'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను' | She alert | Sakshi
Sakshi News home page

'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'

Published Wed, Apr 29 2015 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'

'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'

షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!

 
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
 
 ‘మధూ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే... నువ్వు లేకుండా బతకలేనంత. నీకోసం ప్రాణమైనా ఇవ్వగలిగేంత. ఐలవ్యూ మధూ’ సురేశ్ మాటలు చెవిన పడుతున్నాయి. కానీ అదేంటో... నా మనసులో ఎలాంటి భావమూ లేదు. అది పెద్దగా స్పందించడం లేదు. పరవశించి పరవళ్లు తొక్కడం లేదు. నిశ్చలంగా ఉంది. ‘ఏంటి మధూ... ఏం మాట్లాడవేంటి?’... నా సమాధానం కోసం ఎక్కువసేపు ఎదురుచూడలేనట్టు ఆతృతగా అడిగాడు సురేశ్. త్వరగా పెదవి విప్పు అన్నట్టుగా నా ముఖంలోకే చూస్తూ నిలబడ్డాడు. జవాబు కోసం కంగారుగా కళ్లలో వెతుకుతున్నాడు. కనిపించలేనట్టుంది. కాస్త నిరాశగా ముఖం పెట్టాడు.

 ‘నేను నీతో ఒకటి చెప్పాలి సురేశ్. అది విన్న తర్వాత నీ నిర్ణయం చెప్పు’ అన్నాను. ‘త్వరగా చెప్పు/ అంటూ వినడానికి సమాయత్తమయ్యాడు. నేను చెప్పాను. అంతా చెప్పాను. ఏదీ దాచకుండా చెప్పేశాను. అంతే... సురేశ్ ముఖం మ్లానమయ్యింది. మౌనంగా అయిపోయాడు. కాసేపు దిక్కులు చూశాడు. క్షణం తర్వాత తేరుకుని అన్నాడు... ‘సారీ మధూ. ఓ అర్జంటు పని గుర్తొచ్చింది. మళ్లీ కలుస్తాను’ అంటూ వెళ్లిపోతుంటే ఫక్కున నవ్వాన్నేను. తెరలు తెరలుగా తన్నుకొస్తోన్న నవ్వును తొక్కిపట్టే ప్రయత్నం చేయకుండా విరగబడి నవ్వాను. నవ్వీ నవ్వీ చివరికి అలసిపోయి ఆగిపోయాను.

 నీకేమైనా పిచ్చా అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు సురేశ్. అవును. నాకు పిచ్చే. నిజంగా పిచ్చే. లేదంటే ఇలా ఎందుకు నవ్వుతాను? ఎగసిపడుతోన్న బాధను యెద గోడల మధ్య దాచేసి... ఏమీ లేనట్టు, ఏదీ ఎరగనట్టు ఎందుకిలా పగలబడి నవ్వుతాను? నాకు పిచ్చే. లేదంటే... మూగబోయిన మనసును ఎవరో వచ్చి మళ్లీ పలికిస్తానంటే సంతోషపడాల్సింది పోయి, నిజాలు నిక్కచ్చిగా చెప్పి, అది విన్న వ్యక్తి ఛీ అన్నట్టుగా చూస్తుంటే ఏడవకుండా నరాలు తెగిపోయేంతగా పడీ పడీ ఎందుకు నవ్వుతాను? పిచ్చే. నాకు పిచ్చే. కానీ ఈ పిచ్చి ఒకప్పుడు లేదు. ఇంత నటన నాకు ఒకప్పుడు చేతగాదు. అప్పుడు నేను నిజంగానే నవ్వేదాన్ని. మల్లెలు విరిసినట్టు.. వెన్నెల విరబూసినట్టు.. హిమం కురిసినట్టు.. స్వచ్ఛంగా, నిండుగా నవ్వేదాన్ని. ఆ నవ్వు నాకు మా నాన్న ఇచ్చారు. ఆయనెప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వెంటాడి వేధించినా నవ్వుతూనే వాటితో పోరాడేవారు. సంపదలు చేజారినా, అయినవాళ్లు మోసగించినా నవ్వుతూనే అన్నిటినీ అధిగమించేవారు. చివరికి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు, రోగం ముదిరి మృత్యువు ఆయనను కౌగిలించుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన నవ్వుతూనే వెళ్లిపోయారు. కానీ ఆ క్షణమే నా పెదవుల మీది నుంచి నవ్వు చెరిగిపోయింది.

అమ్మ నన్ను చిన్ననాట వదిలి వెళ్తే... నాన్న యవ్వనంలో వదిలిపోయారు. వెంటాడే వాళ్ల జ్ఞాపకాలు... భయపెట్టే ఒంటరి క్షణాలు... బతుకును భారంగా మార్చేశాయి. ఏం చేయాలో తెలీదు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. అంతా చీకటి. ఏ దారీ కనిపించని చిక్కనిచీకటి. అప్పుడే ఉన్నట్టుండి నాన్నగారి చెల్లెలు వచ్చింది. ఆమె పుట్టగానే మా నానమ్మా తాతయ్యా చనిపోతే నాన్నే పెంచారట. కానీ నాన్న మాటను కాదని ప్రేమించినవాడితో వెళ్లి పోయింది. అమ్మానాన్నా అయి పెంచిన అన్నని పగవాడిలా చూస్తూ ఇన్నేళ్లూ గడిపింది. కానీ ఆయన మరణవార్త తెలిశాక ఆగలేక వచ్చేసింది. నా అన్నవాళ్లు లేక నిస్పృహతో ఉన్న నన్ను అక్కున చేర్చుకుంది. నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అంత వేదనలోనూ ఓ చిన్న ఓదార్పు. నాకంటూ కొందరు ఉన్నారన్న ధైర్యం. గతాన్ని మెల్లగా మర్చిపోవాలనుకున్నాను. భవిష్యత్తును మలచుకుందామనుకున్నాను. కానీ అది సాధ్యం కాదనీ, నా భవిష్యత్తును అప్పటికే మా అత్త భర్త మరోలా లిఖించేశాడనీ తెలుసుకోలేకపోయాను.

అత్తయ్య తొలిసారి ఇంటికి తీసుకెళ్లినప్పుడు నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు మావయ్య. ఆ ఆప్యాయత ఆయన్ను నా మనసులో నాన్న స్థానంలో నిలబెట్టింది. కానీ ఆ నాగుపాము ఎప్పటికీ నాన్న కాలేదని తర్వాత తెలిసింది. అతనో దుర్మార్గుడు. పెళ్లానికీ కూతురికీ తేడా తెలియని కామాంధుడు. అక్కడ అడుగు పెట్టినప్పుడే నామీద కన్ను వేశాడు. అదను కోసం కాపు కాశాడు. అత్తయ్య లేని క్షణం చూసి పడగ విప్పాడు. నేను తన నిజ స్వరూపాన్ని గ్రహించేలోపే కాటు వేశాడు. నా భవితను కాలరాశాడు. నా బతుకును కన్నీటిపాలు చేసేశాడు. అంతటితో ఆగలేదు. తన వ్యాపార అవసరాల కోసం నన్ను మరికొందరి అవసరాలు తీర్చమన్నాడు. కాదంటే తనకు తోచిన రీతిలో కసి తీర్చుకునేవాడు. అత్తతో చెబుదామను కున్నాను. కానీ  ఆ నీచుడు నాకా అవకాశం ఇవ్వలేదు. నోరు విప్పితే నిందల పాలు చేస్తానన్నాడు. నేనే తనని రెచ్చగొట్టానని అత్తయ్యకు చెబుతానన్నాడు. అతడి కోసం కళ్లలో పెట్టుకుని పెంచిన నాన్ననే కాదన్న అత్త... ఇవాళ అతడి కోసం నన్ను తప్పుడు మనిషిగా ఎంచదన్న నమ్మకం ఏముంది! అందుకే నోటికి తాళం వేసుకున్నాను. నిజాన్ని పెదవుల మాటున నొక్కిపెట్టేశాను. దాంతో నా బతుకు మరీ నరకమైపోయింది. నా తనువు అతని స్నేహితుల చేతుల్లో వందలసార్లు నలిగిపోయింది. నా మనసు వేలసార్లు చచ్చిపోయింది.

తట్టుకోలేకపోయాను. తెగించాలని నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తి దగ్గరకు నన్ను పంపినప్పుడు తప్పించుకు పారిపోయాను. ఎలాగో ఓ స్వచ్ఛంద సంస్థ నీడకి చేరాను. వారి సాయంతో నా కాళ్లమీద నేను నిలబడ్డాను. అప్పుడే పరిచయమయ్యాడు సురేశ్. నన్ను ప్రేమించానన్నాడు. నేను లేకపోతే చచ్చిపోతా నన్నాడు. దాంతో నా గతాన్ని అతని ముందు పరిచాను. గతుక్కుమన్నాడు. నువ్వు నా ప్రాణం అన్నవాడు కాస్తా నా మానం పోయిందని తెలిసి తన మానాన తను వెళ్లిపోయాడు. నేను లేకపోతే చచ్చిపోతాను అన్నవాడు నాతో బతకడం ఇష్టం లేదంటూ ముఖం తిప్పుకుని వెళ్లిపోయాడు. అంత వరకూ పొంగి పొర్లిన ప్రేమ నేను పతితనని తెలియగానే మాయమైపోయింది. నన్ను చిన్నచూపు చూసి వెళ్లిపోయింది. అంతే. ఆరోజే నిర్ణయించుకున్నాను... ఇక ఏ మగవాడినీ నా చేరువకు రానివ్వకూడదని. నిజం దాచి దగ్గర కాలేను. మోసగించి మనువాడలేను. అలా అని నిజం చెప్పి ఇలా ఛీత్కారానికి గురవ్వనూలేను. అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను. నాకూ ఆశలున్నాయన్న సంగతిని పూర్తిగా విస్మరించాను. తోడు కోరుకోవడం మాని నేను మోడులా బతుకుతున్నాను. తోచిన దారిలో సాగిపోతున్నాను. అంతకంటే ఏం చేయను!!
 - మధుమిత (గోప్యత కోసం పేరు మార్చాం)
ప్రెజెంటేషన్: సమీర నేలపూడి

 
అందరూ ఒకలా ఉండరు. సురేశ్ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తారస పడతారు. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరికీ దగ్గర కాకూడదు అన్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నిజం చెప్పి తీరాలన్న రూలేమీ లేదు కదా! అందరూ మెచ్యూర్‌‌డగా ఉండకపోవచ్చు. అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి బాధపెట్టే నిజాన్ని చెప్పడం కంటే మనసులోనే సమాధి చేసెయ్యడం మంచిది. జరిగినదాన్ని ఓ యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవడమే మంచిది. మధుమిత అనుకున్నట్టు అది మోసం కాదు. పాపం తనే మోసపోయింది. ఎవరో చేసిన ద్రోహానికి బలయ్యింది. అందులో ఆమె తప్పేమీ లేదు. అందుకే తన గతాన్ని చెప్పకపోవడం మోసం ఎప్పటికీ అవ్వదు. కాబట్టి అదంతా తను పూర్తిగా మర్చిపోవడమే మంచిది.
 
డా॥శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై.
సైకియాట్రిస్టు
ప్రభుత్వ మానసిక చికిత్సాలయం
ఎర్రగడ్డ, హైదరాబాద్

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement