she alert
-
'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘మధూ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే... నువ్వు లేకుండా బతకలేనంత. నీకోసం ప్రాణమైనా ఇవ్వగలిగేంత. ఐలవ్యూ మధూ’ సురేశ్ మాటలు చెవిన పడుతున్నాయి. కానీ అదేంటో... నా మనసులో ఎలాంటి భావమూ లేదు. అది పెద్దగా స్పందించడం లేదు. పరవశించి పరవళ్లు తొక్కడం లేదు. నిశ్చలంగా ఉంది. ‘ఏంటి మధూ... ఏం మాట్లాడవేంటి?’... నా సమాధానం కోసం ఎక్కువసేపు ఎదురుచూడలేనట్టు ఆతృతగా అడిగాడు సురేశ్. త్వరగా పెదవి విప్పు అన్నట్టుగా నా ముఖంలోకే చూస్తూ నిలబడ్డాడు. జవాబు కోసం కంగారుగా కళ్లలో వెతుకుతున్నాడు. కనిపించలేనట్టుంది. కాస్త నిరాశగా ముఖం పెట్టాడు. ‘నేను నీతో ఒకటి చెప్పాలి సురేశ్. అది విన్న తర్వాత నీ నిర్ణయం చెప్పు’ అన్నాను. ‘త్వరగా చెప్పు/ అంటూ వినడానికి సమాయత్తమయ్యాడు. నేను చెప్పాను. అంతా చెప్పాను. ఏదీ దాచకుండా చెప్పేశాను. అంతే... సురేశ్ ముఖం మ్లానమయ్యింది. మౌనంగా అయిపోయాడు. కాసేపు దిక్కులు చూశాడు. క్షణం తర్వాత తేరుకుని అన్నాడు... ‘సారీ మధూ. ఓ అర్జంటు పని గుర్తొచ్చింది. మళ్లీ కలుస్తాను’ అంటూ వెళ్లిపోతుంటే ఫక్కున నవ్వాన్నేను. తెరలు తెరలుగా తన్నుకొస్తోన్న నవ్వును తొక్కిపట్టే ప్రయత్నం చేయకుండా విరగబడి నవ్వాను. నవ్వీ నవ్వీ చివరికి అలసిపోయి ఆగిపోయాను. నీకేమైనా పిచ్చా అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు సురేశ్. అవును. నాకు పిచ్చే. నిజంగా పిచ్చే. లేదంటే ఇలా ఎందుకు నవ్వుతాను? ఎగసిపడుతోన్న బాధను యెద గోడల మధ్య దాచేసి... ఏమీ లేనట్టు, ఏదీ ఎరగనట్టు ఎందుకిలా పగలబడి నవ్వుతాను? నాకు పిచ్చే. లేదంటే... మూగబోయిన మనసును ఎవరో వచ్చి మళ్లీ పలికిస్తానంటే సంతోషపడాల్సింది పోయి, నిజాలు నిక్కచ్చిగా చెప్పి, అది విన్న వ్యక్తి ఛీ అన్నట్టుగా చూస్తుంటే ఏడవకుండా నరాలు తెగిపోయేంతగా పడీ పడీ ఎందుకు నవ్వుతాను? పిచ్చే. నాకు పిచ్చే. కానీ ఈ పిచ్చి ఒకప్పుడు లేదు. ఇంత నటన నాకు ఒకప్పుడు చేతగాదు. అప్పుడు నేను నిజంగానే నవ్వేదాన్ని. మల్లెలు విరిసినట్టు.. వెన్నెల విరబూసినట్టు.. హిమం కురిసినట్టు.. స్వచ్ఛంగా, నిండుగా నవ్వేదాన్ని. ఆ నవ్వు నాకు మా నాన్న ఇచ్చారు. ఆయనెప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వెంటాడి వేధించినా నవ్వుతూనే వాటితో పోరాడేవారు. సంపదలు చేజారినా, అయినవాళ్లు మోసగించినా నవ్వుతూనే అన్నిటినీ అధిగమించేవారు. చివరికి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు, రోగం ముదిరి మృత్యువు ఆయనను కౌగిలించుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన నవ్వుతూనే వెళ్లిపోయారు. కానీ ఆ క్షణమే నా పెదవుల మీది నుంచి నవ్వు చెరిగిపోయింది. అమ్మ నన్ను చిన్ననాట వదిలి వెళ్తే... నాన్న యవ్వనంలో వదిలిపోయారు. వెంటాడే వాళ్ల జ్ఞాపకాలు... భయపెట్టే ఒంటరి క్షణాలు... బతుకును భారంగా మార్చేశాయి. ఏం చేయాలో తెలీదు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. అంతా చీకటి. ఏ దారీ కనిపించని చిక్కనిచీకటి. అప్పుడే ఉన్నట్టుండి నాన్నగారి చెల్లెలు వచ్చింది. ఆమె పుట్టగానే మా నానమ్మా తాతయ్యా చనిపోతే నాన్నే పెంచారట. కానీ నాన్న మాటను కాదని ప్రేమించినవాడితో వెళ్లి పోయింది. అమ్మానాన్నా అయి పెంచిన అన్నని పగవాడిలా చూస్తూ ఇన్నేళ్లూ గడిపింది. కానీ ఆయన మరణవార్త తెలిశాక ఆగలేక వచ్చేసింది. నా అన్నవాళ్లు లేక నిస్పృహతో ఉన్న నన్ను అక్కున చేర్చుకుంది. నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అంత వేదనలోనూ ఓ చిన్న ఓదార్పు. నాకంటూ కొందరు ఉన్నారన్న ధైర్యం. గతాన్ని మెల్లగా మర్చిపోవాలనుకున్నాను. భవిష్యత్తును మలచుకుందామనుకున్నాను. కానీ అది సాధ్యం కాదనీ, నా భవిష్యత్తును అప్పటికే మా అత్త భర్త మరోలా లిఖించేశాడనీ తెలుసుకోలేకపోయాను. అత్తయ్య తొలిసారి ఇంటికి తీసుకెళ్లినప్పుడు నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు మావయ్య. ఆ ఆప్యాయత ఆయన్ను నా మనసులో నాన్న స్థానంలో నిలబెట్టింది. కానీ ఆ నాగుపాము ఎప్పటికీ నాన్న కాలేదని తర్వాత తెలిసింది. అతనో దుర్మార్గుడు. పెళ్లానికీ కూతురికీ తేడా తెలియని కామాంధుడు. అక్కడ అడుగు పెట్టినప్పుడే నామీద కన్ను వేశాడు. అదను కోసం కాపు కాశాడు. అత్తయ్య లేని క్షణం చూసి పడగ విప్పాడు. నేను తన నిజ స్వరూపాన్ని గ్రహించేలోపే కాటు వేశాడు. నా భవితను కాలరాశాడు. నా బతుకును కన్నీటిపాలు చేసేశాడు. అంతటితో ఆగలేదు. తన వ్యాపార అవసరాల కోసం నన్ను మరికొందరి అవసరాలు తీర్చమన్నాడు. కాదంటే తనకు తోచిన రీతిలో కసి తీర్చుకునేవాడు. అత్తతో చెబుదామను కున్నాను. కానీ ఆ నీచుడు నాకా అవకాశం ఇవ్వలేదు. నోరు విప్పితే నిందల పాలు చేస్తానన్నాడు. నేనే తనని రెచ్చగొట్టానని అత్తయ్యకు చెబుతానన్నాడు. అతడి కోసం కళ్లలో పెట్టుకుని పెంచిన నాన్ననే కాదన్న అత్త... ఇవాళ అతడి కోసం నన్ను తప్పుడు మనిషిగా ఎంచదన్న నమ్మకం ఏముంది! అందుకే నోటికి తాళం వేసుకున్నాను. నిజాన్ని పెదవుల మాటున నొక్కిపెట్టేశాను. దాంతో నా బతుకు మరీ నరకమైపోయింది. నా తనువు అతని స్నేహితుల చేతుల్లో వందలసార్లు నలిగిపోయింది. నా మనసు వేలసార్లు చచ్చిపోయింది. తట్టుకోలేకపోయాను. తెగించాలని నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తి దగ్గరకు నన్ను పంపినప్పుడు తప్పించుకు పారిపోయాను. ఎలాగో ఓ స్వచ్ఛంద సంస్థ నీడకి చేరాను. వారి సాయంతో నా కాళ్లమీద నేను నిలబడ్డాను. అప్పుడే పరిచయమయ్యాడు సురేశ్. నన్ను ప్రేమించానన్నాడు. నేను లేకపోతే చచ్చిపోతా నన్నాడు. దాంతో నా గతాన్ని అతని ముందు పరిచాను. గతుక్కుమన్నాడు. నువ్వు నా ప్రాణం అన్నవాడు కాస్తా నా మానం పోయిందని తెలిసి తన మానాన తను వెళ్లిపోయాడు. నేను లేకపోతే చచ్చిపోతాను అన్నవాడు నాతో బతకడం ఇష్టం లేదంటూ ముఖం తిప్పుకుని వెళ్లిపోయాడు. అంత వరకూ పొంగి పొర్లిన ప్రేమ నేను పతితనని తెలియగానే మాయమైపోయింది. నన్ను చిన్నచూపు చూసి వెళ్లిపోయింది. అంతే. ఆరోజే నిర్ణయించుకున్నాను... ఇక ఏ మగవాడినీ నా చేరువకు రానివ్వకూడదని. నిజం దాచి దగ్గర కాలేను. మోసగించి మనువాడలేను. అలా అని నిజం చెప్పి ఇలా ఛీత్కారానికి గురవ్వనూలేను. అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను. నాకూ ఆశలున్నాయన్న సంగతిని పూర్తిగా విస్మరించాను. తోడు కోరుకోవడం మాని నేను మోడులా బతుకుతున్నాను. తోచిన దారిలో సాగిపోతున్నాను. అంతకంటే ఏం చేయను!! - మధుమిత (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి అందరూ ఒకలా ఉండరు. సురేశ్ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తారస పడతారు. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరికీ దగ్గర కాకూడదు అన్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నిజం చెప్పి తీరాలన్న రూలేమీ లేదు కదా! అందరూ మెచ్యూర్డగా ఉండకపోవచ్చు. అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి బాధపెట్టే నిజాన్ని చెప్పడం కంటే మనసులోనే సమాధి చేసెయ్యడం మంచిది. జరిగినదాన్ని ఓ యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవడమే మంచిది. మధుమిత అనుకున్నట్టు అది మోసం కాదు. పాపం తనే మోసపోయింది. ఎవరో చేసిన ద్రోహానికి బలయ్యింది. అందులో ఆమె తప్పేమీ లేదు. అందుకే తన గతాన్ని చెప్పకపోవడం మోసం ఎప్పటికీ అవ్వదు. కాబట్టి అదంతా తను పూర్తిగా మర్చిపోవడమే మంచిది. డా॥శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై. సైకియాట్రిస్టు ప్రభుత్వ మానసిక చికిత్సాలయం ఎర్రగడ్డ, హైదరాబాద్ -
ప్రేమించాను.. అది కూడా తప్పేనా?
షీ అలర్ట్ ! : మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘సందీప్... ఒక్కసారి నేను చెప్పేది విను... ప్లీజ్’... పిచ్చిదానిలా అరుస్తున్నాను. తనకెదురుగా నేలమీద కూర్చుని ఉన్నాను. నా రెండు చేతులతో తన కాళ్లు పట్టుకున్నాను. తల పెకైత్తి తన ముఖంలోకి చూస్తున్నాను. నా మాట వినమని అర్థిస్తున్నాను. కానీ తన నుంచి స్పందన లేదు. నా వైపే చూడటం లేదు. తన ముఖంలోని హావభావాలను గమనిస్తుంటే తనసలు నా మాట వింటున్నట్టే అనిపించడం లేదు. మనసు చివుక్కుమంది. బాధ పొంగుకొస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తననెలా కన్విన్స చేయాలో తెలియట్లేదు. నా భావాలన్నింటినీ మాటలుగా మార్చి తన చెవిని వేశాను. నా బాధనంతా కన్నీటిగా రాల్చి తన కాళ్లు కడిగాను. అయినా తను కరగలేదు. కనికరించలేదు. కఠిన శిలలా నిలబడ్డాడు. శూన్యాన్ని కొలిచాడే తప్ప తన చూపులను నావైపు ప్రసరింపనీయలేదు.క్షణాలు గడిచాయి. నిమిషాలు కరిగాయి. మా మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అది తనలో అసహనాన్ని పెంచింది. విసుగ్గా కదిలాడు. తన కాళ్లతోనే నా చేతులను తోసేసి విసవిసా నడచుకుంటూ వెళ్లిపోయాడు. సందీప్! సందీప్!! నా స్వరం అంతకంతకూ హెచ్చుతోంది. తనను తిరిగి రమ్మంటూ వేడుకుంటోంది. కానీ ఫలితం లేదు. తను వెళ్లిపోయాడు. నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. శాశ్వతంగా వదిలించుకుని వెళ్లిపోయాడు. నా ఆశల్ని తన పాదాల కింద నలిపేసి, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. నేను మిగిలాను. నేను మాత్రమే మిగిలాను. వెక్కి వెక్కి ఏడుస్తూ... ఎగసిపడుతోన్న కన్నీటి కెరటాల్లో పడి లేస్తూ... అక్కడే కూర్చుండిపోయాను. ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? ఇది ఎవరి తప్పు? నాదా? నా ప్రేమదా? ఎవరిది? మనసు ఘోషిస్తోంది. ఆ ఘోష నాకు మాత్రమే వినిపిస్తోంది. తనకి కూడా వినిపిస్తే ఎంత బాగుండేది! తనను పట్టి లాగి వెనక్కి తీసుకొస్తే నా జీవితం ఎంత గొప్ప మలుపు తిరిగుండేది!! కానీ అలా జరగలేదు. అతను తిరిగి రాలేదు. ఎంతగా ప్రేమించాను తనని! ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. కాలేజీలో తొలిసారి అడుగుపెట్టాను. అసలే ఇంజినీరింగ్ కాలేజీ. ర్యాగింగ్ ఎక్కువ ఉంటుందని మా కజిన్ చెప్పాడు. అందుకే భయంభయంగా నడుస్తున్నాను. ఎవరైనా దగ్గరకు వస్తారేమో, ఏమైనా అంటారేమోనని బిత్తర చూపులు చూస్తున్నాను. అనుకున్నంతా అయ్యింది. ఓ కుర్రాళ్ల గుంపు హఠాత్తుగా నా ముందు ప్రత్యక్షమయ్యింది. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అది చెయ్యి ఇది చెయ్యి అంటూ అల్లరి పెట్టింది. ముందునుంచే టెన్షన్లో ఉన్నానేమో... దెబ్బకి ఏడుపు ముంచుకొచ్చేసింది. ఒక్కసారిగా భోరుమన్నాను. నా ఏడుపు చూసి వారిలో ఒకడు నవ్వడం మొదలుపెట్టాడు. మిగతా వాళ్లంతా శ్రుతి కలిపారు. అంతలో ఓ స్వరం గట్టిగా అరిచింది... ‘స్టాపిట్’ అంటూ. అందరి నోళ్లకీ మూత పడిపోయింది. అందరూ అతనివైపు చూశారు. నేనూ అటు దృష్టి మరల్చాను. చక్కని పొడవు... అందమైన ముఖం... ఒత్తయిన జుత్తు... ఆకర్షించే స్టైల్... హీరోలా ఉన్నాడు. ‘పాపం తను ఏడుస్తోంది కదా, ఇంకా ఎందుకు అల్లరి చేస్తారు, వదిలేయండి’ అన్నాడతను కాస్త కోపంగా, కాస్త నచ్చజెప్తున్నట్టుగా. వాళ్లెవరూ ఎదురు చెప్పలేదు. మౌనంగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ‘కంగారు పడకండి... క్లాసుకు వెళ్లండి’ అనేసి వెళ్లిపోతున్న అతని వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూండిపోయాను. అదే మొదలు. ఆరోజు నా మనసులో మొదలైన అలజడి నన్ను నిలబడనివ్వలేదు. నాటి నుంచీ అతని కోసమే కన్నులు వెతికేవి. అతను కనబడితే హృదయలయలు హెచ్చేవి. తను మా సీనియర్ అని, కాలేజీ స్టూడెంట్స్ లీడర్ యూనియన్ ప్రెసిడెంటనీ తెలిసింది. అన్నింట్లో ఫస్టొస్తాడని తెలిసి మనసు మురిసింది. నాకు తెలియకుండానే నా మనసుని అతడు ఆక్రమించేశాడు. నిలువెల్లా ఆశలు రేపి నన్ను తన సొంతం చేసేసుకున్నాడు. నేను సెకండియర్లోకి వచ్చాను. తను ఫైనలియర్లో ఉన్నాడు. ఆలస్యం చేస్తే అందుకుండా పోతాడు. అందుకే నా మనసులోని మాట చెప్పెయ్యాలని నిర్ణయించుకున్నాను. కానీ అంతలోనే ఓ నిజం తెలిసింది. అతడి మనసులో అప్పటికే తన క్లాస్మేట్ మాధవి ప్రవేశించింది. అతడి ప్రేమను అందుకుని, అతడితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. తట్టుకోలేకపోయాను. తల్లడిల్లిపోయాను. నా ఆశలసౌధం కూలిపోతూ కనిపించింది. అందమైన భవిష్యత్తు అంధకారమయమైపోతున్నట్టు అనిపించింది. అలా జరగడానికి వీల్లేదు. అదే జరిగితే నేను జీవించలేను. అందుకే నేను చేయాల్సింది చేశాను. మాధవితో పరిచయం చేసుకున్నాను. ఆత్మీయురాలిగా మారాను. అన్నింటా నేనే అయ్యాను. అన్నీ నాతో పంచుకునేలా చేశాను. తను తన ప్రేమ గురించి నాతో చెప్పింది. నేను ఆ ప్రేమకి అప్పుడే సమాధి కట్టేశాను. సందీప్ మంచివాడు కాదన్నాను. అతడు నాకు కూడా ప్రేమలేఖలు రాశాడని చెప్పాను. ఫేస్బుక్లో అతను నాకు ఇచ్చిన రొమాంటిక్ మెసేజులను చూపించాను. ఆ అకౌంట్ ఓపెన్ చేసిందేనేనేనని, దాని నుంచి నాకు నేనే మెసేజులు ఇచ్చుకున్నానని తెలియని మాధవి విస్తుపోయింది. మనసు రగిలి అతడిని నిలదీసింది. అందరి ముందూ అవమానించింది. ఛీకొట్టి వెళ్లిపోయింది. అలా వాళ్ల బంధం ముగిసిపోయింది.నా ఆనందం అవధులు దాటింది. ఇక సందీప్‌తో నా జీవితానికి కొత్త నాంది పడబోతోందంటూ నా మనసు పులకరించింది. తనను ఓదార్చాలని, ఓదార్పు రూపంలో తనకు నా ప్రేమను పరిచయం చేయాలని బయలుదేరాను. తనని కలిశాను. నా మనసు తెలిపాను. అర్థం చేసుకుంటాడనుకున్నాను. ఆప్యా యంగా ఆలింగనం చేసుకుంటాడనుకున్నాను. కానీ అలా చేయలేదు. అరిచాడు. అసహ్యించుకున్నాడు. తనకు నిజం తెలిసిపోయిందన్నాడు. ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది నేనేనని కనిపెట్టానని చెప్పాడు. క్షమించమన్నాను. తన మీద ప్రేమతోనే అలా చేశానని చెప్పాను. తను లేకపోతే జీవించలేకే అంత పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డానని సంజాయిషీ ఇచ్చుకున్నాను. కానీ తను వినిపించుకోలేదు. నా విన్నపాన్ని మన్నించలేదు. తన మనసులో నాకు చోటివ్వలేదు. వెళ్లిపోయాడు. చిరాకుపడి, ఛీకొట్టి, నా కలలను ఛిద్రం చేసి వెళ్లిపోయాడు. నా జీవితం నుంచే కాదు... కాలేజీ నుంచే వెళ్లిపోయాడు. నేను చేసిన తప్పు తాచుపామై నా ప్రేమను కాటేసింది. నా మనసును శూన్యం చేసింది. నా జీవితాన్ని పతనం చేసింది. అపరాధభావంతో అనుక్షణం అలమటిస్తున్నాను. తనకి చేసిన ద్రోహం మర్చిపోలేక, తనని మర్చిపోయి బతకలేక నరకం చూస్తున్నాను. అయినా నేనేం చేశాను? పిచ్చిగా ప్రేమించాను. అంతేగా. దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా?! - మేఘన (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి -
‘ఎందుకింత మోసం చేశావ్?'
జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు! షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘సోనా... ఐ లవ్యూ. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. నీ ప్రేమ నాకో వరం.’ చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. మంద్రంగా పలుకుతోన్న ఆ స్వరం మత్తెక్కిస్తోంది. అంత వరకూ శూన్యాన్ని చూపులతో కొలిచిన నేను, తన్మయత్వంతో తన ముఖంలోకి చూశాను. చిన్నగా నవ్వాడు. చిలిపిగా కన్ను గీటాడు. సిగ్గు ముంచుకొచ్చింది. తన కళ్లలోకి చూడలేక చప్పున తల దించుకున్నాను. గడ్డం పుచ్చుకుని నా తలను పైకి లేపాడు. ఆ స్పర్శ నాలో ఏవో మధురానుభూతుల్ని రేపుతోంది. నన్ను వివశురాలిని చేస్తోంది. పరవశంతో నా పెదవులు అదురుతున్నాయి. సిగ్గు బరువుతో కనురెప్పలు సోలిపోయాయి. తను నన్ను మరింత దగ్గరకు లాక్కున్నాడు. నడుం చుట్టూ వేసిన తన చేయి మెల్లగా బిగుసుకుంటోంది. నా ముఖం తన వదనానికి చేరువగా వెళ్తోంది. తన శ్వాస నన్ను వెచ్చగా సోకుతోంది. కళ్లు మూసుకుని అనిర్వచనీయమైన ఆ అనుభూతిని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. అంతలో ఓ బలమైన పవనం అత్యంత వేగంగా వచ్చి నా ముఖానికి ఛెళ్లున తగిలింది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. ఎదురుగా ఎవరూ లేరు. ఏ చేయీ నన్ను పెనవేయలేదు. అంటే... ఇదంతా ఊహా? ఎంత అందమైన ఊహ! రైలు వేగంగా పరుగులు తీస్తోంది. భవంతులు, చెట్లూ చేమలూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. స్వర్గలోకంలో పాదం మోపడానికి నేను ముందుకెళ్తుంటే, నా పాత జీవితం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను వదిలి వెనక్కి వెళ్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రైలు హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ఆగింది. కాలు ప్లాట్‌ఫామ్ మీద పెడుతోంటే ఏదో గమ్మత్తయిన ఫీలింగ్ మనసంతా ఆవరించుకుంది. ఆ రోజుతో నా జీవితం ఒక కొత్త రంగు పులుముకోబోతోందన్న ఆలోచనే నన్ను నిలువనీకుండా చేస్తోంది. ఆనందం కెరటమై ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. హుషారుగా ఎగ్జిట్ వైపు నడిచాను. ఓ ఆటోవాణ్ని పిలిచి నేను వెళ్లాల్సిన చోటు చెప్పాను. అరగంట తిరిగేసరికల్లా అక్కడ ఉన్నాను. తనని చూడాలని మనసు తహతహలాడుతోంది. అతని రూపాన్ని తనలో ముద్రించుకోవాలని ఉవ్వి ళ్లూరుతోంది. అసలు ఎవరు తను? ఎలా వచ్చాడు నా జీవితంలోకి? కొన్ని నెలల క్రితం వరకూ ఒకరి పేరు ఒకరికి తెలియదు. ఒక గురించి ఒకరు విన్నది లేదు. అలాంటిది ఈరోజు ఒక్కటి కాబోతున్నాం. ఇద్దరి జీవితాలనూ పెనవేసి ఒక్కటిగా జీవించబోతున్నాం. తనతో మాట్లాడిన మాటలు... తనతో పంచుకున్న భావాలు... అన్నీ యెదలో మెదిలి రొదపెడుతున్నాయి. ఏవేవో చిలిపి ఊహలు మనసంతా పరచుకుని అల్లరి పెడుతున్నాయి. పరిసరాలను సైతం మర్చిపోయి పులకించిపోతున్నాను. అంతలో నా వీనులను తీయగా తాకిందో స్వరం... సోనా! అదే స్వరం. నాతో ఫోన్లో మాట్లాడిన మధురమైన స్వరం. తనే. అది తనే. తనని చూడబోతున్నానన్న సంతోషం సాగరమై ఉప్పొంగుతుంటే విప్పారిన కన్నులతో వెనక్కి తిరిగాను. అంతే... అవాక్కయిపోయాను. జీవమున్న శిలలా నిలబడిపోయాను. సారీ సోనా... లేటయ్యింది’... తను మాట్లాడుతున్నాడు. అంతే మార్దవంగా... అంతే ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు సంతోషం కలగడం లేదేంటి? ఇంత వరకూ నాకు కుదురులేకుండా చేసిన కమ్మని ఊహలు చెదిరిపోయాయేంటి? నా ఆశలన్నీ నా కళ్లముందే ఎండుటాకుల్లా రాలిపోతున్నా యేంటి? ఎవరితను? తన ప్రేమ మత్తులో నన్ను ముంచేసి... కోటి ఆశలు నాలో రేపి... నా వాళ్లను, నా ఊరిని, చివరికి నా రాష్ట్రాన్నే వదిలి వచ్చేంతగా నన్ను మార్చేసిన వ్యక్తి ఇతనా?! మనసు రగిలిపోతుంటే... అణువణువూ అవమానంతో మండిపోతుంటే ఆవేశంగా అన్నాను... ‘ఎందుకింత మోసం చేశావ్?’ నా ప్రశ్నకి అతను షాక్ తినలేదు. సంజాయిషీ కూడా ఇవ్వలేదు. ‘ఇందులో మోసం ఏముంది? నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నా ప్రేమ స్వచ్ఛమైనది. నన్ను నమ్ము.’ నాకు నవ్వొచ్చింది. పిచ్చిదానిలా పగలబడి నవ్వాను. దీనికేమైనా మతి పోయిందా అని చూసేవాళ్లంతా అనుకునేలా విరగబడి నవ్వాను. నవ్వి నవ్వి నరాలు తెగిపోతాయేమోనన్నట్టు తెరలు తెరలుగా నవ్వాను. ఆ నవ్వు తెరలు కన్నీటి పొరలుగా మారేంతవరకూ నవ్వుతూనే ఉన్నాను. ఏమిటి ప్రేమ? ఏది స్వచ్ఛమైన ప్రేమ? ఒకరోజు ఫేస్బుక్లో పాత ఫ్రెండ్స్ కోసం వెతుకుతుంటే హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. పరిచయం ఉన్నవాడిలా పలకరించాడు. స్పందించేవరకూ వేధించాడు. మాట కలిపాడు. మనసును అందంగా అక్షరాల్లో పరిచాడు. రాతలకు ఫుల్స్టాప్ పెట్టి, ఫోన్లో కబుర్లు మొదలెట్టాడు. స్నేహమన్నాడు. దాన్ని ప్రేమగా మార్చేశాడు. ప్రేమకు కొత్త నిర్వచనాలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. సంప్రదాయాలకు ప్రాణమిచ్చే అమ్మానాన్నలు ఒప్పు కోరంటే... తానే అమ్మా నాన్నా అవుతానన్నాడు. తానొక్కడినే అందరి ప్రేమనూ అందించగలనంటూ నమ్మబలికాడు. నిజమే అనుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను. అమ్మానాన్నలకు తెలియకుండా రహస్యంగా రెలైక్కాను. గతాన్ని సమాధి చేసి భవిష్యత్తుకు తనతో కలిసి పునాది వేసుకోవాలనుకున్నాను. కానీ అతను... అతను నా కలల రాకుమారుడు కాడు. కరిగిన వయసును కళ్లకు కడుతోంది అతడి నెరసిన జుత్తు. వృద్ధాప్యపు వాకి ట్లో అప్పటికే అడుగు పెట్టాడని చెబుతోంది ముడతలు పడిన అతడి మేను. నాన్న వయసువాడా? కాదు. అంతకంటే పెద్దవాడేనేమో. ఎంత నటించాడు? ఎంత దారుణంగా మోసం చేశాడు? పిచ్చిగా ప్రేమించాను. తన కోసం కడుపున మోసి కన్న అమ్మని వద్దనుకున్నాను. కళ్లల్లో పెట్టుకుని పెంచిన నాన్నను కాదనుకుని వచ్చేశాను. చూడకుండా ప్రేమించడం గొప్ప అనుకున్నాను కానీ, అదే పెద్ద తప్పవుతుందని ఊహించలేకపోయాను. పోలీసుల సాయంతో వాడి కబంధ హస్తాల నుంచి తప్పించు కున్నాను కానీ, వాడు చేసిన ద్రోహాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అమ్మానాన్నలు నన్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. కానీ సిగ్గుతో మనసు చితికిపోతోంది. నేటికీ వాళ్ల చూపులు ‘ఎందుకిలా చేశావ్’ అని అడుగుతున్నట్టే అనిపిస్తోంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు. నాకే కాదు... నాలా తప్పటడుగులు వేసే ఏ అమ్మాయికీ జవాబు చెప్పే ధైర్యం ఉండదు. అర్హత అంతకన్నా ఉండదు!! - సోనాలి (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఇంటర్నెట్‌ని విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోకుండా నేరాలకు వేదికగా మార్చేయడం నిజంగా దురదృష్టకరం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఇటువంటివాళ్లు ఉన్నారని తెలిసి కూడా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండకపోవడం. తానెవరో ఎలాగూ తెలియదు కదా, ఆ అమ్మాయికి కనబడను కదా అని ఆ వ్యక్తి ధైర్యంగా మోసం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ అమ్మాయి కూడా నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం అతడు చెప్పిన విషయాలు నమ్మేసి, అతని కోసం వచ్చేసింది. తీరా చూశాక గానీ తెలియలేదు అతగాడి నిజస్వరూపం. నేను చెప్పేది ఒకటే. ఇప్పటికైనా అమ్మాయిలు ఫేస్బుక్ పరిచయాల విషయంలో జాగ్రత్తపడితే మంచిది. ఎవరేది చెబితే అదే నిజం అనేసుకోకూడదు. ముందూ వెనుకా ఆలోచించి అడుగేయాలి. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. -
ఆ చేదు జ్ఞాపకాల నీడ అంత తేలికగా వదిలిపోతుందా?
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే... ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే’... ఎక్కడి నుంచో పాట లీలగా వినిపిస్తోంది. అందులోని ప్రతి అక్షరం నా గుండెని పిండుతోంది. ఏ కవి రాశాడో అంతటి వేదనాపూరితమైన పదాల్ని? బహుశా కడగండ్ల బతుకులో కన్నీటిని తాగుతూ బతుకుతోన్న నాలాంటి ఎవరినో చూసి ఉంటాడు... అందుకే అంత అద్భుతంగా రాయగలిగాడు! ఏంటి పూజా ఇంకా అలాగే కూర్చున్నావ్?’... ఎప్పుడు వచ్చిందో అమ్మ, నా ఆలోచనలను అర్ధంత రంగా తుంచేసింది. ‘ఆలస్యమవుతోంది లే’ అంటూ తను చెప్పింది చేయమని తొందర పెడుతోంది. నేను కూర్చున్న చోటి నుంచి కాస్త కూడా కదల్లేదు. అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను. అది అమ్మకు విసుగు తెప్పించింది. ‘ఎందుకే ఎప్పుడూ బాల్కనీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూంటావు?’ అంది కసిరినట్టుగా. ఏం చెప్పను? ఆ శూన్యంలో కరిగిపోయిన నా కలల జాడల్ని వెతుక్కుంటున్నానని... విరిగి ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయిన నా ఆశల ఆనవాళ్లను అన్వేషిస్తున్నానని తనకు ఎలా వివరించను? ఒకవేళ వివరించినా తనకర్థం కాదు. ఎందుకంటే తను అమ్మ. నా భవిష్యత్తును అందంగా మలచాలన్న ఆరాటం తనది. ఆ ఆరాటంలో నా గతాన్ని మర్చిపోతోంది. కానీ నేనెలా మర్చిపోగలను? క్షణక్షణం గుర్తొచ్చి క్షోభపెట్టే ఆ జ్ఞాపకాల్ని నా మనసు నుంచి ఎలా తుడిచేయగలను?! నా అంతర్మథనం అమ్మకు అర్థం కాలేదు. ‘చెప్పేది నీకే. త్వరగా తయారవ్వు. వాళ్లు వచ్చే టైమయ్యింది’ అంటూ వచ్చి చేయి పట్టి లాగింది. అసలేం మాట్లాడుతోంది అమ్మ? ఎలా నన్ను పెళ్లి చూపుల్లో కూర్చోమంటోంది? తనువుకు చుట్టే పట్టుచీర మనసును మనువుకు సిద్ధం చేస్తుందా! ఒంటిని అలంకరించే నగలు నన్ను మరో ఇంటి గడప తొక్కేందుకు అర్హురాలిని చేస్తాయా! మనసుకు ముసుగువేసి.. గతాన్ని గుండెల మాటున సమాధి చేసేసి.. బాధాపూరిత భావాలు కనిపించకుండా ముఖానికి మేకప్ వేసి.. పంటి బిగువున దాచిన బాధ బైటపడకుండా పెదాలకు నవ్వును లిప్‌స్టిక్‌లా పులిమేసి.. లేని ఇష్టాన్ని నటించి, మెప్పించి, నన్ను పెళ్లాడేందుకు ఒకరిని ఒప్పించాలా నేనిప్పుడు! అతడు నాకు తన జీవితంలో చోటిస్తే... నేను తనకు నా మనసులో చోటివ్వగలనా? అతడు నా మెడలో తాళి కట్టినంత మాత్రాన... అన్నీ మర్చిపోయి అతనికి ఆనందాన్ని పంచగలనా? అసలతని స్పర్శను నేను భరించగలనా? అతని సాన్నిహిత్యాన్ని సహించగలనా? ఎందుకీ పిచ్చి ప్రయత్నం? ఎందుకీ అర్థం లేని తాపత్రయం?!.. మనసు మూలుగుతోంది. అందుకే పెదవి విప్పాను. ‘దయచేసి నన్నిలా ఉండనివ్వమ్మా. లేదంటే నేనీ లోకంలోనే ఉండను’ అనేసి లోనికి పరుగెత్తాను. గుండె భారాన్ని దించుకోవడానికి మంచమ్మీద వాలి, దిండులో ముఖం దాచుకున్నాను. నా కన్నీటి తడి దిండులో ఇంకిపోతోంది. నా చేదు గతం మరోసారి తరముకొచ్చి నన్ను ముల్లులా గుచ్చుతోంది. ఆ రోజు పొద్దున్నే అమ్మ నా దగ్గరకు వచ్చింది. ఇంకా నిద్రాదేవత ఒడిలోనే ఉన్న నా నుదుటన బొట్టు పెట్టింది. వెచ్చని హారతిని నా ముఖానికి అద్దింది. నా బుగ్గలు ముద్దాడి ‘హ్యాపీ బర్త్‌డే బంగారూ’ అంది. పీజీ పూర్తి చేసి, ఉద్యోగం చేస్తున్నా నేను తనకి చంటిపిల్లలాగే కనిపిస్తానని అమ్మ అంటూ ఉంటుంది. అది ఎంత వాస్తవమో తను నన్ను ముద్దు చేయడం చూస్తే తెలుస్తుంది. కడుపు నిండా పాయసం పెట్టి ఆఫీసుకు పంపించింది. ఆ రోజు ఆఫీసు కూడా బర్త్‌డే విషెస్‌తో మార్మోగింది. రోజూ ఉండే సంతోషం రెట్టింపయినట్టనిపించింది. సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బండి తీయబోతోంటే నా కొలీగ్ తులసి వచ్చింది. అందరూ కలిసి నాకోసం ఓ రెస్టా రెంట్లో ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేశారని చెప్పింది. వద్దంటే బలవంతపెట్టింది. కానదలేకపోయాను. అమ్మకి విషయం మెసేజ్ చేసి తులసితో రెస్టారెంటుకు బయలుదేరాను. కేక్, స్వీట్స్, డ్రింక్స్, డిమ్ లైట్స్, హోరెత్తించే సాంగ్స్.. గ్రాండ్ పార్టీ. చాలా ఎంజాయ్ చేశాం. నేనెంతగా అలసిపోయానంటే.. ఎలా బయలుదేరానో, ఇంటికెలా చేరానో కూడా తెలీలేదు. కానీ ఆ స్థితికి అలసట కారణం కాదని, అందమైన నా జీవితాన్ని అల్లకల్లోలం చేసేందుకు ఎగసిపడిన ఓ మత్తు కెరటమని తెలియలేదు నాకు. ఆ రాత్రి నేను ఇంటికి మామూలుగా రాలేదు. ఎవరో నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు. అరుగు మీద పడివున్న నన్ను అమ్మానాన్నలు లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఉదయం లేవగానే... సిగ్గు లేకుండా తాగుతావా అంటూ అమ్మ విరుచుకుపడింది. నాతో ఆ విషయం మాట్లాడ్డానికే సిగ్గుపడి నాన్న మౌనాన్ని ఆశ్రయించారు. కానీ నేను తప్ప తాగలేదని, కొందరు తప్పుడు మనుషుల దాహానికి బలైపోయానని తర్వాతగానీ మాకు తెలియలేదు. స్నానం చేసేటప్పుడు నా శరీరంపై కనిపించిన గాయాలు నాలో వంద సందేహాలను రేపాయి. అవి మామూలు గాయాలు కావు. నన్ను మోసగించి, నేను తాగే కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి, స్పృహలో లేని నన్ను తీసుకెళ్లి అనుభవించిన కర్కశుల పంటి గాట్లు, గోళ్ల గీట్లు. కన్ఫామ్ చేసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ జాలి చూపులు