‘ఎందుకింత మోసం చేశావ్?' | She alert: old man cheated cheating through facebook | Sakshi
Sakshi News home page

‘ఎందుకింత మోసం చేశావ్?'

Published Wed, Apr 1 2015 8:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

‘ఎందుకింత మోసం చేశావ్?'

‘ఎందుకింత మోసం చేశావ్?'

జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు!
షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!

 
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
 
‘సోనా... ఐ లవ్యూ. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. నీ ప్రేమ నాకో వరం.’  చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. మంద్రంగా పలుకుతోన్న ఆ స్వరం మత్తెక్కిస్తోంది. అంత వరకూ శూన్యాన్ని చూపులతో కొలిచిన నేను, తన్మయత్వంతో తన ముఖంలోకి చూశాను. చిన్నగా నవ్వాడు. చిలిపిగా కన్ను గీటాడు. సిగ్గు ముంచుకొచ్చింది. తన కళ్లలోకి చూడలేక చప్పున తల దించుకున్నాను. గడ్డం పుచ్చుకుని నా తలను పైకి లేపాడు. ఆ స్పర్శ నాలో ఏవో మధురానుభూతుల్ని రేపుతోంది. నన్ను వివశురాలిని చేస్తోంది. పరవశంతో నా పెదవులు అదురుతున్నాయి. సిగ్గు బరువుతో కనురెప్పలు సోలిపోయాయి. తను నన్ను మరింత దగ్గరకు లాక్కున్నాడు. నడుం చుట్టూ వేసిన తన చేయి మెల్లగా బిగుసుకుంటోంది. నా ముఖం తన వదనానికి చేరువగా వెళ్తోంది. తన శ్వాస నన్ను వెచ్చగా సోకుతోంది. కళ్లు మూసుకుని అనిర్వచనీయమైన ఆ అనుభూతిని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. అంతలో ఓ బలమైన పవనం అత్యంత వేగంగా వచ్చి నా ముఖానికి ఛెళ్లున తగిలింది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. ఎదురుగా ఎవరూ లేరు. ఏ చేయీ నన్ను పెనవేయలేదు. అంటే... ఇదంతా ఊహా? ఎంత అందమైన ఊహ!

రైలు వేగంగా పరుగులు తీస్తోంది. భవంతులు, చెట్లూ చేమలూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. స్వర్గలోకంలో పాదం మోపడానికి నేను ముందుకెళ్తుంటే, నా పాత జీవితం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను వదిలి వెనక్కి వెళ్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రైలు హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆగింది. కాలు ప్లాట్‌ఫామ్ మీద పెడుతోంటే ఏదో గమ్మత్తయిన ఫీలింగ్ మనసంతా ఆవరించుకుంది. ఆ రోజుతో నా జీవితం ఒక కొత్త రంగు పులుముకోబోతోందన్న ఆలోచనే నన్ను నిలువనీకుండా చేస్తోంది. ఆనందం కెరటమై ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. హుషారుగా ఎగ్జిట్ వైపు నడిచాను. ఓ ఆటోవాణ్ని పిలిచి నేను వెళ్లాల్సిన చోటు చెప్పాను. అరగంట తిరిగేసరికల్లా అక్కడ ఉన్నాను.

తనని చూడాలని మనసు తహతహలాడుతోంది. అతని రూపాన్ని తనలో ముద్రించుకోవాలని ఉవ్వి ళ్లూరుతోంది. అసలు ఎవరు తను? ఎలా వచ్చాడు నా జీవితంలోకి? కొన్ని నెలల క్రితం వరకూ ఒకరి పేరు ఒకరికి తెలియదు. ఒక గురించి ఒకరు విన్నది లేదు. అలాంటిది ఈరోజు ఒక్కటి కాబోతున్నాం. ఇద్దరి జీవితాలనూ పెనవేసి ఒక్కటిగా జీవించబోతున్నాం. తనతో మాట్లాడిన మాటలు... తనతో పంచుకున్న భావాలు... అన్నీ యెదలో మెదిలి రొదపెడుతున్నాయి. ఏవేవో చిలిపి ఊహలు మనసంతా పరచుకుని అల్లరి పెడుతున్నాయి. పరిసరాలను సైతం మర్చిపోయి పులకించిపోతున్నాను. అంతలో నా వీనులను తీయగా తాకిందో స్వరం... సోనా! అదే స్వరం. నాతో ఫోన్లో మాట్లాడిన మధురమైన స్వరం. తనే. అది తనే. తనని చూడబోతున్నానన్న సంతోషం సాగరమై ఉప్పొంగుతుంటే విప్పారిన కన్నులతో వెనక్కి తిరిగాను. అంతే... అవాక్కయిపోయాను. జీవమున్న శిలలా నిలబడిపోయాను.

 సారీ సోనా... లేటయ్యింది’... తను మాట్లాడుతున్నాడు. అంతే మార్దవంగా... అంతే ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు సంతోషం కలగడం లేదేంటి? ఇంత వరకూ నాకు కుదురులేకుండా చేసిన కమ్మని ఊహలు చెదిరిపోయాయేంటి? నా ఆశలన్నీ నా కళ్లముందే ఎండుటాకుల్లా రాలిపోతున్నా యేంటి? ఎవరితను? తన ప్రేమ మత్తులో నన్ను ముంచేసి... కోటి ఆశలు నాలో రేపి... నా వాళ్లను, నా ఊరిని, చివరికి నా రాష్ట్రాన్నే వదిలి వచ్చేంతగా నన్ను మార్చేసిన వ్యక్తి ఇతనా?! మనసు రగిలిపోతుంటే... అణువణువూ అవమానంతో మండిపోతుంటే ఆవేశంగా అన్నాను... ‘ఎందుకింత మోసం చేశావ్?’

