ఎవరైనా అడిగితే ఓకే అంటా!
నా జీవిత కథను తెరకెక్కించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారని సంచలన తార సోనా వ్యాఖ్యానించారు. జీవితంలో పలు ఎదురు దెబ్బలు తిన్న నటి సోనా బహుశా ఆ అనుభవాలే ఆమెకు పాఠాలు నేర్పాయేమో. సోనా చాలా బోల్డ్‌గా మాట్లాడుతారు. శృంగారతారగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో పలు రకాల పాత్రలకు భాగస్వామ్యం వహించారు. అందులోనూ కొన్ని చేదు అనుభవాలను చవి చూసిన సోనా తన జీవిత కథను తానే తెరపైకి ఎక్కిస్తానని వెల్లడించారు. దీంతో కొందరికి వెన్నులో వణుకు పుట్టిందనే ప్రచారం కూడా జరిగింది.
ఈ సందర్భంగా మీ జీవిత కథను రాస్తున్నట్లు వెల్లడించారు. అది ఎంత వరకు వచ్చింది అన్న ప్రశ్నకు సోనా బదులిస్తూ నా జీవిత కథ రాయడం పూర్తి అయి ఏడాది దాటింది. ఆ పుస్తకాన్ని విడుదల చేయడం కోసం వేచి ఉన్నాను. ఇందులో పలు సంచలన అంశాలు చోటు చేసుకోవడంతో దీన్ని చిత్రంగా రూపొందించడానికి ఇద్దరు మలయాళ నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే నా జీవిత చరిత్రను చిత్రంగా మలయాళంలో రూపొందించాలనుకోవడం లేదన్నారు.
తమిళ చిత్రంగా :నేను నివసిస్తోంది తమిళనాడులో. తొలిసారిగా నటించింది పూ వెల్లాం ఉన్ వాసం అనే తమిళ చిత్రంలోనే. రెండు మూడు సార్లు కింద పడి లేసిన నటిని. అప్పుడు నన్ను ఆదుకుంది తమిళ సినిమాలే. నేనీ స్థాయిలో ఉండడానికి కారణం తమిళ సినీ అభిమానులే. అందువలన నా జీవిత కథతో చిత్రం చేయాలని తమిళ నిర్మాత లెవరైనా అడిగితే వెంటనే అంగీకరిస్తానన్న సోనాతో ఇంతకు ముందు పబ్‌లు, పార్టీలు అంటూ సంచలనం సృష్టించే మీరు ఈ మధ్య సెలైంట్ అయినట్టున్నారే? అన్న ప్రశ్నకు కొన్ని వారాలుగా పార్టీలకు దూరంగానే ఉంటున్నానన్నారు. నటిగా ఏమైనా సాధించారనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు నేను చిత్ర రంగ ప్రవేశం చేసి 15 ఏళ్లు అయ్యింది.రజనీ, కమల్, విజయ్, అజిత్, తెలుగులో చిరంజీవి, జూనియర్ ఎన్‌టీఆర్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి ప్రముఖ నటులందరితోను నటించాను. ఇది ఒక విజయమే అన్నారు.
నటిగా 15 ఏళ్లు పూర్తి అయిన ఆ వయసు మీ రూపంపై పడకపోవడానికి కారణం ఏమిటని భావిస్తున్నారన్న ప్రశ్నకు సంతోషంగా ఉండడమే. ఆ మధ్య కొందరు నన్ను మోసం చేసినప్పుడు కాస్త బాధపడిన మాట నిజమే. ఇప్పుడు అదంతా మరచి మళ్లీ ఆనందానికి స్వాగతం పలికాను. మరో విషయం ఏమిటంటే 16 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్‌గా తయారయ్యాను. ఎప్పుడూ వ్యాయాయమే గెలుస్తుందనడానికి నేనే ఒక ఉదాహరణ అంటున్నారు సంచలన నటి సోనా.