ఆ చేదు జ్ఞాపకాల నీడ అంత తేలికగా వదిలిపోతుందా? | she alert, women gang raped | Sakshi
Sakshi News home page

ఆ చేదు జ్ఞాపకాల నీడ అంత తేలికగా వదిలిపోతుందా?

Published Wed, Mar 25 2015 7:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

ఆ చేదు జ్ఞాపకాల నీడ అంత తేలికగా వదిలిపోతుందా?

ఆ చేదు జ్ఞాపకాల నీడ అంత తేలికగా వదిలిపోతుందా?

షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!

 
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
 
‘సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే... ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే’... ఎక్కడి నుంచో పాట లీలగా వినిపిస్తోంది. అందులోని ప్రతి అక్షరం నా గుండెని పిండుతోంది. ఏ కవి రాశాడో అంతటి వేదనాపూరితమైన పదాల్ని? బహుశా కడగండ్ల బతుకులో కన్నీటిని తాగుతూ బతుకుతోన్న నాలాంటి ఎవరినో చూసి ఉంటాడు... అందుకే అంత అద్భుతంగా రాయగలిగాడు!
 
ఏంటి పూజా ఇంకా అలాగే కూర్చున్నావ్?’... ఎప్పుడు వచ్చిందో అమ్మ, నా ఆలోచనలను అర్ధంత రంగా తుంచేసింది. ‘ఆలస్యమవుతోంది లే’ అంటూ తను చెప్పింది చేయమని తొందర పెడుతోంది. నేను కూర్చున్న చోటి నుంచి కాస్త కూడా కదల్లేదు. అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను. అది అమ్మకు విసుగు తెప్పించింది. ‘ఎందుకే ఎప్పుడూ బాల్కనీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూంటావు?’ అంది కసిరినట్టుగా. ఏం చెప్పను? ఆ శూన్యంలో కరిగిపోయిన నా కలల జాడల్ని వెతుక్కుంటున్నానని... విరిగి ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయిన నా ఆశల ఆనవాళ్లను అన్వేషిస్తున్నానని తనకు ఎలా వివరించను? ఒకవేళ వివరించినా తనకర్థం కాదు. ఎందుకంటే తను అమ్మ. నా భవిష్యత్తును అందంగా మలచాలన్న ఆరాటం తనది. ఆ ఆరాటంలో నా గతాన్ని మర్చిపోతోంది. కానీ నేనెలా మర్చిపోగలను? క్షణక్షణం గుర్తొచ్చి క్షోభపెట్టే ఆ జ్ఞాపకాల్ని నా మనసు నుంచి ఎలా తుడిచేయగలను?!

నా అంతర్మథనం అమ్మకు అర్థం కాలేదు. ‘చెప్పేది నీకే. త్వరగా తయారవ్వు. వాళ్లు వచ్చే టైమయ్యింది’ అంటూ వచ్చి చేయి పట్టి లాగింది. అసలేం మాట్లాడుతోంది అమ్మ? ఎలా నన్ను పెళ్లి చూపుల్లో కూర్చోమంటోంది? తనువుకు చుట్టే పట్టుచీర మనసును మనువుకు సిద్ధం చేస్తుందా! ఒంటిని అలంకరించే నగలు నన్ను మరో ఇంటి గడప తొక్కేందుకు అర్హురాలిని చేస్తాయా! మనసుకు ముసుగువేసి.. గతాన్ని గుండెల మాటున సమాధి చేసేసి.. బాధాపూరిత భావాలు కనిపించకుండా ముఖానికి మేకప్ వేసి.. పంటి బిగువున దాచిన బాధ బైటపడకుండా పెదాలకు నవ్వును లిప్‌స్టిక్‌లా పులిమేసి.. లేని ఇష్టాన్ని నటించి, మెప్పించి, నన్ను పెళ్లాడేందుకు ఒకరిని ఒప్పించాలా నేనిప్పుడు! అతడు నాకు తన జీవితంలో చోటిస్తే... నేను తనకు నా మనసులో చోటివ్వగలనా? అతడు నా మెడలో తాళి కట్టినంత మాత్రాన... అన్నీ మర్చిపోయి అతనికి ఆనందాన్ని పంచగలనా? అసలతని స్పర్శను నేను భరించగలనా? అతని సాన్నిహిత్యాన్ని సహించగలనా? ఎందుకీ పిచ్చి ప్రయత్నం? ఎందుకీ అర్థం లేని తాపత్రయం?!.. మనసు మూలుగుతోంది. అందుకే పెదవి విప్పాను. ‘దయచేసి నన్నిలా ఉండనివ్వమ్మా. లేదంటే నేనీ లోకంలోనే ఉండను’ అనేసి లోనికి పరుగెత్తాను. గుండె భారాన్ని దించుకోవడానికి మంచమ్మీద వాలి, దిండులో ముఖం దాచుకున్నాను. నా కన్నీటి తడి దిండులో ఇంకిపోతోంది. నా చేదు గతం మరోసారి తరముకొచ్చి నన్ను ముల్లులా గుచ్చుతోంది.

