ఘనంగా రాజీవ్ సద్భావన యాత్ర
హైదరాబాద్ : మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు చార్మినార్ కట్టడం నుంచి సద్భావన యాత్ర చేపట్టి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని తెలంగాణ సీఎల్పీ నాయకులు కె.జానారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు-2014 ను ప్రముఖ కార్మిక నాయకుడు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించి హైదరాబాద్‌లో మతకలహాలు నెలకొనడంతో శాంతిని నెలకొల్పేందుకు రాజీవ్ ముందుకొచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోదండ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షులు దానం నాగేందర్ పాల్గొన్నారు.