‘విలువ’ తగ్గదు
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ ఆట నుంచి తప్పుకున్నా కార్పొరేట్ ప్రపంచంలో తన విలువ ఏ మాత్రం తగ్గదు. ప్రస్తుతం తనతో ప్రచారం చేయించుకుంటున్న సంస్థలన్నీ సచిన్‌ను కొనసాగిస్తామనే చెబుతున్నాయి. ధోని, కోహ్లి, రోహిత్‌లాంటి యువ క్రికెటర్ల ముందు సచిన్ బ్రాండ్ విలువ తగ్గుతుందా? అనే చర్చ మొదలైన నేపథ్యంలో కార్పొరేట్ ప్రపంచం మాత్రం... ‘సచిన్‌కు మరెవరూ సాటిరారు’ అనే చెబుతోంది. ‘సచిన్ క్రికెట్ ఆడినా, ఆడకపోయినా మా సంబంధం తెగిపోదు.
మా బ్రాండ్‌కు సచిన్ జీవితకాలం అంబాసిడర్. తనతో మాకు ప్రత్యేకమైన బంధం ఉంది’ అని అడిడాస్ ఇండియా డెరైక్టర్ తుషార్ చెప్పారు. కోకాకోలా, ఫ్యూచర్ గ్రూప్, తోషిబా, స్టార్ ఇండియా సంస్థలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. సచిన్‌కు ప్రస్తుతం ఉన్నంత డిమాండ్ భవిష్యత్‌లో ఉండకపోవచ్చు. క్రమంగా తన ఎండార్స్మెంట్స్ తగ్గిపోతాయి. కానీ చాలామంది మాజీ క్రికెటర్ల మాదిరిగా కనుమరుగు అయ్యే అవకాశం మాత్రం లేదు. సచిన్ రిటైరైతే తన ఎండార్స్మెంట్ల రేటు తగ్గుతుందని, అప్పుడు తాము మాస్టర్‌ను సంప్రదించాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. పలు బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ రకమైన ఆలోచనతో ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.