ఇండియన్ సినిమా గర్వించే దర్శకుల్లో ఒకరైన దర్శకుడు తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. రొమాన్స్ జానర్ సినిమాల్లో ఈ సినిమాది ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం. తమిళంలో తెరకెక్కిన
ఈ సినిమాను తెలుగులో డబ్ చేశారు. తెలుగులో ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?
కార్తీక్ ఆమెను మళ్లీ చూశాడు. ఆరోజు ఒక పెళ్లిలో చూసినప్పట్నుంచీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడతను. ఆమె మళ్లీ కనిపించదన్న ఆలోచనే అతనికి ఎలాగో ఉండింది ఇన్నాళ్లూ. ఇప్పుడామె మళ్లీ కనిపించింది. కార్తీక్ ఉన్న లోకల్ ట్రైన్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళుతోన్న ట్రైన్‌లో ఆమె కనిపించింది. ఆమె కార్తీక్‌నే చూస్తోంది. కార్తీక్ ఆమెనుండి చూపు తిప్పుకోలేకపోయాడు. కొన్ని క్షణాల్లో ఆ రైళ్లు వాటి వాటి దిశల్లో ముందుకెళ్లిపోయాయి. ఇద్దరూ దూరమైపోయారు. కార్తీక్ ఫ్రెండ్స్‌తో మీటింగ్ పెట్టాడు. ‘‘ఆమె ఎక్కడుంటుందో ఎలాగైనా కనిపెట్టి తీరాలి!’’ అన్నాడు వాళ్లతో. ఆమె మెడిసిన్ స్టూడెంట్ అన్న విషయం, లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుందన్న విషయం తప్ప వాళ్లకు ఇంకేం తెలీదు. కానీ కనిపెట్టారు. ఆ వెంటనే కార్తీక్ ఆమె వెంటపడడాన్ని డైలీ రొటీన్‌గా మార్చేసుకున్నాడు. ఆమె రైలెక్కే ప్లేస్, ఇల్లు.. అన్నీ రౌండ్లు వేయడం మొదలుపెట్టాడు. ఆమెకూ ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. ఒకవిధంగా కార్తీక్ అలా వెంటపడ్డాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది కూడా! ఒకరోజు ఆమె రైల్లో కాలేజీకి వెళుతోంటే, ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు కార్తీక్. ఈ ఐదారు రోజుల్లో అతనామెకు అంత దగ్గరగా వెళ్లడం అదే మొదటిసారి. ఆమె చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కొని అందులో పేరు చూశాడు. ‘‘శాంతి..!’’ అన్నాడు నవ్వుతూ. శాంతి ఏం మాట్లాడలేదు.
‘‘నువ్వంటే నాకిష్టం లేదు. నీమీద ఆశ పడటం లేదు. నువ్వు అందగత్తెవు అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు..’’ రైలు కొంచెం కొంచెం కదులుతూ ఉంటే, చెప్పాలనుకున్నదంతా చెప్పేసి అక్కణ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు కార్తీక్. రైలు కూడా వేగమందుకొని ప్లాట్‌ఫామ్ దాటేసింది. శాంతి సిగ్గుపడుతూ నవ్వింది. తర్వాతిరోజు శాంతి చదువుతున్న కాలేజీకి వెళ్లాడు కార్తీక్. ‘ఇక్కడ కూడా వచ్చిపడ్డాడు..’ అనుకుంటూ శాంతి అతనికి దగ్గరగా వెళ్లింది. అతణ్ని సమీపిస్తున్నా కొద్దీ అంతకంతకూ పెరిగిపోతోన్న సిగ్గుతో ‘‘పేరేంటీ?’’ అనడిగింది. ‘‘కార్తీక్..’’ శాంతి కార్తీక్ వైపు నవ్వుతూ చూసి, ‘‘కార్తీక్! నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్‌లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిలవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్లే బుద్ధిలేకుండా అన్నీ వదిలేసి ఇలా అమ్మాయిల వెంటపడుతుంటారు..’’ అని తిరిగి వెళ్లిపోతూంటే, ‘‘ఏయ్!’’ అన్నాడు కార్తీక్. శాంతి చిన్నగా నవ్వింది, ఆ పిలుపుకి వెనక్కి తిరుగుతూ. ‘‘హేయ్! తను నన్ను చూసి నవ్విందీ..’’ అంటూ గట్టిగా అరుస్తూ ఆ రోజంతా శాంతి పేరే తల్చుకుంటూ కూర్చున్నాడు కార్తీక్. శాంతి ఫోన్ నంబర్ కనుక్కున్నాడు కార్తీక్. ఫోన్ చేశాడు. శాంతి ఫోన్ ఎత్తింది. ‘‘హలో ఎవరూ?’’ ‘‘హలో!’’ అన్నాడు కార్తీక్. ‘‘ఏయ్! నంబర్ ఎలా తెలిసిందీ?’’ ‘‘నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను.’’ ‘‘పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికొచ్చింది. ఫర్వాలేదు.. ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం?’’ ‘‘ఆ! రేపు మా ఇంట్లో ఫంక్షన్.’’ ‘‘అయితే?’’ ‘‘అందుకని నువ్వు రావాలి..’’ ‘‘నేనా? ఎందుకు?’’
‘‘ఇలా చూడూ! నేన్నిన్ను బీచ్‌కు రమ్మనలేదు. సినిమాకు రమ్మనలేదు. పార్క్‌కు రమ్మనలేదు. ఇంటికేగా రమ్మందీ..’’ ‘‘నేనెందుకు రావడం?’’ ‘‘నువ్విక్కడికి రాకపోతే, నేనే అక్కడికి వస్తాను. చక్కగా చీర కట్టుకొని రా..’’ తను చెప్పాలనుకున్నదంతా చెప్తూ, అడ్రెస్ కూడా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు కార్తీక్. శాంతి చెప్తున్నదేదీ అతను వినిపించుకోలేదు. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్. ‘నేనేందుకు రావాలి?’ అన్న శాంతి కూడా ఆ ఫంక్షన్‌కు వచ్చింది. ఇల్లంతా కార్తీక్ చుట్టాలు. ‘‘ఎవర్రా ఆ అమ్మాయి?’’ కార్తీక్‌ను అడిగింది వాళ్లమ్మ. ‘‘తనే నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి..’’ అన్నాడు కార్తీక్. ఆ మాట కార్తీక్ వాళ్లమ్మతో పాటు అక్కడున్న ఇంకో ఇద్దరు విన్నారు. వెంటనే ‘ఆ అమ్మాయినే అంట.. కార్తీక్ పెళ్లి చేసుకునేది.’ ఇల్లంతా పాకింది ఈ మాట. ఫంక్షన్ అయిపోయింది. శాంతి తిరిగి రైల్లో ఇంటికి వెళ్లిపోతోంది. కార్తీక్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ‘‘అసలు నువ్వెందుకలా అన్నావ్?’’ అడిగింది శాంతి. ‘‘నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అన్లేదే? నేను ఆశపడుతున్నా అన్నాను. అది నిజమేగా!’’ ‘‘నన్నొక మాట అడగొచ్చుగా?’’ ‘‘సరే! ఇప్పుడడుగుతా..’’ ‘‘వద్దు..’’ ‘‘ఏయ్! అడక్కుండా చెప్తే కోప్పడతావ్. అడుగుతానంటే వద్దంటావ్?’’ ‘‘ఏమిటిది పెళ్లీ గిల్లీ అనీ..’’ కార్తీక్ శాంతి చెయ్యి పట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ‘‘ఏయ్! చెప్పనా..?’’ ‘‘ఏంటి?’’ ‘‘ఐలవ్యూ..’’ ‘‘అంటే..? దానర్థమేమిటీ?’’ ‘‘ఐలవ్యూ అంటే ఐలవ్యూ..’’ ‘‘ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా?’’ ‘‘తెలీదు. కానీ ఐ లవ్యూ..’’ కార్తీక్ శాంతికి ఈమాట చెప్పిన కొన్ని రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఆశపడి.
Comments
Please login to add a commentAdd a comment