రామాయణంలో కైకేయి లాగే..
రామాయణంలో కైకేయి తన కుమారుడికి పట్టం కట్టడం కోసం దశరథుడి పెద్ద కుమారుడైన శ్రీరాముడిని అడవులకు పంపుతుంది. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కూడా ఇంచుమించు అలాగే జరుగుతోంది. ములాయం సింగ్ యాదవ్‌కు రెండోభార్య సాధన ఉందన్న విషయం చాలా కాలం వరకు బయటపడకపోయినా.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆమె పేరు బాగానే వినిపించింది. ఆమే అఖిలేష్ యాదవ్‌పై చేతబడి చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. చేతబడి మాట ఎలా ఉన్నా.. తన కొడుకు ప్రతీక్ యాదవ్‌కు పట్టం కట్టాలన్నది ఆమె ఆశ. కానీ పెద్ద భార్య కొడుకైన అఖిలేష్ అయితే సమర్థుడన్నది ములాయం అభిప్రాయం. చిన్న వదిన సాధనకు మరిది శివపాల్ యాదవ్ మద్దతు కూడా ఉంది. ఈ పరిస్థితులన్నింటి మధ్య ములాయం నలిగిపోయారు.
2003లో ములాయం మొదటి భార్య మాలతీ యాదవ్ కన్నుమూశారు. అప్పటి నుంచి సాధన అధికారికంగా ములాయం భార్యగా చలామణి అయ్యారు. కానీ వీద్దరి మధ్య ఎప్పటినుంచో సంబంధం ఉంది. 1988లో వారిద్దరికీ పుట్టిన బిడ్డే ప్రతీక్ యాదవ్. వాస్తవానికి అతడికి రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా, తల్లి మాత్రం బాగా ప్రోత్సహించేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పార్టీలో కొంతమేరకు ముసలం మొదలైంది. ఎన్నికల తర్వాత ములాయం సింగ్ యాదవే సీఎం కావాలని సాధన, శివపాల్ కోరుకున్నారు. కానీ ములాయం మాత్రం.. తన రాజకీయ వారసుడిగా, యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్‌నే ప్రతిపాదించారు. అప్పట్లోనే కొందరు ఎమ్మెల్యేలను అఖిలేష్‌కు వ్యతిరేకంగా సాధన ఎగదోశారని తాజాగా సస్పెండైన ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ సింగ్ లాంటివాళ్లు చెబుతారు.
2012లో ఎన్నికలు ముగిసిన తర్వాత అడగడం వల్ల ప్రయోజనం కలగలేదని.. అందువల్ల ఈసారి ఎన్నికలకు ముందే చక్రం తిప్పాలని సాధన భావించారు. అందుకే శివపాల్ యాదవ్ తదితర మద్దతుదారులను ఎగదోసి పార్టీలో కల్లోలం సృష్టించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆటోమేటిగ్గా సీఎం అభ్యర్థి కాబోరని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే సీఎం అవుతారని ములాయం సింగ్ యాదవ్ ఎందుకు ప్రకటన చేశారో పార్టీలో అందరికీ తెలుసు. ఒకవేళ ములాయం తానే సీఎం కావాలనుకుంటే.. అడ్డుపడేవాళ్లు ఎవరూ ఉండరు. శివపాల్ పేరు ముందుకొస్తే మాత్రం.. అఖిలేష్ మద్దతుదారులు అడ్డు చెప్పొచ్చు. అందుకే ఇలా అని ఉంటారంటున్నారు.
పార్టీలోంచి కొన్నాళ్ల క్రితం బహిష్కరణకు గురై, మళ్లీ ఈమధ్యే వచ్చిన అమర్‌సింగ్ కూడా సాధనకు సన్నిహితంగా ఉంటారని, ఆయనే ఆమెకు రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తూ పావులు కదుపుతున్నారని అఖిలేష్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన అమర్‌సింగ్ సహచరులను మంత్రి పదవుల నుంచి తీసేయడం, ఆయనను కూడా పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేయడం లాంటివి చేశారు.
అమర్‌సింగ్ పార్టీలోకి తిరిగి రావడంలో కూడా సాధనా యాదవ్‌ది కీలకపాత్ర. ఆమె కొడుకు ప్రతీక్ యాదవ్‌కు రాజకీయాలంటే ఆసక్తి తక్కువ కావడంతో.. కోడలు అపర్ణా యాదవ్‌ను రంగంలోకి దింపారు. రాబోయే ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి అపర్ణా యాదవ్ పోటీ చేస్తారని అంటున్నారు. బహుశా అక్కడి నుంచి ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రీటా బహుగుణ జోసి పోటీచేసే అవకాశముంది.
ఈ విషయాలన్నీ తెలియగానే అఖిలేష్ యాదవ్ కూడా చురుగ్గా కదిలారు. సాధనకు, శివపాల్ యాదవ్‌కు సన్నిహితులైన గాయత్రి ప్రజాపతి, రాజ్‌కిశోర్ సింగ్‌లను తన కేబినెట్ నుంచి తొలగించారు. ఆ తర్వాతి రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను కూడా తప్పించారు. దీనిపై శివపాల్ యాదవ్ వెంటనే తన అన్న ములాయం వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడంతో ఆయన అఖిలేష్ నుంచి పార్టీ అధ్యక్ష పదవి ఊడబీకి తన తమ్ముడికి కట్టబెట్టారు. మొత్తానికి ఇలా సాధనా యాదవ్ పుత్రప్రేమ యూపీ అధికార పార్టీ కుటుంబంలో ముసలానికి దారితీసింది.