యత్నానికి సైతం ఉసిగొల్పారని, హత్య చేస్తానని బెదిరిస్తున్న నిందితులిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment