Sona
-
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్‌లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్‌కు చివరి రోజుగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్‌తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్‌ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
శృంగార తార అనే ముద్ర చెరిపేందుకే ‘స్మోక్’ చేశా: నటి
తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనా. ముఖ్యంగా శృంగార తార అనే ముద్రను వేసుకున్నారు. ఇదే తనకు నచ్చలేదని సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నటి సోనా దర్శకురాలిగా పరిచయం అవుతూ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ స్మోక్. సోనా జీవిత చరిత్రతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ వివరాలను సోనా వెల్లడించారు. తాను నటిగా 2000 సంవత్సరంలో పరిచయం అయ్యానని చెప్పారు. అలా ఈ 23 ఏళ్లు ఎంతో సంతోషాన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. శారీరకంగానూ మానసికంగానూ చాలా గాయపడ్డారని చెప్పారు. ఒకానొక సమయంలో సినిమాలు వద్దనుకొని ఇంట్లోనే గడిపానన్నారు. పలు భాషల్లో సుమారు 150 కి పైగా చిత్రాల్లో నటించానని చెప్పారు. తనపై శృంగార తార ముద్ర పడడంతో అందుకు గల కారణాలను వెతుకున్నానని, పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదని వారికి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు కారణంగా జీవితాలు మలుపు తిరుగుతాయని పేర్కొన్నారు. ఆ విధంగా తనపై పడ్డ శృంగార తార అనే ముద్రను చెరుపుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ స్మోక్ అని చెప్పారు. తాను దర్శకురాలిగా మారడానికి ముందు ఫిలిం ఇన్స్టిట్యూట్లో దర్శకత్వం, చాయాగ్రహణం శాఖల్లో శిక్షణ పొందినట్లు చెప్పారు. తన జీవితంలో 99.9% వాస్తవాలను ఆవిష్కరించే వెబ్ సిరీస్‌గా స్మోక్ ఉంటుందన్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రచారం అయిన తర్వాత పరిహాసాలు విమర్శలు ఎదురవ్వవచ్చన్నారు. ఇది పూర్తిగా తన జీవిత చరిత్ర అని ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవని చెప్పారు. దీనికి షార్ట్ ఫ్లిక్ ఓటీటీ సంస్థ సహకారం ఉందని చెప్పారు. -
'ఆంధ్రావాలా' నటి జీవితంపై వెబ్ సిరీస్.. తనే డైరెక్ట్ చేస్తుందట!
ఎవరిదైనా బయోపిక్‌ను తెరకెక్కించాలంటే అందుకు తగిన ఘన చరిత్ర ఉండాలి. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సంఘటనలు ఉండాలి. అలాంటి పలు చిత్రాలు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి కూడా. ఇందిరాగాంధీ, క్రీడాకారుడు ఎంఎస్.ధోని వంటివి అలా రూపొందిన చిత్రాలే. కాగా తాజాగా శృంగార తారగా ముద్రపడ్డ నటి సోనా బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కుశేలన్ చిత్రంలో వడివేలుకు భార్యగా నటించి గుర్తింపు పొందిన బోల్డ్ లేడీ సోనా. అదే విధంగా గురు ఎన్ ఆళు, అళగర్ మలై, ఒంబదుల గురు, జిత్తన్– 2 మొదలగు పలు తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆంధ్రావాలా, కథానాయకుడు, విలన్, ఆయుధం వంటి సినిమాలు చేసింది. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించి గుర్తింపు పొందిన సోనా నిర్మాతగానూ మారి అమ్మా క్రియేషన్స్ టీ.శివతో కలిసి కనిమోళి అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా మరో చిత్రాన్ని కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టినా అది పలు సమస్యల కారణంగా తెరకెక్కలేదు. అలాంటిది తాజాగా తన జీవిత చరిత్రలోని ఒక భాగాన్ని వెబ్ సిరీస్‌గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సోనానే దర్శకత్వం వహించనున్నారట. దీనికి స్మోక్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇందులో తను నటించకుండా మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్ -
సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ (సోనా కామ్స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్‌లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 40.5 మిలియన్ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సెన్సార్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాటాల కొనుగోలు డీల్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్స్టార్ ఎడీ వివేక్ విక్రమ్ సింగ్ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్లోవిక్ చెప్పారు. గతేడాది నోవెలిక్ ఆదాయం 9.3 మిలియన్ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్ యూరోలుగా నమోదైంది. -
తప్పుగా ప్రచారం చేయకండి ప్లీజ్ :నటి
సినిమా: తన గురించి తప్పుగా ప్రచారం చేయకండి ప్లీజ్ అని అంటోంది నటి సోనా. కుశేలన్, కో వంటి పలు శృంగార పాత్రల్లోనూ, ప్రతి నాయకి పాత్రల్లోనూ నటించి సంచలన నటిగా ముద్రవేసుకున్న ఈ అమ్మడు ఆ మధ్య నిర్మాతగా మారి చిత్రం ప్రారంభించి ఆదిలోనే చేతులెత్తేసింది. దమ్ము కొట్టడం మానేశానని ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా మరోసారి చర్చల్లో నానుతోంది. ఒక మలయాళ చిత్రంలో శృంగారాత్మక పాత్రలో విచ్చలవిడిగా అందాలను గుమ్మరించడమే ఈ చర్చకు కారణం.అయితే తాను ఆ పాత్రలో అందాలను ఆరబోసినా, అందుకు కారణం ఉందని, అది చాలా మంచి పాత్ర అని ఈ జాణ చెప్పుకుంటోంది. నటి సోనా అందాలారబోసిన చిత్రం పచ్చమాంగా. మలయాళంలో తెరకెక్కిన చిత్రం ఇది. దీని ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అందులో నటి సోనా శృంగార రస నటన గురించి సామాజిక మాధ్యమాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో నటి సోనా వాటికి వివరణ ఇచ్చే విధంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో పచ్చమాంగా ఒక బలమైన కథాంశంతో కూడిందని చెప్పింది. బాలుమహేంద్ర చిత్రాల మాదిరి పక్కా క్లాసైన చిత్రం అని చెప్పింది. ఆ చిత్ర ట్రైలర్లో తన తాను ధరించిన దుస్తులు, కొద్ది పాటి సన్నివేశాలను చూసి శృంగార భరిత పాత్రలో నటించినట్లు భ్రమను కలిగిస్తున్నారని అంది. అది నిజం కాదని చెప్పింది. కేరళలో మహిళలు ఎలా దుస్తులు ధరిస్తారో అలానే సహజంగా ఉండాలని అలాంటి దుస్తులు ధరించినట్లు చెప్పింది. తాను ధరించిన దుస్తులను బట్టి అది గ్లామరస్ కథా చిత్రం అనో, తనను శృంగార నటి అనో చిత్రీకరించరాదని అభ్యర్థిస్తున్నానని చెప్పింది. పచ్చమాంగ అన్నది చాలా మంచి కథా చిత్రం అని చెప్పింది. తన కథా పాత్ర కూడా బలమైనదని అంది. చిత్రం విడుదలైన తరువాత ఈ విషయం అందరికీ అర్థం అవుతుందని నటి సోనా పేర్కొంది. ఇందులో నటుడు ప్రతాప్‌పోతన్ కూడా నటించారని, మరి ఆయన్నేమంటారని ఈ అమ్మడు ప్రశ్నస్తోంది. -
మద్యపానం మానేశా : నటి
చెన్నై,పెరంబూరు: మద్యం తాగడాన్ని మానేశానంటోంది నటి సోనా. శృంగార తారగా ముద్ర వేసుకున్న ఈ భామ తమిళంతో పాటు పలు భాషల్లో నటించింది. తమిళంలో కుశేలన్ షాజహాన్, గురు ఎన్‌ఆళు వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. చివరిగా గత ఏడాది ప్రశాంత్ హీరోగా నటించిన జానీ చిత్రంలో కనిపించింది. ఈ అమ్మడు చాలా డేరింగ్ లేడీ అనే పేరు తెచ్చుకుంది. పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు కూడా ఈమెకి ఉన్నాయి. ఆ మధ్య చిత్ర నిర్మాణం కూడా చేపట్టింది.అయితే అది ఆదిలోనే ఆగిపోయింది. ఇకపోతే అంతకు ముందు ఏదో వివాదంతో తరచూ వార్తల్లో ఉండే సోనా ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. దీంతో నటి సోనా నటనకు గుడ్‌బై చెప్పిందనీ, అసలు ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సోనా స్పందించింది.ఒక ప్రకటనను సోమవారం మీడియాకు విడుదల చేసింది. అందులో కొందరు తన గురించి నిరాధార ప్రచారం చేస్తున్నారని, తాను సినిమాల్లో నటించడం లేదనీ, ఎక్కడికో వెళ్లిపోయాను అనీ ప్రచారం చేస్తున్నారని వాపోయింది. నిజానికి తాను ఎక్కడికీ వెళ్లలేదని, నటనకూ దూరం కాలేదని వివరించింది. ఈ ఏడాది నాలుగైదు చిత్రాల్లో నటించానని, 12 చిత్రాలను నిరాకరించినట్లు చెప్పింది. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నానని చెప్పింది. డబ్బు కోసం పరుగులు తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. ఇంతకు ముందులా కాకుండా తానిప్పుడు చాలా పరిపక్వత చెందినట్లు పేర్కొంది. మద్యపానం మానేశానని చెప్పింది. ఈ ఏడాదిలో తాను ఛేజింగ్, పరమ పదం విళైయాట్టు, అసాల్ట్, తేడుదల్, పచ్చమాంగా తదితర చిత్రాల్లో నటించానని, నూతన సంవత్సరంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని నటి సోనా తెలిజేశారు. -
ఎవరైనా అడిగితే ఓకే అంటా!
నా జీవిత కథను తెరకెక్కించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారని సంచలన తార సోనా వ్యాఖ్యానించారు. జీవితంలో పలు ఎదురు దెబ్బలు తిన్న నటి సోనా బహుశా ఆ అనుభవాలే ఆమెకు పాఠాలు నేర్పాయేమో. సోనా చాలా బోల్డ్‌గా మాట్లాడుతారు. శృంగారతారగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో పలు రకాల పాత్రలకు భాగస్వామ్యం వహించారు. అందులోనూ కొన్ని చేదు అనుభవాలను చవి చూసిన సోనా తన జీవిత కథను తానే తెరపైకి ఎక్కిస్తానని వెల్లడించారు. దీంతో కొందరికి వెన్నులో వణుకు పుట్టిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీ జీవిత కథను రాస్తున్నట్లు వెల్లడించారు. అది ఎంత వరకు వచ్చింది అన్న ప్రశ్నకు సోనా