‘శబరి’ మూవీ రివ్యూ
టైటిల్: శబరినటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బేబీ నివేక్ష తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్రచన-దర్శకత్వం: అనిల్ కాట్జ్సంగీతం: గోపి సుందర్సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిఎడిటర్: ధర్మేంద్ర కాకరాల కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది. అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్‌తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. శబరిలోనూ ఆ రెండు ఉన్నాయి. కానీ డైరెక్టర్ కథను డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టు అల్లుకున్న కథ.. రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా అకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి చేసే పొరాటం ఆకట్టుకుంటుంది.సిటీలో ఓ మెంటల్ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని వచ్చి ఇద్దరిని చంపి, సంజన కోసం వెతికె సీన్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత కథను రెండేళ్ల ముందుకు తీసుకెళ్లాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్‌తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటెల్డ్‌గా చూపించడంతో కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ సూర్య గురించి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ కాస్త థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. లాజిక్స్‌పై దృష్టిపెట్టి స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్‌గా గణేష్ వెంకట్రామన్ చక్కగా నటించాడు. లాయర్‌గా శశాంక్, పోలీసు అధికారి శంకర్‌గా మధుసూధన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. కానీ అవి గుర్తించుకునేలా ఉండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. OTT లొ చూడదగిన చిత్రంసన్ నెక్స్ట్ ఓటీటీలో శబరి సినిమా ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి అనుచిత సన్నివేశాలు లేకపోవడం, మరియు ప్రధానంగా తల్లి ప్రేమ, పోరాటం వంటి భావోద్వేగాలు ఉండడం, దీన్ని ఫ్యామిలీతో కలసి చూసేందుకు అనుకూలంగా చేస్తుంది. సస్పెన్స్-థ్రిల్లర్ అయినప్పటికీ, ఈ చిత్రం పరోక్షంగా కుటుంబ విలువలను కూడా ప్రతిబింబిస్తుంది, అందువల్ల కుటుంబం మొత్తం ఓటీటీలో ఈ సినిమాను కలిసి చూడొచ్చు అంతే కాకుండా వరలక్ష్మి నటన అందరిని ఆకట్టుకుంటుంది.దసరా పండుగకు ఇంటిల్లిపాది కలసి చూసే సినిమాల లిస్ట్ లో శబరి ముందు ఉంటుంది.