సాధుకొండలో మళ్లీ అలజడి!
• మల్లయ్య భక్తుల్లో కలకలం రేపుతున్న మైనింగ్ పరిశీలన
• పరిశీలించింది అటవీ, మైనింగ్ శాఖల సిబ్బందేనని ఆందోళన
• ఖనిజాన్వేషణ అనుమతులు ఇంకా పెండింగ్లోనే ...
• వేలుపెడితే ఊరుకోమంటున్న ప్రజలు, భక్తులు
నియోజకవర్గ కేంద్రం తంబళ్లపల్లె సమీపంలోని సాధుకొండలో ఖనిజాన్వేషణ అలజడి మళ్లీ మొదలైంది. ఏడాది కిందట ఎదురైన ప్రజావ్యతిరేకత, అటవీశాఖ అనుమతి లేకపోవడంతో సర్వే ఆపేసిన మైనింగ్ సంస్థ మళ్లీ ఆ దిశగా ముందు కెళుతోందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా సాధుకొండలో జరిగిన పరిశీలన అందుకు కారణమవుతోంది.
బి.కొత్తకోట : సాధుకొండలో మైనింగ్, అటవీ శాఖల సిబ్బంది కలియతిరగడం స్థానికుల్లో కలవరం రేపింది. 2015 ఆగస్టు 8న కొండలో ఖనిజాన్వేషణ కోసం ప్రభుత్వం కర్ణాటకకు చెందిన జియో మైసూర్ మైనింగ్ సంస్థకు మూడేళ్లకు అనుమతి ఇచ్చింది. దీనిపై జీవో నంబర్ 63 జారీ చేసింది. తర్వాత అదే ఏడాది నవంబర్ 11న 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజాన్వేషణ నిర్వహించుకునేందుకు మైనింగ్ శాఖతో ఒప్పందం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రజలు ఉద్యమించారు. మల్లికార్జునస్వామి కొలువైన, 40 ఆలయాలు, గుహలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఈ కొండలో ఖనిజాన్వేషణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేగాక కొన్ని అనుమతులను ప్రభుత్వం నిలిపివేయడంతో సర్వే ఆగిపోరుుంది.
మళ్లీ బుధవారం మైనింగ్ సంస్థకు చెందిన సిబ్బంది, అటవీశాఖ సిబ్బందితో కలిసి సాధుకొండలోకి వెళ్లడం స్థానికుల్లో కలకలం రేపింది. వాహనాల్లో వచ్చిన వారు కొండలోకి వెళ్లి పరిశీలించారు. ఖనిజాన్వేషణకు అనుమతి ఉన్నా సాధుకొండలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. దీంతో అనుమతి కోరడంతో ఉన్నతాధికారులు అంగీకరించినా వారి వెంట సిబ్బందిని పంపారు. సంస్థకు చెందినవారు సాధుకొండలోని రాళ్లు లేదా మరే ఇతర వాటిని పరీక్షల నిమిత్తం శాంపిల్స్ తీసుకెళ్లకుండా ఉండేందుకు అటవీ సిబ్బందిని వెంట పంపారు. ఈ వ్యవహారం నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన కలిగించింది.
ప్రభుత్వం మైనింగ్ కోసం కొండను అప్పగించేందుకే ఈ ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధుకొండలో వంద మిలియన్ టన్నుల ఇనుము ఉందని అంటున్నారు. దీన్ని వెలికి తీసేందుకు కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడంలేదు. ఈ పరిస్థితుల్లో అన్వేషణ ప్రారంభమైతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏఒక్క చర్య తీసుకున్నా తీవ్ర స్థారుులో ఆందోళనలు, ఉద్యమాలు తప్పవని మల్లయ్య భక్తులు, ప్రజలు తేల్చి చెబుతున్నారు.
పెండింగ్లో అటవీ అనుమతులు
సాధుకొండలో ఖనిజాన్వేషణకు ఒప్పందం చేసుకున్న సంస్ఘ ఏడాదికోసారి సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలి. అరుుతే సర్వే జరగకపోవడంతో తొలి ఏడాది గడువు దగ్గరపడటంతో ఏదో ఒక నివేదిక ఇచ్చేందుకే బుధవారం సాధుకొండలో పరిశీలనలు నిర్వహించారని తెలుస్తోంది. పూర్తి స్థారుులో సర్వే చేపట్టాలంటే అటవీ అనుమతులు తీసుకోవాలి. దీనికి డీఎఫ్వోతో ఒప్పందం జరగాలి. అరుుతే అటవీ అనుమతుల కోసం సంస్థ ఇచ్చిన దరఖాస్తు ఇంకా పెండింగ్లోనే ఉంది.
అడవిలోకి అనుమతి లేదు
మల్లయ్యకొండల సముదాయంలోని సాధుకొండ సర్వే చేసుకునేందుకు ఏ సంస్థకూ అనుమతులు ఇంకా ఇవ్వలేదు. జియో మైసూర్ మైనింగ్ సంస్థ ఖనిజాన్వేషణ కోసం అడవిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. ఇది ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. దరఖాస్తుకు అనుమతి వచ్చే వరకు ఎరూ అడవిలో సర్వేలు నిర్వహించుకోవడం, అక్కడి రారుు, మట్టిని తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. దీనిపై చర్యలు తీసుకుంటాం. - చక్రపాణి, పశ్చిమ విభాగం డీఎఫ్వో, చిత్తూరు
వార్షిక నివేదిక అందలేదు
సాధుకొండలో ఖనిజాన్వేషణ కోసం జియో మైసూర్ మైనింగ్ సంస్థకు మూడేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. మూడేళ్లలో ఏడాదికోసారి గనుల శాఖకు నివేదిక సమర్పించాలి. అరుుతే ఇంకా ఏడాది కానందున నివేదిక అందాల్సి ఉంది.
- చంద్రమౌళి, భూగర్భగనుల శాఖ ఏడీ, పలమనేరు