బదులిస్తూ నా జీవిత కథ రాయడం పూర్తి అయి ఏడాది దాటింది. ఆ పుస్తకాన్ని విడుదల చేయడం కోసం వేచి ఉన్నాను. ఇందులో పలు సంచలన అంశాలు చోటు చేసుకోవడంతో దీన్ని చిత్రంగా రూపొందించడానికి ఇద్దరు మలయాళ నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే నా జీవిత చరిత్రను చిత్రంగా మలయాళంలో రూపొందించాలనుకోవడం లేదన్నారు. తమిళ చిత్రంగా :నేను నివసిస్తోంది తమిళనాడులో. తొలిసారిగా నటించింది పూ వెల్లాం ఉన్ వాసం అనే తమిళ చిత్రంలోనే. రెండు మూడు సార్లు కింద పడి లేసిన నటిని. అప్పుడు నన్ను ఆదుకుంది తమిళ సినిమాలే. నేనీ స్థాయిలో ఉండడానికి కారణం తమిళ సినీ అభిమానులే. అందువలన నా జీవిత కథతో చిత్రం చేయాలని తమిళ నిర్మాత లెవరైనా అడిగితే వెంటనే అంగీకరిస్తానన్న సోనాతో ఇంతకు ముందు పబ్‌లు, పార్టీలు అంటూ సంచలనం సృష్టించే మీరు ఈ మధ్య సెలైంట్ అయినట్టున్నారే? అన్న ప్రశ్నకు కొన్ని వారాలుగా పార్టీలకు దూరంగానే ఉంటున్నానన్నారు. నటిగా ఏమైనా సాధించారనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు నేను చిత్ర రంగ ప్రవేశం చేసి 15 ఏళ్లు అయ్యింది.రజనీ, కమల్, విజయ్, అజిత్, తెలుగులో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి ప్రముఖ నటులందరితోను నటించాను. ఇది ఒక విజయమే అన్నారు. నటిగా 15 ఏళ్లు పూర్తి అయిన ఆ వయసు మీ రూపంపై పడకపోవడానికి కారణం ఏమిటని భావిస్తున్నారన్న ప్రశ్నకు సంతోషంగా ఉండడమే. ఆ మధ్య కొందరు నన్ను మోసం చేసినప్పుడు కాస్త బాధపడిన మాట నిజమే. ఇప్పుడు అదంతా మరచి మళ్లీ ఆనందానికి స్వాగతం పలికాను. మరో విషయం ఏమిటంటే 16 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్‌గా తయారయ్యాను. ఎప్పుడూ వ్యాయాయమే గెలుస్తుందనడానికి నేనే ఒక ఉదాహరణ అంటున్నారు సంచలన నటి సోనా. -
‘ఎందుకింత మోసం చేశావ్?'
జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు! షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘సోనా... ఐ లవ్యూ. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. నీ ప్రేమ నాకో వరం.’ చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. మంద్రంగా పలుకుతోన్న ఆ స్వరం మత్తెక్కిస్తోంది. అంత వరకూ శూన్యాన్ని చూపులతో కొలిచిన నేను, తన్మయత్వంతో తన ముఖంలోకి చూశాను. చిన్నగా నవ్వాడు. చిలిపిగా కన్ను గీటాడు. సిగ్గు ముంచుకొచ్చింది. తన కళ్లలోకి చూడలేక చప్పున తల దించుకున్నాను. గడ్డం పుచ్చుకుని నా తలను పైకి లేపాడు. ఆ స్పర్శ నాలో ఏవో మధురానుభూతుల్ని రేపుతోంది. నన్ను వివశురాలిని చేస్తోంది. పరవశంతో నా పెదవులు అదురుతున్నాయి. సిగ్గు బరువుతో కనురెప్పలు సోలిపోయాయి. తను నన్ను మరింత దగ్గరకు లాక్కున్నాడు. నడుం చుట్టూ వేసిన తన చేయి మెల్లగా బిగుసుకుంటోంది. నా ముఖం తన వదనానికి చేరువగా వెళ్తోంది. తన శ్వాస నన్ను వెచ్చగా సోకుతోంది. కళ్లు మూసుకుని అనిర్వచనీయమైన ఆ అనుభూతిని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. అంతలో ఓ బలమైన పవనం అత్యంత వేగంగా వచ్చి నా ముఖానికి ఛెళ్లున తగిలింది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. ఎదురుగా ఎవరూ లేరు. ఏ చేయీ నన్ను పెనవేయలేదు. అంటే... ఇదంతా ఊహా? ఎంత అందమైన ఊహ! రైలు వేగంగా పరుగులు తీస్తోంది. భవంతులు, చెట్లూ చేమలూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. స్వర్గలోకంలో పాదం మోపడానికి నేను ముందుకెళ్తుంటే, నా పాత జీవితం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను వదిలి వెనక్కి వెళ్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రైలు హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ఆగింది. కాలు ప్లాట్‌ఫామ్ మీద పెడుతోంటే ఏదో గమ్మత్తయిన ఫీలింగ్ మనసంతా ఆవరించుకుంది. ఆ రోజుతో నా జీవితం ఒక కొత్త రంగు పులుముకోబోతోందన్న ఆలోచనే నన్ను నిలువనీకుండా చేస్తోంది. ఆనందం కెరటమై ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. హుషారుగా ఎగ్జిట్ వైపు నడిచాను. ఓ ఆటోవాణ్ని పిలిచి నేను వెళ్లాల్సిన చోటు చెప్పాను. అరగంట తిరిగేసరికల్లా అక్కడ ఉన్నాను. తనని చూడాలని మనసు తహతహలాడుతోంది. అతని రూపాన్ని తనలో ముద్రించుకోవాలని ఉవ్వి ళ్లూరుతోంది. అసలు ఎవరు తను? ఎలా వచ్చాడు నా జీవితంలోకి? కొన్ని నెలల క్రితం వరకూ ఒకరి పేరు ఒకరికి తెలియదు. ఒక గురించి ఒకరు విన్నది లేదు. అలాంటిది ఈరోజు ఒక్కటి కాబోతున్నాం. ఇద్దరి జీవితాలనూ పెనవేసి ఒక్కటిగా జీవించబోతున్నాం. తనతో మాట్లాడిన మాటలు... తనతో పంచుకున్న భావాలు... అన్నీ యెదలో మెదిలి రొదపెడుతున్నాయి. ఏవేవో చిలిపి ఊహలు మనసంతా పరచుకుని అల్లరి పెడుతున్నాయి. పరిసరాలను సైతం మర్చిపోయి పులకించిపోతున్నాను. అంతలో నా వీనులను తీయగా తాకిందో స్వరం... సోనా! అదే స్వరం. నాతో ఫోన్లో మాట్లాడిన మధురమైన స్వరం. తనే. అది తనే. తనని చూడబోతున్నానన్న సంతోషం సాగరమై ఉప్పొంగుతుంటే విప్పారిన కన్నులతో వెనక్కి తిరిగాను. అంతే... అవాక్కయిపోయాను. జీవమున్న శిలలా నిలబడిపోయాను. సారీ సోనా... లేటయ్యింది’... తను మాట్లాడుతున్నాడు. అంతే మార్దవంగా... అంతే ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు సంతోషం కలగడం లేదేంటి? ఇంత వరకూ నాకు కుదురులేకుండా చేసిన కమ్మని ఊహలు చెదిరిపోయాయేంటి? నా ఆశలన్నీ నా కళ్లముందే ఎండుటాకుల్లా రాలిపోతున్నా యేంటి? ఎవరితను? తన ప్రేమ మత్తులో నన్ను ముంచేసి... కోటి ఆశలు నాలో రేపి... నా వాళ్లను, నా ఊరిని, చివరికి నా రాష్ట్రాన్నే వదిలి వచ్చేంతగా నన్ను మార్చేసిన వ్యక్తి ఇతనా?! మనసు రగిలిపోతుంటే... అణువణువూ అవమానంతో మండిపోతుంటే ఆవేశంగా అన్నాను... ‘ఎందుకింత మోసం చేశావ్?’ నా ప్రశ్నకి అతను షాక్ తినలేదు. సంజాయిషీ కూడా ఇవ్వలేదు. ‘ఇందులో మోసం ఏముంది? నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నా ప్రేమ స్వచ్ఛమైనది. నన్ను నమ్ము.’ నాకు నవ్వొచ్చింది. పిచ్చిదానిలా పగలబడి నవ్వాను. దీనికేమైనా మతి పోయిందా అని చూసేవాళ్లంతా అనుకునేలా విరగబడి నవ్వాను. నవ్వి నవ్వి నరాలు తెగిపోతాయేమోనన్నట్టు తెరలు తెరలుగా నవ్వాను. ఆ నవ్వు తెరలు కన్నీటి పొరలుగా మారేంతవరకూ నవ్వుతూనే ఉన్నాను. ఏమిటి ప్రేమ? ఏది స్వచ్ఛమైన ప్రేమ? ఒకరోజు ఫేస్బుక్లో పాత ఫ్రెండ్స్ కోసం వెతుకుతుంటే హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. పరిచయం ఉన్నవాడిలా పలకరించాడు. స్పందించేవరకూ వేధించాడు. మాట కలిపాడు. మనసును అందంగా అక్షరాల్లో పరిచాడు. రాతలకు ఫుల్స్టాప్ పెట్టి, ఫోన్లో కబుర్లు మొదలెట్టాడు. స్నేహమన్నాడు. దాన్ని ప్రేమగా మార్చేశాడు. ప్రేమకు కొత్త నిర్వచనాలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. సంప్రదాయాలకు ప్రాణమిచ్చే అమ్మానాన్నలు ఒప్పు కోరంటే... తానే అమ్మా నాన్నా అవుతానన్నాడు. తానొక్కడినే అందరి ప్రేమనూ అందించగలనంటూ నమ్మబలికాడు. నిజమే అనుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను. అమ్మానాన్నలకు తెలియకుండా రహస్యంగా రెలైక్కాను. గతాన్ని సమాధి చేసి భవిష్యత్తుకు తనతో కలిసి పునాది వేసుకోవాలనుకున్నాను. కానీ అతను... అతను నా కలల రాకుమారుడు కాడు. కరిగిన వయసును కళ్లకు కడుతోంది అతడి నెరసిన జుత్తు. వృద్ధాప్యపు వాకి ట్లో అప్పటికే అడుగు పెట్టాడని చెబుతోంది ముడతలు పడిన అతడి మేను. నాన్న వయసువాడా? కాదు. అంతకంటే పెద్దవాడేనేమో. ఎంత నటించాడు? ఎంత దారుణంగా మోసం చేశాడు? పిచ్చిగా ప్రేమించాను. తన కోసం కడుపున మోసి కన్న అమ్మని వద్దనుకున్నాను. కళ్లల్లో పెట్టుకుని పెంచిన నాన్నను కాదనుకుని వచ్చేశాను. చూడకుండా ప్రేమించడం గొప్ప అనుకున్నాను కానీ, అదే పెద్ద తప్పవుతుందని ఊహించలేకపోయాను. పోలీసుల సాయంతో వాడి కబంధ హస్తాల నుంచి తప్పించు కున్నాను కానీ, వాడు చేసిన ద్రోహాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అమ్మానాన్నలు నన్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. కానీ సిగ్గుతో మనసు చితికిపోతోంది. నేటికీ వాళ్ల చూపులు ‘ఎందుకిలా చేశావ్’ అని అడుగుతున్నట్టే అనిపిస్తోంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ధైర్యం నాకు లేదు. నాకే కాదు... నాలా తప్పటడుగులు వేసే ఏ అమ్మాయికీ జవాబు చెప్పే ధైర్యం ఉండదు. అర్హత అంతకన్నా ఉండదు!! - సోనాలి (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఇంటర్నెట్‌ని విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోకుండా నేరాలకు వేదికగా మార్చేయడం నిజంగా దురదృష్టకరం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఇటువంటివాళ్లు ఉన్నారని తెలిసి కూడా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండకపోవడం. తానెవరో ఎలాగూ తెలియదు కదా, ఆ అమ్మాయికి కనబడను కదా అని ఆ వ్యక్తి ధైర్యంగా మోసం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ అమ్మాయి కూడా నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం అతడు చెప్పిన విషయాలు నమ్మేసి, అతని కోసం వచ్చేసింది. తీరా చూశాక గానీ తెలియలేదు అతగాడి నిజస్వరూపం. నేను చెప్పేది ఒకటే. ఇప్పటికైనా అమ్మాయిలు ఫేస్బుక్ పరిచయాల విషయంలో జాగ్రత్తపడితే మంచిది. ఎవరేది చెబితే అదే నిజం అనేసుకోకూడదు. ముందూ వెనుకా ఆలోచించి అడుగేయాలి. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. -
ఆ పాట నన్ను స్టార్‌ని చేసింది!