నా ప్రశ్నకి అతను షాక్ తినలేదు. సంజాయిషీ కూడా ఇవ్వలేదు. ‘ఇందులో మోసం ఏముంది? నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నా ప్రేమ స్వచ్ఛమైనది. నన్ను నమ్ము.’ నాకు నవ్వొచ్చింది. పిచ్చిదానిలా పగలబడి నవ్వాను. దీనికేమైనా మతి పోయిందా అని చూసేవాళ్లంతా అనుకునేలా విరగబడి నవ్వాను. నవ్వి నవ్వి నరాలు తెగిపోతాయేమోనన్నట్టు తెరలు తెరలుగా నవ్వాను. ఆ నవ్వు తెరలు కన్నీటి పొరలుగా మారేంతవరకూ నవ్వుతూనే ఉన్నాను. ఏమిటి ప్రేమ? ఏది స్వచ్ఛమైన ప్రేమ? ఒకరోజు ఫేస్‌బుక్‌లో పాత ఫ్రెండ్స్ కోసం వెతుకుతుంటే హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. పరిచయం ఉన్నవాడిలా పలకరించాడు. స్పందించేవరకూ వేధించాడు. మాట కలిపాడు. మనసును అందంగా అక్షరాల్లో పరిచాడు.  రాతలకు ఫుల్‌స్టాప్ పెట్టి, ఫోన్‌లో కబుర్లు మొదలెట్టాడు. స్నేహమన్నాడు. దాన్ని ప్రేమగా మార్చేశాడు. ప్రేమకు కొత్త నిర్వచనాలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. సంప్రదాయాలకు ప్రాణమిచ్చే అమ్మానాన్నలు ఒప్పు కోరంటే... తానే అమ్మా నాన్నా అవుతానన్నాడు. తానొక్కడినే అందరి ప్రేమనూ అందించగలనంటూ నమ్మబలికాడు. నిజమే అనుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను. అమ్మానాన్నలకు తెలియకుండా రహస్యంగా రెలైక్కాను. గతాన్ని సమాధి చేసి భవిష్యత్తుకు తనతో కలిసి పునాది వేసుకోవాలనుకున్నాను.

కానీ అతను... అతను నా కలల రాకుమారుడు కాడు. కరిగిన వయసును కళ్లకు కడుతోంది అతడి నెరసిన జుత్తు. వృద్ధాప్యపు వాకి ట్లో అప్పటికే అడుగు పెట్టాడని చెబుతోంది ముడతలు పడిన అతడి మేను. నాన్న వయసువాడా? కాదు. అంతకంటే పెద్దవాడేనేమో. ఎంత నటించాడు? ఎంత దారుణంగా మోసం చేశాడు? పిచ్చిగా ప్రేమించాను. తన కోసం కడుపున మోసి కన్న అమ్మని వద్దనుకున్నాను. కళ్లల్లో పెట్టుకుని పెంచిన నాన్నను కాదనుకుని వచ్చేశాను. చూడకుండా ప్రేమించడం గొప్ప అనుకున్నాను కానీ, అదే పెద్ద తప్పవుతుందని ఊహించలేకపోయాను. పోలీసుల సాయంతో వాడి కబంధ హస్తాల నుంచి తప్పించు కున్నాను కానీ, వాడు చేసిన ద్రోహాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అమ్మానాన్నలు నన్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. కానీ సిగ్గుతో మనసు చితికిపోతోంది. నేటికీ వాళ్ల చూపులు ‘ఎందుకిలా చేశావ్’ అని అడుగుతున్నట్టే అనిపిస్తోంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు. నాకే కాదు... నాలా తప్పటడుగులు వేసే ఏ అమ్మాయికీ     జవాబు చెప్పే ధైర్యం ఉండదు. అర్హత అంతకన్నా ఉండదు!!
     - సోనాలి (గోప్యత కోసం పేరు మార్చాం)
 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
 
ఇంటర్నెట్‌ని విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోకుండా నేరాలకు వేదికగా మార్చేయడం నిజంగా దురదృష్టకరం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఇటువంటివాళ్లు ఉన్నారని తెలిసి కూడా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండకపోవడం. తానెవరో ఎలాగూ తెలియదు కదా, ఆ అమ్మాయికి కనబడను కదా అని ఆ వ్యక్తి ధైర్యంగా మోసం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ అమ్మాయి కూడా నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం అతడు చెప్పిన విషయాలు నమ్మేసి, అతని కోసం వచ్చేసింది.  తీరా చూశాక గానీ తెలియలేదు అతగాడి నిజస్వరూపం. నేను చెప్పేది ఒకటే. ఇప్పటికైనా అమ్మాయిలు ఫేస్‌బుక్ పరిచయాల విషయంలో జాగ్రత్తపడితే మంచిది. ఎవరేది చెబితే అదే నిజం అనేసుకోకూడదు. ముందూ వెనుకా ఆలోచించి అడుగేయాలి. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement