రాజకీయాల్లోకి రాను కానీ.. : ములాయం భార్య
లక్నో: తాను రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని, తన కొడుకు ప్రతీక్ యాదవ్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎస్పీ గెలవాలని, మరోసారి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాని చెప్పారు. ములాయంకు.. సాధన రెండో భార్య కాగా, అఖిలేష్ మొదటి భార్య కొడుకు. సాధన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కుటుంబ విషయాలు, అఖిలేష్‌తో అనుబంధం గురించి చెప్పారు.
ములాయంను, తనను అఖిలేష్ ఎంతో గౌరవిస్తారని సాధన చెప్పారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్‌లతో అఖిలేష్ విభేదించడాన్ని ప్రస్తావించగా.. అతన్ని ఎవరు తప్పుదోవ పట్టించారో తనకు తెలియదని, ఇందులో అతని తప్పు లేదని అన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే జనవరి 1 నుంచే అఖిలేష్‌తో చాలాసార్లు మాట్లాడానని చెప్పారు. కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధించాయన్నారు. ఏ అధికారి బదిలీ అయినా దాని వెనుక తన హస్తం ఉందని మాట్లాడుకున్నారని, తనపై వచ్చిన ఆరోపణలకు ఎవరినీ నిందించనని సాధన చెప్పారు. ములాయం కుటుంబంతా ఒక్కటేనని, ఆయన సమాజ్‌వాదీ పార్టీని స్థాపించి అధికారంలోకి తెచ్చారని, నేతాజీ పట్ల ఎవరూ అమర్యాదగా ప్రవర్తించే పరిస్థితి లేదని అన్నారు.