సహారా 710 కోట్లు డిపాజిట్!
♦ జూలై 15లోపు రూ.552 కోట్ల చెక్కు
♦ నగదుగా మారాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్... సెబీ–సహారా అకౌంట్లో రూ.710.22 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే ఈ మొత్తంలో రూ.552.21 కోట్లకు సంబంధించిన చెక్కు జూలై 15వ తేదీలోపు తప్పనిసరిగా నగదుగా మారాలని (రియలైజేషన్) అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. నిజానికి ఇందుకు మరింత గడువు (జూలై 15 తరువాత) కావాలన్న రాయ్ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది.
అసల్లో బకాయి రూ.9,000 కోట్లు...
జూన్ 15 లోపు రూ.1,500 కోట్లు చెల్లిస్తాననీ, అటు తర్వాత సరిగ్గా నెల రోజులకు రూ.552.22 కోట్లు చెల్లిస్తాననీ రాయ్ ఇంతక్రితమే కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే జూన్ 15 నాటికి రూ.790.18 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.709.82 కోట్ల చెల్లింపులకు జూలై 4వ తేదీ వరకూ గడువు కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. తాజాగా డిపాజిట్ చేసిన మొత్తం తరువాత, చెల్లించాల్సిన అసలు రూ.24,000 కోట్లలో ఇంకా రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది.
యాంబీ వేలం దిశలో మరో ముందడుగు...
కాగా సహారా యాంబీ వ్యాలీలో ఆస్తుల వేలానికి సంబంధించి బాంబే హైకోర్ట్ అధికారిక లిక్విడేటర్ వినోద్‌శర్మ సిద్ధం చేసిన నియమ, నిబంధనావళికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసింది. చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేకపోతే యాంబీ వ్యాలీలో సహారా గ్రూప్‌కు ఉన్న రూ.34,000 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ఇంతక్రితమే ఆదేశించింది. మదుపరులకు రెండు సహారా సంస్థలు (సహారా ఇండియా రియల్టీ కార్పొరేషన్, సహారా హౌసింగ్) రూ.24,000కు పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో ఇరువురు కంపెనీల డైరెక్టర్లతోపాటు దాదాపు రెండేళ్లు జైలులో ఉన్న రాయ్, తల్లి మరణంతో గత ఏడాది మే 6న పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే సుప్రీం ఆదేశాలతో నిర్దేశిత సమయాల్లో చెల్లించాల్సిన మొత్తంలో కొద్దికొద్దిగా చెల్లిస్తూ, రాయ్ పెరోల్‌పై కొనసాగుతున్నారు.