‘బెజవాడ’కు పెద్దపీట వేస్తారా!?
నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చే నెల ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో విజయవాడ డివిజన్‌పై మన నేతలు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని శ్రీనివాస్ (విజయవాడ) ఆ పార్టీకి చెందినవారే కావడంతో రైల్వే మంత్రి సదానందగౌడ్‌ను ఒప్పించి సాధ్యమైనన్ని వరాలు పొందాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్నివిధాల విజయవాడ కీలకం కానుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికే విజయవాడ డివిజన్లో రైల్ ట్రాఫిక్ అధికంగా ఉంది. లభించే ఆదాయం కూడా బాగానే ఉంటోంది. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటుచేస్తే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య అనూహ్యంగా పెరగవచ్చు. రైళ్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ డివిజన్‌కు తగినన్ని నిధులు రాబట్టకపోతే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయే అవకాశం ఉందని రైల్వే అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఎంపీలు దృష్టి పెట్టాల్సిన అంశాలివీ..
విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సుమారుగా రూ.2,000 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఈ బడ్జెట్లో కనీసం రూ.500 కోట్లు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది.
2015లో గోదావరి పుష్కరాలు, 2016లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. వీటి కోసం ప్రత్యేక రైళ్లు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ఏడాది బడ్జెట్లోనే కనీసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించాలి.
నిధులు లేనందున విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ ప్రాజెక్టు(ఆర్ఆర్ఎల్) అమలులో జాప్యం జరుగుతోంది. దీనివల్ల నగరం వెలుపలకు వచ్చిన రైళ్లు ప్లాట్‌ఫారాలపై రావడానికి కనీసం అర్ధగంట పడుతోంది. దీనికి కనీసం రూ.50 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒకటి నుంచి ఐదు ప్లాట్‌ఫారాలకు వచ్చే రైళ్ల జాప్యాన్ని తగ్గించవచ్చు.
2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న మెట్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఎక్కేందుకు, దిగేందుకు ఒకే మెట్ల మార్గం ఉండడం వల్ల ప్రయాణికులు తోసుకోవాల్సివస్తోంది. అందువల్ల పక్కనే మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి.
మచిలీపట్నంలో పోర్టును అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అంతకంటే ముందు విజయవాడ- మచిలీపట్నం రైల్వే లైనును అభివృద్ధి చేయాల్సిన అసరం ఎంతైనా ఉంది. లేకపోతే సరుకు రవాణాకు ఇబ్బంది అవుతుంది.
విజయవాడ, గుంటూరు, తెనాలి స్టేషన్లను ‘ఏ’ క్లాస్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలి.
విజయవాడ కేంద్రంగా కొత్త జోన్‌ను సాధించాలి.
విజయవాడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లును రాబట్టాలి. జోథపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఓక్ తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు నడిపేందుకు కృషిచేయాలి.
ఎలక్ట్రికల్ లోకో వర్క్‌షాపును ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైంది. దీన్ని ఈ ఐదేళ్లలోనైనా సాధించాలి.
బందరు ఎంపీ నారాయణరావు ప్రధాన డిమాండ్లు
మచిలీపట్నం-నర్సపూర్‌ల రూట్లో ప్రతిరోజు రైలు
మచిలీపట్నం నుంచి చెన్నై, యశ్వంత్‌పూర్, ముంబాయిలకు రైళ్ల ఏర్పాటు
మచిలీపట్నం, గుడివాడ రైల్వేస్టేషన్లను అప్‌గ్రేడేషన్ చేసి ఆధునిక రైల్వేస్టేషన్లుగా తీర్చిదిద్దాలి
విజయవాడ- గుడివాడ రైల్వే మార్గం ఇప్పటికే డబ్లింగ్ జరుగుతోంది.రాబోయే రోజుల్లో గుడివాడ-మచిలీపట్నం రైల్వేమార్గాన్ని డబ్లింగ్ విద్యుదీకరణ చేయాలి.
గుడివాడ,పెడనలలో రైల్వే ట్రాక్స్‌పై ఫ్లైఓవర్ నిర్మాణాలకు నిధులు మంజూరు
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అయ్యే అవకాశాలు ఉన్నందున విజయవాడ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటుచేయాలి.
విజయవాడ-కర్నూలు రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలి.
విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది స్టాఫ్‌వేర్ ఇంజినీర్లు బెంగళూరు వెళ్లుతున్నందున విజయవాడ- బెంగళూరుకు ప్రతిరోజు రైలు ఏర్పాటు చేయాలి.
ముంబాయి, కోల్‌కతా, షిర్డీ, ఢిల్లీ నగరాలకు విజయవాడ నుంచి ప్రారంభమయ్యేటట్లు రైళ్లు ఏర్పాటు చేయాలి. పైనుంచి వచ్చే రైళ్లలో విజయవాడకు కేటాయిస్తున్న కోటా ఏమాత్రం సరిపోనందున ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లు ఏర్పాటు అవసరం ఉంది.
విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో రైలు ప్రారంభించాలి. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో వాటిని మరింత పెంచవచ్చు.