ఆ రోజు పొద్దున్నే అమ్మ నా దగ్గరకు వచ్చింది. ఇంకా నిద్రాదేవత ఒడిలోనే ఉన్న నా నుదుటన బొట్టు పెట్టింది. వెచ్చని హారతిని నా ముఖానికి అద్దింది. నా బుగ్గలు ముద్దాడి  ‘హ్యాపీ బర్త్‌డే బంగారూ’ అంది. పీజీ పూర్తి చేసి, ఉద్యోగం చేస్తున్నా నేను తనకి చంటిపిల్లలాగే కనిపిస్తానని అమ్మ అంటూ ఉంటుంది. అది ఎంత వాస్తవమో తను నన్ను ముద్దు చేయడం చూస్తే తెలుస్తుంది. కడుపు నిండా పాయసం పెట్టి ఆఫీసుకు పంపించింది. ఆ రోజు ఆఫీసు కూడా బర్త్‌డే విషెస్‌తో మార్మోగింది. రోజూ ఉండే సంతోషం రెట్టింపయినట్టనిపించింది. సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బండి తీయబోతోంటే నా కొలీగ్ తులసి వచ్చింది. అందరూ కలిసి నాకోసం ఓ రెస్టా రెంట్లో ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేశారని చెప్పింది. వద్దంటే బలవంతపెట్టింది. కానదలేకపోయాను. అమ్మకి విషయం మెసేజ్ చేసి తులసితో రెస్టారెంటుకు బయలుదేరాను. కేక్, స్వీట్స్, డ్రింక్స్, డిమ్ లైట్స్, హోరెత్తించే సాంగ్స్.. గ్రాండ్ పార్టీ. చాలా ఎంజాయ్ చేశాం. నేనెంతగా అలసిపోయానంటే.. ఎలా బయలుదేరానో, ఇంటికెలా చేరానో కూడా తెలీలేదు. కానీ ఆ స్థితికి అలసట కారణం కాదని, అందమైన నా జీవితాన్ని అల్లకల్లోలం చేసేందుకు ఎగసిపడిన ఓ మత్తు కెరటమని తెలియలేదు నాకు.

ఆ రాత్రి నేను ఇంటికి మామూలుగా రాలేదు. ఎవరో నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు. అరుగు మీద పడివున్న నన్ను అమ్మానాన్నలు లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఉదయం లేవగానే... సిగ్గు లేకుండా తాగుతావా అంటూ అమ్మ విరుచుకుపడింది. నాతో ఆ విషయం మాట్లాడ్డానికే సిగ్గుపడి నాన్న మౌనాన్ని ఆశ్రయించారు. కానీ నేను తప్ప తాగలేదని, కొందరు తప్పుడు మనుషుల దాహానికి బలైపోయానని తర్వాతగానీ మాకు తెలియలేదు. స్నానం చేసేటప్పుడు నా శరీరంపై కనిపించిన గాయాలు నాలో వంద సందేహాలను రేపాయి. అవి మామూలు గాయాలు కావు. నన్ను మోసగించి, నేను తాగే కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి, స్పృహలో లేని నన్ను తీసుకెళ్లి అనుభవించిన కర్కశుల పంటి గాట్లు, గోళ్ల గీట్లు. కన్‌ఫామ్ చేసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ జాలి చూపులు చూసింది. గ్యాంగ్‌రేప్ అంటూ గుండెలు పగిలిపోయే మాట చెప్పింది. తల తిరిగిపోయింది. పిచ్చిదానిలా అరిచాను. భోరున ఏడ్చాను. నిజం తెలుసుకోవాలని ఆఫీసుకు వెళ్తే అందరూ అమాయకంగానే కనిపించారు.

రాత్రి పార్టీ నుంచి నేనెవరికీ చెప్ప కుండా వెళ్లిపోయానని అన్నారు. అది నిజం కాదు. ఎవరో నన్ను డ్రాప్ చేస్తానంటూ తీసుకెళ్లడం నాకు గుర్తుంది. కానీ ఎంతగా ఆలోచించినా ఆ రూపమెవరిదో గుర్తు రాలేదు. కారు ఎక్కడం గుర్తుంది. కానీ నా బతుకును కాలరాయడం మాత్రం గుర్తు రాలేదు. ఇక ఎవరిని నిలదీయను? న్యాయం ఎవరిని అడగను? పార్టీకి వెళ్లడం నాదే తప్పంటారు నాన్న. పెళ్లి చేసుకుంటే అన్నీ చక్కబడతాయని అంటుంది అమ్మ. అదెలా సాధ్యం? నా బతుకును చీకటి చేసిన ఆ చేదు జ్ఞాపకాల నీడ నన్ను అంత తేలికగా వదిలిపోతుందా? మదమెక్కిన మృగాలు చీకట్లో నా తనువును చీల్చి చెండాడాయి. నా అభిమానంతో ఆడుకున్నాయి. మగవాడంటేనే భయపడేలా చేశాయి. అవన్నీ నేను మర్చిపోగలనా? గుర్తు తెలియని ఆ దుర్మార్గులు చేసిన గాయం సలుపుతూ ఉండగా మరో మగాడికి నా జీవితంలో స్థానం కల్పించగలనా? నా ఈ అవస్థ అమ్మకి ఎలాగూ అర్థం కావడం లేదు. కనీసం మీరయినా అర్థం చేసుకోండి ప్లీజ్!!
 - పూజ (గోప్యత కోసం పేరు మార్చాం)
 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement