డైరెక్టర్ కుమార్ సహానీ ఇకలేరు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కుమార్ సహాని (83) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. 1940 డిసెంబర్ 7న సింధ్‌లోని లర్కానాలో (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది) జన్మించారు కుమార్ సహాని. అయితే పాక్ విభజన తర్వాత ఆయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. ముంబై యూనివర్సిటీలో బీఏ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు కుమార్ సహాని. ఆ తర్వాత పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)లో డైరెక్షన్ కోర్స్ చేశారు.
ఆ తర్వాత విదేశాల్లో కొన్ని సినిమాలకు సహాయకునిగా పనిచేసిన తర్వాత దర్శకుడిగా మారారాయన. 1972లో ‘మాయా దర్పన్’, 1984లో ‘తరంగ్’, 1989లో ‘ఖయల్ గాధ’, 1990లో ‘కస్బా’ లాంటి హిట్ సినిమాలు తీశారు కుమార్ సహాని. ‘మాయా దర్పణ్’ మూవీ జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. కేవలం దర్శకుడిగానే కాకుండా మంచి విద్యావేత్తగా, రచయితగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారాయన. కుమార్ సహానీ మృతిపై పలువురు బాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.