చూసింది. గ్యాంగ్‌రేప్ అంటూ గుండెలు పగిలిపోయే మాట చెప్పింది. తల తిరిగిపోయింది. పిచ్చిదానిలా అరిచాను. భోరున ఏడ్చాను. నిజం తెలుసుకోవాలని ఆఫీసుకు వెళ్తే అందరూ అమాయకంగానే కనిపించారు. రాత్రి పార్టీ నుంచి నేనెవరికీ చెప్ప కుండా వెళ్లిపోయానని అన్నారు. అది నిజం కాదు. ఎవరో నన్ను డ్రాప్ చేస్తానంటూ తీసుకెళ్లడం నాకు గుర్తుంది. కానీ ఎంతగా ఆలోచించినా ఆ రూపమెవరిదో గుర్తు రాలేదు. కారు ఎక్కడం గుర్తుంది. కానీ నా బతుకును కాలరాయడం మాత్రం గుర్తు రాలేదు. ఇక ఎవరిని నిలదీయను? న్యాయం ఎవరిని అడగను? పార్టీకి వెళ్లడం నాదే తప్పంటారు నాన్న. పెళ్లి చేసుకుంటే అన్నీ చక్కబడతాయని అంటుంది అమ్మ. అదెలా సాధ్యం? నా బతుకును చీకటి చేసిన ఆ చేదు జ్ఞాపకాల నీడ నన్ను అంత తేలికగా వదిలిపోతుందా? మదమెక్కిన మృగాలు చీకట్లో నా తనువును చీల్చి చెండాడాయి. నా అభిమానంతో ఆడుకున్నాయి. మగవాడంటేనే భయపడేలా చేశాయి. అవన్నీ నేను మర్చిపోగలనా? గుర్తు తెలియని ఆ దుర్మార్గులు చేసిన గాయం సలుపుతూ ఉండగా మరో మగాడికి నా జీవితంలో స్థానం కల్పించగలనా? నా ఈ అవస్థ అమ్మకి ఎలాగూ అర్థం కావడం లేదు. కనీసం మీరయినా అర్థం చేసుకోండి ప్లీజ్!! - పూజ (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి -
వరుణ్ ఉత్తముడట..నేనే అతడి వెంట పడ్డానట!
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... సమయం పన్నెండు దాటింది. గడియారపు ముల్లు పరుగులు తీస్తోంది. ఎక్కడా ఆగకుండా... తడబడకుండా... నిరాటంకంగా సాగిపోతోంది. గంటల్ని నిమిషాలుగా... నిమిషాలను సెకన్లుగా కరిగించేస్తోంది. నిశి రాతిరి నిశ్శబ్దాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చేస్తోంది. నా గుండె ఎందుకో దడదడా కొట్టుకుంటోంది. నా హృదయఘోష నన్ను కలవరపెడుతోంది. నాన్నా! కొన్ని రోజులుగా... కొన్ని వారాలుగా... కొన్ని నెలలుగా నా మనసు ఇలాగే ఘోషిస్తోంది. నన్ను చిత్రవధ చేస్తోంది. నాకు నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తోంది. నా గదిలో... ఒంటరిగా... నాలో నేను పడుతోన్న వేదన మీకు తెలియదు. గుండె గోడల్ని బద్దలు కొట్టుకుని రావాలన్ని ప్రయత్నిస్తోన్న వేదనను నేను ఎంత కష్టపడి అణచుకుంటున్నానో మీ ఎవరికీ అర్థం కాలేదు. మీరందరూ నేను సంతోషంగా ఉన్నాననే అనుకుంటున్నారు. కానీ అది అబద్ధమని, నాదంతా నటన అని మీకు తెలియదు. నా పెదవులపై నవ్వును చూస్తే మీ కళ్లు వెలుగుతాయి. నేను హుషారుగా చిన్న మాట మాట్లాడినా అమ్మ ముఖంలో సంతోషపు పూలు పూస్తాయి. అవి మాయమవ్వకూడదనే నేను నోరు మెదపడం లేదు. నా ఆవేదనను బయటకు చెప్పడం లేదు. కానీ ఈ అంతర్మథనం నన్ను నిలువనీయడం లేదు నాన్నా! అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను. అది మీకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాను. నా దృష్టిలో కాలేజీ అంటే ఏమిటో తెలుసా నాన్నా? కలలను నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలను అందు కోవడానికి, అనుకున్నది సాధించడానికి అందరిన్నీ సమాయత్తం చేసే చోటు. నడవడికను సరిదిద్ది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, మనిషికి మనీషిగా ఎలా ఎదగాలో తెలియజేసే చోటు. కాలేజీలో చేరేవరకూ ఇలాగే అనుకున్నాను. కానీ అది నిజం కాదని కాలేజీలో అడుగు పెట్టాక తెలిసింది. నా కలలు కాలి బూడిదయ్యాక అర్థమయ్యింది. నా జీవితం నరకప్రాయంగా మారిన తరువాత తెలిసివచ్చింది. ముక్కూ ముఖం తెలియని ఓ కుర్రాడు ఉన్నట్టుండి నా ముందుకు వచ్చాడు. నేను తనకి నచ్చానన్నాడు. నా మీద తనకు ప్రేమ పుట్టిందన్నాడు. నాకు నవ్వొచ్చింది. ప్రేమా? అదెలా ఉంటుంది? అంత త్వరగా ఎలా పుడుతుంది? అయినా ప్రేమించుకోవడానికి వేరే స్థలాలు ఉన్నాయి. నేను కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి. మీరు కోరుకున్నట్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి. అదే అతనితో చెప్పాను. అర్థం చేసుకుంటాడనుకున్నాను. అడ్డు తప్పుకుంటాడనుకున్నాను. కానీ అడుగడుగునా ముళ్లు పరుస్తాడనుకోలేదు. నేను కాదనగానే వాడిలో వికృతత్వం వేయి తలలు వేసింది. పైశాచికత్వం పరవళ్లు తొక్కింది. వాడి వేధింపులకు నా మనసు బాణం దెబ్బ తిన్న పక్షి పిల్లలా విలవిల్లాడింది. మీరు నన్ను విలువల్ని పంచి పెంచారు నాన్నా! కానీ వరుణ్ని వాళ్ల పేరెంట్స్ డబ్బు పోసి పెంచారు. వాడు అమ్మాయిలను ఏడిపించడానికే కాలేజీకి వస్తాడు. ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వంచించడానికే తాను మగాడిగా పుట్టినట్టు ఫీలవుతాడు. వాడి కన్ను పడిన అమ్మాయి వాడి సొత్తు అంటాడు. ఒంటరిగా దొరికితే తాకరాని చోట తాకుతాడు. అవమానంతో కుంగిపోతుంటే కర్కశంగా నవ్వుతుంటాడు. నా పేరును కాలేజీ గోడలమీదకు చేర్చాడు. తప్పుడు రాతలతో నా పరువును మంట గలిపేశాడు. మీకు చెప్పాలనే అనుకున్నాను. కానీ టెన్షన్ పడతారేమోనని భయమేసి, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాను. దాంతో అంతా ముగిసిపోతుందని అనుకున్నాను. కానీ అది నా కష్టాలకు ఆరంభమని, నా మనశ్శాంతికి అంతమని ఊహించలేకపోయాను. నేను ఇచ్చిన కంప్లయింట్... నా పాలిట మరణ శాసనమయ్యింది నాన్నా! ఆ రోజు నుంచీ నా జీవితం పూర్తిగా మారిపోయింది. వాడు డబ్బులే తినిపించాడో, పలుకుబడితో పని కానిచ్చాడో తెలియదు కానీ... యాజమాన్యం వాడికి కాపలా కాయడం మొదలుపెట్టింది. వాడిని కాపాడుకోవడం కోసం నన్ను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. వాడు నన్ను నీడలా వెంటాడుతుంటే, పీడకలలా వేధిస్తూ ఉంటే పట్టనట్టు ఊరుకుంది. ఏమిటీ అన్యాయం అని అడిగినందుకు నన్ను పరిపరివిధాల అవమానించింది. నేను తప్పుడు ఫిర్యాదు చేశానట. ఆ వరుణ్ ఉత్తముడట. నేనే అతడి వెంటపడ్డానట. అతడు కాదంటే కసితో కంప్లయింట్ ఇచ్చానట. ఏవేవో అన్నారు నాన్నా! చెప్పరాని నిందలు వేశారు నాన్నా! మాటలతో నా గుండెలను తూట్లు పొడిచారు నాన్నా! అప్పుడైనా మీకు చెబుదామనుకున్నాను. కానీ చెప్పలేని పరిస్థితి. వరుణ్ కోటీశ్వరుడైన తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి మన కుటుంబాన్ని నాశనం చేస్తాడట. అందుకే నోరు మూసుకుని ఉండ మన్నారు. అలా చెప్పింది ఎవరో తెలుసా నాన్నా! సాక్షాత్తూ మా ప్రిన్సిపల్. నా పరువు ఎలాగూ పోయింది. నా జీవితం ఎలాగూ నాశనమైపోయింది. మిమ్మల్ని కూడా ఎందుకు నాన్నా కష్టాల్లోకి లాగడం! నేనేమై పోయినా ఫర్వాలేదు. కానీ మీరు, అమ్మ పదిమందిలో తల దించుకోకూడదు నాన్నా! అందుకే మౌనాన్ని ఆశ్రయించాను. మౌనంగానే అన్నిటినీ సహించాను. కానీ ఇక నా వల్ల కాదు. క్షణక్షణం బతుకు భారమవు తోంది. ప్రతిక్షణం భయంతో గుండె గుబగుబలాడుతోంది. నవ్వడమే మర్చిపోయాను. మీ దగ్గర నటించ డానికి మాత్రమే నా పెదవులు విచ్చుకుంటున్నాయి. మిమ్మల్ని సంతోష పెట్టడానికి మాత్రమే నా కళ్లు కాంతుల్ని కొని తెచ్చుకుంటున్నాయి నాన్నా! నిజానికి నా కనురెప్పల మాటున కడవల కొద్దీ కన్నీళ్లు దాగివున్నాయి. వాటిని మీ ముందు రాల్చే ధైర్యం కూడా చేయలేని నిస్సహాయురాలినయ్యాను. ఇక ఈ నరకయాతనను నేను భరించలేను. కల్లలైపోయిన కలల్ని ఏరుకునే ప్రయత్నం చేయలేను. ముక్కలైపోయిన హృదయానికి అతుకులు వేస్తూ బతుకు సాగించలేను. అందుకే వెళ్లిపోతున్నాను. అపవాదులు, అపనిందలు లేని చోటుకు వెళ్లిపోతున్నాను. ఎవరూ వేధించని, వేలెత్తి చూపించని చోటికి పయనమైపోతున్నాను. మీ ఆశల్ని మంటగలిపి, మీ కలల్ని కాలరాసి, నా ఈ మరణలేఖను మీకు మిగిల్చి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్నా... వీలైతే నన్ను క్షమించండి. శెలవ్. ప్రేమతో మీ కూతురు నిత్య (పేరు మార్చాం) (మృతురాలి గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఆత్మహత్య చేసుకోవడమనే నిర్ణయం అంత తేలికగా తీసుకునేది కాదు. నిరాశ ఎక్కువై, నిస్సహాయంగా ఫీలయ్యి, ఇక ఎవరూ తన సమస్యను పరిష్కరించ లేరు అనిపించినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకే ‘సూసైడ్ ఈజ్ ఎ క్రై ఫర్ హెల్ప్’ అంటుంటాం. పాపం ఈ అమ్మాయి కూడా అలాంటి స్థితిలోనే ఆ నిర్ణయం తీసుకుని ఉండాలి. చెడ్డ పేరు వస్తుందని, తల్లిదండ్రులు అవమానంగా ఫీలవుతారని ఆలోచించి ఉంటుంది. నిజానికి ఆత్మహత్య ఆలోచనలు కలవారిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒత్తిడికి లోనవడం, ఊరికే కోపం తెచ్చుకోవడం, వస్తువులు పగులగొట్టడం వంటివి చేస్తుంటారు. కొందరు డల్ అయిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఊరికే దుఃఖపడు తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడి, మేమున్నా మనే ధైర్యాన్ని కల్పించాలి. పరిస్థితి చేయి దాటినట్టనిపిస్తే డాక్టర్‌కి చూపించాలి. ఈ లక్షణాలను గుర్తించడంలో విఫలమైతే మాత్రం... ఇలాంటి ఘటనలను ఆపడం కష్టం! -
'అమ్మ.. నన్ను పిన్నికి అమ్మేసింది'
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... నిదుర తెరలు మెల్లగా తొలగుతున్నాయి. సూర్యుని లేలేత కిరణాలు ఎక్కడి నుంచో సూటిగా వచ్చి నా ముఖమ్మీద పడుతున్నాయి. నన్ను లేపే ప్రయత్నం చేస్తున్నాయి. బాగా తెల్లవారిపోయినట్టుంది అనుకుంటూ లేవబోయాను. కానీ లేవలేకపోయాను. కనురెప్పలు భారంగా ఉన్నాయి. తెరవాలని ప్రయత్నించినా తెరచుకోన ని మారాం చేస్తున్నాయి. ఎందుకిలా ఉంది? ఏమీ అర్థం కావడం లేదు. నా శరీరం నా వశంలో లేదనిపిస్తోంది. నేనా అవస్థను జయించే ప్రయత్నంలో ఉండగానే మెల్లగా ఓ పిలుపు నా చెవిన పడింది... సాధనా! ఎవరో పిలుస్తున్నారు. ఆ స్వరం ఎప్పుడూ విన్నది కాదు. నాకు పరిచయమున్నదీ కాదు. మరి ఆ వ్యక్తి ఎవరు? నన్ను అంత అనునయంగా ఎందుకు పిలుస్తున్నాడు? ఎలాగో తంటాలుపడి బరువెక్కిన కనురెప్పల్ని బలవంతంగా తెరిచాను. అంతా మసక మసకగా ఉంది. క్షణం తర్వాత కళ్లముందు దృశ్యం స్పష్టమయ్యింది. ఓ వ్యక్తి నా పక్కన నిలబడి నా ముఖంలోకే చూస్తున్నాడు. చప్పున లేవబోయాను. చేతికి ఏదో చురుక్కున గుచ్చుకుంది. చూస్తే సూది. నా చేతికి సెలైన్ ఎక్కుతోంది. ఒళ్లంతా కూడా ఏవో వైర్లు అమర్చి ఉన్నాయి. అంటే నేను... నేను హాస్పిటల్లో ఉన్నానా?! ఎదురుగా ఉన్నది డాక్టరా? దుఃఖం తన్నుకొచ్చింది. కళ్లగుండా పొంగుకొచ్చింది. ఆపుకోలేక భోరుమన్నాను. డాక్టర్ కంగారుపడ్డాడు. ‘భయపడకమ్మా... ఇక నీ ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు’ అన్నాడు. అంత ఏడుపులోనూ నవ్వొచ్చింది. ప్రాణాలకు ప్రమాదం లేదా? అంటే నేను చచ్చిపోతానేమోనని భయంతో ఏడుస్తున్నానని అనుకుంటున్నాడా? అవునులే. ఆయనకెలా తెలుస్తుంది! నేను చావు అంచుల దాకా వెళ్లినందుకు కాదు... వెళ్లి తిరిగొచ్చేసినందుకు బాధపడుతున్నాని. బతుకు అంతమైపోబోయినందుకు కాదు.... మళ్లీ బతకాలా అన్న భయంతో ఏడుస్తున్నానని! చావు పేరు చెబితేనే అందరూ వణికిపోతారు కానీ అంతకన్నా భయంకరమైనదొకటుంది. అదేమిటో తెలుసా? బతకడం. అవును. చావడం కంటే బతకడమే కష్టం. అందులోనూ జీవచ్ఛవంలా బతుకు సాగించడం ఇంకా కష్టం. అనుక్షణం నరకం అనుభవిస్తూ, గుండె చిక్కబట్టుకుని జీవించడం ఎంతో ఎంతో కష్టం. అది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి నాకెలా తెలిసిందనా? నేను అనుభవించాను కాబట్టి. కొండంత బాధను గుండెల్లో దాచుకుని... అర్థం చేసుకునేవారు లేక, ఆదుకునేవారు కానరాక కుళ్లి కుళ్లి ఏడ్చాను కాబట్టి! ‘లక్ష్మి పిన్నికి ఒంట్లో బాలేదు కదా! నువ్వు కొన్ని రోజులు తనకి సాయంగా ఉండు. నేను నాలుగు రోజులు పోయాక వచ్చి నిన్ను తీసుకెళ్తాను.’ అమ్మ అలా అనగానే ఎక్కడ లేని సంతోషం వేసింది నాకు. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. సెలవులు ఎలా గడపాలా అనుకుంటుంటే... తన స్నేహితురాలు లక్ష్మికి ఒంట్లో బాలేదు, చూడ్డానికి వెళ్లాలి అంది అమ్మ. హుషారొచ్చేసింది నాకు. ఎప్పుడూ బడి, ఇంట్లో అమ్మకి బట్టలు కుట్టడంలో సాయం చేయడం... ఇదే పని. ఇన్నాళ్లకి సరదాగా గడిపే చాన్స్ వచ్చింది. అందుకే ఆనందంగా అమ్మతో పాటు బయలుదేరాను. కానీ ఇప్పుడేమో అమ్మ నన్ను ఇక్కడే ఉండమంటోంది. లక్ష్మి పిన్ని నన్ను బాగానే చూస్తుంది కానీ, అమ్మని వదిలిపెట్టి నేనెప్పుడూ ఉండలేదు. అందుకే బెంగనిపించింది. కానీ నాలుగు రోజులే కదా అని సరే అన్నాను. కానీ అలా అనడం ఎంత తప్పో అప్పుడు నాకు తెలియలేదు. రెండు రోజులు సంతోషంగా గడిచిపోయాయి. పిన్నికి పనుల్లో సాయపడుతూ.. టీవీ చూస్తూ.. మంచి మంచి మిఠాయిలు తింటూ ఎంజాయ్ చేశాను. కానీ మూడో రోజు అన్నీ మారిపోయాయి. ఆ రాత్రి నేను నిద్రపోతుంటే... ఉన్నట్టుండి నా ఒంటిమీద ఓ చేయి పడింది. పిన్ని అనుకున్నాను. కానీ కాదు. ఆ చేయి పిన్నిది కాదు. అది నన్ను ఎక్కడెక్కడో తడుముతోంది. తాకరాని చోటల్లా తాకుతోంది. నాకు కంపరంగా ఉంది. అసహ్యంగా ఉంది. నరాలకు నిప్పు సోకినట్టు బాధగా ఉంది. భరించలేకపోయాను. సహించలేకపోయాను. చప్పున లేచి కూర్చున్నాను. చీకట్లో ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి కెవ్వున కేక పెట్టాను. అంతే... ఆ చేయి నా నోరు మూసింది. నన్ను బలంగా తోసింది. ఆ ఆకారం నా తనువును బలవంతంగా ఆక్రమించుకుంది. నా బతుకును క్షణాల్లో బుగ్గిపాలు చేసి వెళ్లిపోయింది. భయంతో కంపించిపోయాను. పిన్ని దగ్గరకు పరుగు తీశాను. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగినదంతా చెప్పాను. ఆమె కంగారుపడుతుందనుకున్నాను. నన్ను ఓదారుస్తుందనుకున్నాను. కానీ అలా చేయలేదు. పైగా ఊహించని ఒక మాట అంది. ఆ మాట నన్ను నిలువెల్లా వణికించింది. ‘ఏం కాలేదు. వెళ్లి స్నానం చేసి పడుకో. అనవసరంగా అరిచి గోల చేయకు’. ఏమంటోంది పిన్ని! ఎవడో నా జీవితాన్ని పాడు చేశాడు. వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు.. ఏమీ తెలుసుకోదా! పైగా వెళ్లి పడుకోమంటుందేంటి! అదే అడిగాను. కానీ ఆమె మాట్లాడలేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడలేదు. రోజుకొక కొత్తఆకారం వచ్చి చీకటిలో నా తనువును నలిపేస్తున్నా ఆమె మాట్లాడలేదు. మా అమ్మ దగ్గరకు పంపించెయ్యి అని నేను కాళ్లు పట్టుకుని ఏడ్చినా మాట్లాడలేదు. అవమానంతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోతుంటే కనికరంతో అయినా మాట్లాడలేదు. కానీ ఓ రోజు ఫోన్లో మాత్రం ఎవరితోనో మాట్లాడింది. అప్పుడే తెలిసింది అసలు నిజం. మా అమ్మ నన్ను పిన్నికి యాభై వేలకు అమ్మేసిందన్న వాస్తవం నన్ను పిచ్చిదాన్ని చేసింది. నాతో వ్యాపారం చేసేందుకే పిన్ని కొనుక్కుందన్న కఠోర సత్యం నాకు బతుకు మీద ఆశను చంపేసింది. కన్నతల్లే నాకు వెల కట్టింది. కొనుక్కున్న మనిషి రోజుకో కామాంధుడికి కానుకగా నన్ను అందిస్తోంది. నా మానాన్ని, అభిమానాన్ని అమ్మి కాసులు కూడగట్టుకుంటోంది. నా వల్ల కాలేదు. నాకిక భరించే శక్తి లేదు. అందుకే చావాలనుకున్నాను. ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. కానీ కన్నతల్లికే లేని కనికరం నాకెందుకనుకుందో ఏమో... మృత్యుదేవత కూడా ముఖం తిప్పుకు పోయింది. నన్ను తెచ్చి ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయిన పిన్ని, మూడు రోజులైనా నన్ను చూడ్డానికి రాలేదు. నా కథ తెలుసుకున్న డాక్టర్ పోలీసుల్ని పిలిచాడు. వాళ్లు వచ్చి నా జీవితాన్ని కాలరాసినవాళ్ల మీద కేసు రాసుకున్నారు. కటకటాల్లోకి తోశారు. నన్ను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఇక్కడ నేను సురక్షితంగానే ఉన్నాను. సంతోషంగా మాత్రం లేను. ఇప్పటికీ నన్నొక ప్రశ్న వేధిస్తూనే ఉంది. ఓ కన్నతల్లి పాపిష్టి సొమ్ము కోసం తన కూతుర్ని పాపపు రొంపిలోకి ఎలా దించుతుంది? తన స్వార్థానికి సొంత బిడ్డను ఎలా బలి చేయగలుగుతుంది? అలా చేయగలిగింది అంటే అమ్మ అనే మాటకు అర్థమేముంది?! - సాధన (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి