వరుణ్ ఉత్తముడట..నేనే అతడి వెంట పడ్డానట!
షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
సమయం పన్నెండు దాటింది. గడియారపు ముల్లు పరుగులు తీస్తోంది. ఎక్కడా ఆగకుండా... తడబడకుండా... నిరాటంకంగా సాగిపోతోంది. గంటల్ని నిమిషాలుగా... నిమిషాలను సెకన్లుగా కరిగించేస్తోంది. నిశి రాతిరి నిశ్శబ్దాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చేస్తోంది. నా గుండె ఎందుకో దడదడా కొట్టుకుంటోంది. నా హృదయఘోష నన్ను కలవరపెడుతోంది. నాన్నా! కొన్ని రోజులుగా... కొన్ని వారాలుగా... కొన్ని నెలలుగా నా మనసు ఇలాగే ఘోషిస్తోంది. నన్ను చిత్రవధ చేస్తోంది. నాకు నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తోంది. నా గదిలో... ఒంటరిగా... నాలో నేను పడుతోన్న వేదన మీకు తెలియదు. గుండె గోడల్ని బద్దలు కొట్టుకుని రావాలన్ని ప్రయత్నిస్తోన్న వేదనను నేను ఎంత కష్టపడి అణచుకుంటున్నానో మీ ఎవరికీ అర్థం కాలేదు.
మీరందరూ నేను సంతోషంగా ఉన్నాననే అనుకుంటున్నారు. కానీ అది అబద్ధమని, నాదంతా నటన అని మీకు తెలియదు. నా పెదవులపై నవ్వును చూస్తే మీ కళ్లు వెలుగుతాయి. నేను హుషారుగా చిన్న మాట మాట్లాడినా అమ్మ ముఖంలో సంతోషపు పూలు పూస్తాయి. అవి మాయమవ్వకూడదనే నేను నోరు మెదపడం లేదు. నా ఆవేదనను బయటకు చెప్పడం లేదు. కానీ ఈ అంతర్మథనం నన్ను నిలువనీయడం లేదు నాన్నా! అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను. అది మీకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాను.
నా దృష్టిలో కాలేజీ అంటే ఏమిటో తెలుసా నాన్నా? కలలను నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలను అందు కోవడానికి, అనుకున్నది సాధించడానికి అందరిన్నీ సమాయత్తం చేసే చోటు. నడవడికను సరిదిద్ది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, మనిషికి మనీషిగా ఎలా ఎదగాలో తెలియజేసే చోటు. కాలేజీలో చేరేవరకూ ఇలాగే అనుకున్నాను. కానీ అది నిజం కాదని కాలేజీలో అడుగు పెట్టాక తెలిసింది. నా కలలు కాలి బూడిదయ్యాక అర్థమయ్యింది. నా జీవితం నరకప్రాయంగా మారిన తరువాత తెలిసివచ్చింది. ముక్కూ ముఖం తెలియని ఓ కుర్రాడు ఉన్నట్టుండి నా ముందుకు వచ్చాడు. నేను తనకి నచ్చానన్నాడు.
నా మీద తనకు ప్రేమ పుట్టిందన్నాడు. నాకు నవ్వొచ్చింది. ప్రేమా? అదెలా ఉంటుంది? అంత త్వరగా ఎలా పుడుతుంది? అయినా ప్రేమించుకోవడానికి వేరే స్థలాలు ఉన్నాయి. నేను కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి. మీరు కోరుకున్నట్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి. అదే అతనితో చెప్పాను. అర్థం చేసుకుంటాడనుకున్నాను. అడ్డు తప్పుకుంటాడనుకున్నాను. కానీ అడుగడుగునా ముళ్లు పరుస్తాడనుకోలేదు. నేను కాదనగానే వాడిలో వికృతత్వం వేయి తలలు వేసింది. పైశాచికత్వం పరవళ్లు తొక్కింది. వాడి వేధింపులకు నా మనసు బాణం దెబ్బ తిన్న పక్షి పిల్లలా విలవిల్లాడింది.
మీరు నన్ను విలువల్ని పంచి పెంచారు నాన్నా! కానీ వరుణ్‌ని వాళ్ల పేరెంట్స్ డబ్బు పోసి పెంచారు. వాడు అమ్మాయిలను ఏడిపించడానికే కాలేజీకి వస్తాడు. ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వంచించడానికే తాను మగాడిగా పుట్టినట్టు ఫీలవుతాడు. వాడి కన్ను పడిన అమ్మాయి వాడి సొత్తు అంటాడు. ఒంటరిగా దొరికితే తాకరాని చోట తాకుతాడు. అవమానంతో కుంగిపోతుంటే కర్కశంగా నవ్వుతుంటాడు. నా పేరును కాలేజీ గోడలమీదకు చేర్చాడు. తప్పుడు రాతలతో నా పరువును మంట గలిపేశాడు. మీకు చెప్పాలనే అనుకున్నాను. కానీ టెన్షన్ పడతారేమోనని భయమేసి, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాను. దాంతో అంతా ముగిసిపోతుందని అనుకున్నాను. కానీ అది నా కష్టాలకు ఆరంభమని, నా మనశ్శాంతికి అంతమని ఊహించలేకపోయాను.
నేను ఇచ్చిన కంప్లయింట్... నా పాలిట మరణ శాసనమయ్యింది నాన్నా! ఆ రోజు నుంచీ నా జీవితం పూర్తిగా మారిపోయింది. వాడు డబ్బులే తినిపించాడో, పలుకుబడితో పని కానిచ్చాడో తెలియదు కానీ... యాజమాన్యం వాడికి కాపలా కాయడం మొదలుపెట్టింది. వాడిని కాపాడుకోవడం కోసం నన్ను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. వాడు నన్ను నీడలా వెంటాడుతుంటే, పీడకలలా వేధిస్తూ ఉంటే పట్టనట్టు ఊరుకుంది. ఏమిటీ అన్యాయం అని అడిగినందుకు నన్ను పరిపరివిధాల అవమానించింది. నేను తప్పుడు ఫిర్యాదు చేశానట. ఆ వరుణ్ ఉత్తముడట. నేనే అతడి వెంటపడ్డానట. అతడు కాదంటే కసితో కంప్లయింట్ ఇచ్చానట. ఏవేవో అన్నారు నాన్నా! చెప్పరాని నిందలు వేశారు నాన్నా! మాటలతో నా గుండెలను తూట్లు పొడిచారు నాన్నా!
అప్పుడైనా మీకు చెబుదామనుకున్నాను. కానీ చెప్పలేని పరిస్థితి. వరుణ్ కోటీశ్వరుడైన తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి మన కుటుంబాన్ని నాశనం చేస్తాడట. అందుకే నోరు మూసుకుని ఉండ మన్నారు. అలా చెప్పింది ఎవరో తెలుసా నాన్నా! సాక్షాత్తూ మా ప్రిన్సిపల్. నా పరువు ఎలాగూ పోయింది. నా జీవితం ఎలాగూ నాశనమైపోయింది. మిమ్మల్ని కూడా ఎందుకు నాన్నా కష్టాల్లోకి లాగడం! నేనేమై పోయినా ఫర్వాలేదు. కానీ మీరు, అమ్మ పదిమందిలో తల దించుకోకూడదు నాన్నా! అందుకే మౌనాన్ని ఆశ్రయించాను. మౌనంగానే అన్నిటినీ సహించాను. కానీ ఇక నా వల్ల కాదు. క్షణక్షణం బతుకు భారమవు తోంది. ప్రతిక్షణం భయంతో గుండె గుబగుబలాడుతోంది. నవ్వడమే మర్చిపోయాను. మీ దగ్గర నటించ డానికి మాత్రమే నా పెదవులు విచ్చుకుంటున్నాయి. మిమ్మల్ని సంతోష పెట్టడానికి మాత్రమే నా కళ్లు కాంతుల్ని కొని తెచ్చుకుంటున్నాయి నాన్నా! నిజానికి నా కనురెప్పల మాటున కడవల కొద్దీ కన్నీళ్లు దాగివున్నాయి.
వాటిని మీ ముందు రాల్చే ధైర్యం కూడా చేయలేని నిస్సహాయురాలినయ్యాను. ఇక ఈ నరకయాతనను నేను భరించలేను. కల్లలైపోయిన కలల్ని ఏరుకునే ప్రయత్నం చేయలేను. ముక్కలైపోయిన హృదయానికి అతుకులు వేస్తూ బతుకు సాగించలేను. అందుకే వెళ్లిపోతున్నాను. అపవాదులు, అపనిందలు లేని చోటుకు వెళ్లిపోతున్నాను. ఎవరూ వేధించని, వేలెత్తి చూపించని చోటికి పయనమైపోతున్నాను. మీ ఆశల్ని మంటగలిపి, మీ కలల్ని కాలరాసి, నా ఈ మరణలేఖను మీకు మిగిల్చి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్నా... వీలైతే నన్ను క్షమించండి. శెలవ్.
ప్రేమతో మీ కూతురు నిత్య (పేరు మార్చాం)
(మృతురాలి గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా)
ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
ఆత్మహత్య చేసుకోవడమనే నిర్ణయం అంత తేలికగా తీసుకునేది కాదు. నిరాశ ఎక్కువై, నిస్సహాయంగా ఫీలయ్యి, ఇక ఎవరూ తన సమస్యను పరిష్కరించ లేరు అనిపించినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకే ‘సూసైడ్ ఈజ్ ఎ క్రై ఫర్ హెల్ప్’ అంటుంటాం. పాపం ఈ అమ్మాయి కూడా అలాంటి స్థితిలోనే ఆ నిర్ణయం తీసుకుని ఉండాలి. చెడ్డ పేరు వస్తుందని, తల్లిదండ్రులు అవమానంగా ఫీలవుతారని ఆలోచించి ఉంటుంది. నిజానికి ఆత్మహత్య ఆలోచనలు కలవారిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒత్తిడికి లోనవడం, ఊరికే కోపం తెచ్చుకోవడం, వస్తువులు పగులగొట్టడం వంటివి చేస్తుంటారు.
కొందరు డల్ అయిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఊరికే దుఃఖపడు తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడి, మేమున్నా మనే ధైర్యాన్ని కల్పించాలి. పరిస్థితి చేయి దాటినట్టనిపిస్తే డాక్టర్‌కి చూపించాలి. ఈ లక్షణాలను గుర్తించడంలో విఫలమైతే మాత్రం... ఇలాంటి ఘటనలను ఆపడం కష్టం!