597 అడుగుల ఎత్తు... రూ.2,500 కోట్లు
అహ్మదాబాద్: గుజరాత్లో భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని (597 అడుగులు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేడు జరగనుంది. పటేల్ జయంతి రోజే ఈ కార్యక్రమం చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు. నర్మద డ్యామ్‌కు అభిముఖంగా, సాధు బెట్ అనే రాతి ద్వీపం వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా శిల్పం)’ ప్రపంచంలోనే ఎత్తై విగ్రహాల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ శిల్పం న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది.
విగ్రహం మొత్తం ఎత్తు 240 మీటర్లు కాగా, పునాది భాగం 59 మీటర్లు, శిల్పం 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తు ఉంటాయి.
వ్యవసాయంలో ఉపయోగించి, ప్రస్తుతం వాడుకలో లేని ఇనుప పరికరాలను విగ్రహ ఏర్పాటు కోసం పంపించాల్సిందిగా మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఇప్పటికే కోరారు. ఉక్కు, ఆర్సీసీలతో నిర్మించిన విగ్రహానికి కాంస్య పూత పూస్తారు.
బుర్జ్ ఖలీఫా నిర్మాణాన్ని పర్యవేక్షించిన టర్నర్ కన్స్ట్రక్షన్స్, మైకేల్ గ్రేవ్స్ అండ్ అసోసియేట్స్, మీన్‌హార్ట్ గ్రూప్‌లు ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారు. నిర్మాణం పూర్తి కావడానికి మొత్తం 56 నెలల సమయం పడుతుంది. అందులో నిర్మాణ ప్రణాళిక రూపకల్పనకే 15 నెలలు పడుతుంది.
విగ్రహం లోపల ఒకటి, బాల్కనీలో ఒకటి మొత్తం రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
శిల్పంతో పాటు ఒక స్మారక కేంద్రాన్ని, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను, హోటల్‌ను, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా ఖర్చు రూ.2500 కోట్లు.