సంభాషణం: సత్యమేవ జయతే కార్యక్రమం చూసినవాళ్లకి సోనా మహాపాత్ర గురించి చెప్పాల్సిన పని లేదు. ఎపిసోడ్ చివర్లో ఆమె పాడే ఒక్క పాట... వేలాదిమంది కళ్లు చెమర్చేలా చేస్తుంది. ఆ ప్రోగ్రామ్‌తో ఎంతోమందికి అభిమాన గాయనిగా మారిన సోనా మనసులోని మాటలు... మీరు క్లాసికల్ సింగరా? అవును. కానీ స్టేజీల మీద ప్రదర్శనలివ్వడానికే నా టాలెంట్‌ని పరిమితం చేయదలచుకోలేదు. ఆల్బమ్స్ చేశాను. సినిమాల్లో పాడాను. కాన్సర్ట్స్ ఇచ్చాను. అడ్వర్టయిజ్మెంట్లకి కూడా స్వరమిచ్చాను. పాటంటే ఎందుకంత ప్రేమ? తెలియదు. కటక్‌లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే చదువులోనూ వెనకబడలేదు. బీటెక్ పూర్తి చేసి, ఎంబీయే కూడా చేశాను. ప్యారచూట్, మెడికర్ లాంటి ఉత్పత్తులకు బ్రాండ్ మేనేజర్‌గా పని చేశాను. అయితే ఏ దారిలో సాగినా నా గమ్యం సంగీతమే అనిపించి ఇటువైపు వచ్చేశాను. జింగిల్స్‌తో ప్రారంభించాను. తర్వాత సోనీ కంపెనీ సహకారంతో ‘సోనా’ అనే ఆల్బమ్ రిలీజ్ చేశాను. ఢిల్లీ బెల్లీ, ఐ హేట్ లవ్‌స్టోరీస్, తలాష్ వంటి సినిమాలకు పాడాను. కానీ మీరంటే ఏంటో ‘సత్యమేవ జయతే’తోనే తెలిసింది...? అవును. అసలా కార్యక్రమమే ఎంతో గొప్ప ఆలోచనతో చేస్తున్నది. సమాజంలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో ఆమిర్‌ఖాన్ దాన్ని ప్రారంభించారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఆ కాన్సెప్ట్‌తోనే ఓ పాట పెట్టాలనుకున్నారు. అది పాడే చాన్స్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ‘ముఝేకా బేచేగా రూపయా’ పాటయితే నన్ను స్టార్‌ని చేసేసింది. సింగర్‌గా మీకున్న బలం ఏమిటి? ఫీలై పాడటం. పాటలో లీనమవడం వల్లే సత్యమేవ జయతే పాటలతో కదిలించగలిగాను. నా ఇంకో బలం... నా భర్త రామ్. తను కంపోజర్. మాకు ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ఉంది. తన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. -
ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, చెన్నై:ప్రియురాలు తనకు దక్కడం లేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన పైశాచికత్వాన్ని ప్రియురాలి కుటుంబంపై ప్రదర్శించాడు. ఆమె తల్లిదండ్రులను, అవ్వను కిరాతకంగా కడతేర్చాడు. ప్రియురాలిని సైతం వదిలిపెట్ట లేదు. తీవ్రంగా గాయపడిన యువతి కూడలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం అర్ధరాత్రి నీలగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. నీలగిరి జిల్లా కూడలూరు సమీపంలోని ఓవెలి భారతీ నగర్‌కు చెందిన జాన్, గిరిజ దంపతుల కుమార్తె సోనా(24). మూడేళ్ల క్రితం సోనా కేరళ రాష్ర్టం మల్లప్పురంలోని ఓ కేటరింగ్ కళాశాలలో చదువుకుంది. అదే కళాశాలలో రాష్ట్రంలోని వైనాడైకు చెందిన జోనియల్ కుమారుడు లెనిన్(27) కూడా చదువుకున్నాడు. ఇద్దరు చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. కలసి మెలిసి తిరిగారు. చదువులు పూర్తయ్యాక కొచ్చిలోని ఓ హోటల్లో ఇద్దరు కలసి పనిచేశారు. ఈ సమయంలో ఏమి జరిగిందో ఏమోగానీ, కొన్నాళ్లకు లెనిన్తో సోనాకు విబేధాలు తలెత్తాయి. దీంతో తన స్వగ్రామం ఓవెలికి ఆమె తిరిగి వచ్చేంసింది. లెనిన్తో సంబంధాలు తెగ తెంపులు చేసుకునే ప్రయత్నం చేసింది. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఉద్యోగం లభించడంతో సోనా మూడు నెలల క్రితం నీలగిరి నుంచి వెళ్లి పోయింది. వివాహ ఏర్పాట్లు:తనకు సోనా దూరం అవుతుండడంతో తీవ్ర మానసిక వేదనకు లెనిన్ లోనయ్యాడు. ఆమె కోసం పలు మార్లు ఓవెలికి వచ్చి వెళ్లినట్టు సమాచారం. పదిహేను రోజుల క్రితం దుబాయ్ నుంచి ఓవెలికి సోనా వచ్చింది. తమ కుమార్తెకు జోషప్ అనే వ్యక్తితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం నిశ్చితార్థం సైతం జరిగినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న లెనిన్ కోపోద్రిక్తుడయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓవెలికి తన మిత్రులతో కలసి చేరుకున్నాడు. అక్కడి ఓ హోటల్లో బస చేశాడు. కిరాతకం: రాత్రి తన మిత్రులతో కలసి సోనా ఇంటికి వద్దకు వెళ్లాడు. మిత్రులను కూత వేటు దూరంలో వదలి పెట్టి వెనుక దారి గుండా లోనికి వెళ్లిన లెనిన్ అక్కడున్న సోనా తల్లి గిరిజ , అవ్వ అమ్ములుతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తాను సోనాను ప్రేమిస్తున్నానని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. తమ కుమార్తెకు నిశ్చితార్థం సైతం జరిగి పోయిందని వారు నచ్చచెప్పినా లెనిన్ పట్టించుకోలేదు. సోనాను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన సోనా తండ్రి జాన్ లెనిన్‌ను వారించాడు. మరింత కోపోద్రిక్తుడైన లెనిన్ ఆ ఇంటి బయట ఉన్న గడ్డ పారను చే త బట్టి వీరంగం సృష్టించారు. గిరిజ, అమ్ము, జాన్ తలలను పగల కొట్టాడు. అడ్డొచ్చిన సోనా మీద దాడి చేశాడు. దీంతో సంఘటనా స్థలంలో నే గిరిజ, అమ్ములు మృతి చెందారు. రక్తగాయాలతో సోనా, జాన్‌లు పెడుతున్న కేకలు విన్న ఇరుగు పొరు గు వారు పరుగులు తీశారు. పారిపోతున్న లెనిన్‌ను, అతడి మిత్రుల్ని పట్టుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న జాన్, సోనాలను కూడలూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక జాన్ మృతిచెం దగా, సోనా ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. కలకలం: ప్రేమోన్మాది దాడి సమాచారం ఉదయాన్న నీలగిరి జిల్లాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఆ జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్, కలెక్టర్ శంకర్, ఎంపీ గోపాలకృష్ణన్, తాడ్కో అధ్యక్షుడు కలై సెల్వన్‌లు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనాను పరామర్శించారు. అయితే, ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండడంతో, మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి డాక్టర్లకు సూచించారు. భారతీ నగర్ వాసులకు చిక్కిన లెనిన్, అతడి మిత్రులను న్యూ ఒవెన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమోన్మాది లెనిన్‌ను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.