సాదత్ బాగోతంపై లోతుగా విచారణ
కుత్బుల్లాపూర్: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్(ఎస్ఏ) పేరుతో సామాన్యులతో పాటు పోలీసులను కూడా మోసం చేసిన సాదత్ అహ్మద్ బాగోతంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. సాదత్ ఈ సంస్థతో పాటు నేషనల్ సెక్యూరిటీ యాంటీ కరప్షన్ క్రైం ప్రివెంటివ్ బ్రిగ్రేడ్.. హ్యూమన్ రైట్స్ వాయిస్ సంస్థలకు కూడా చైర్మన్, ఎడిటర్‌గా పని చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రైవేట్ దందా కొనసాగిస్తున్నట్టు అందిన సమాచారంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఇంటర్నేషల్ హ్యూమన్ రైట్స్‌కు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ దేశాల్లో బ్రాంచ్‌లు ఉండాలి. కానీ సాదత్ నెలకొల్పిన సంస్థలకు కేవలం కుత్బుల్లాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లో మాత్రమే బ్రాంచ్లున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్‌లో పని చేసిన కాలంలో వివాదస్పదుడిగా మారగా రెండేళ్ల క్రితం సాదత్ అహ్మద్‌ను అంతర్జాతీయ ైచైర్మన్ నేమ్సింగ్ ప్రేమ్ సస్పెండ్ చేశారు. అనంతరం తన పేరుతోనే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్(ఎస్ఏ) ఏర్పాటు చేసి అది.. ఇది ఒకటేనని బిల్డప్ ఇస్తూ తన దందాను కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇతని దందాలకు కౌన్సిలర్ సయ్యద్ గౌస్ పాషా కూడా సాయం చేశాడు.
ప్రైవేట్ సైన్యాన్ని పెంచుకుంటూ....
కుత్బుల్లాపూర్‌లో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని డాన్ అవతారం ఎత్తిన సాదత్ అహ్మద్ జైలు ఊచలు లెక్కపెట్టడంపై స్థానికుల్లో చర్చాంశనీయంగా మారింది. సాదత్ పేరు చెప్తే అధికారుల్లో హడల్.. సామాన్యుల్లో దడ. ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిపై తన అనుచరులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, ఆపై కేసు నమోదు.. ఇక సెటిల్మెంట్లే ఆలస్యం అన్నట్లుగా రెండేళ్లుగా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతూ వచ్చింది. సాదత్ ఉచ్చులో పోలీసు అధికారులతో పాటు వాటర్ వర్క్స్, మున్సిపల్ విభాగంలో పని చేసే అధికారులు ఏసీబీ ఉచ్చులో చిక్కి బలైపోయిన వారు ఎందరో ఉన్నారు. డబ్బులు తీసుకోకున్న ఇచ్చే ఫిర్యాదు పత్రాలకు కలర్ పూసి అధికారులను బలి పశువులను చేశారన్న ఆరోపణలు ఉన్నాయి
డబ్బులకు పోస్టుల విక్రయం...
సాదత్ అహ్మద్ ఏర్పాటు చేసిన సంస్థలో పని చేస్తున్నవారిలో చాలా మంది రూ. లక్షలు చెల్లించి పోసి మరీ పదవులు పొందారు. ఇతని బాగోతం బయట పడటంతో అందరూ జారుకున్నారు. పట్టణ, జిల్లా, రాష్ట్ర పోస్టుల్లో పదవులు పొందిన వారికి నోటిఫికేషన్ పత్రంపై సంతకాలు చేయించి ఫొటోలు తీసి సోషల్ మిడియాలో పెట్టి బిల్డప్ ఇచ్చిన విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మాజీ కౌన్సిలర్ కీలకపాత్ర...
వివాదాస్పదుడిగా ముద్రపడ్డ మాజీ కౌన్సిలర్ సయ్యద్ గౌస్ పాషా కైసర్‌నగర్ భూవివాదంలో విచారణకు వెళ్లిన ఎమ్మార్వోపై దాడి చేశాడు. దీంతో పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఈ ఘటన జరగకముందే కుక్కను తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చగా అప్పట్లో పోలీసులు మిస్ ఫైర్ పేరుతో కేసు నమోదు చేసి గన్ లెసైన్స్ రద్దు చేశారు. ల్యాండ్ వివాదాల్లో తలదూర్చి పలు కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు. అయినా తన పద్ధతి మార్చుకోకుండా మానవ హక్కుల సంస్థ పేరుతో సాదత్ అహ్మద్ నడుపుతున్న గ్యాంగ్‌లో చేరి భూ దందాలో కీలక పాత్ర వహిస్తూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.