ఆ విషయంలో మోదీకి సిగ్గెందుకు?
స్వతంత్ర విచారణకు ఎందుకు సిద్దపడటం లేదు?
'సహరా-బిర్లా' ముడుపుల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ తాజాగా రూటు మార్చారు. ఇంతకుముందు ఈ పత్రాల ప్రామాణికతను ప్రశ్నించిన ఆమె.. తాజాగా ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముడుపుల కేసులో స్వతంత్ర విచారణకు మోదీ ఎందుకు సిగ్గుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
నిజానికి 'సహరా డైరీల్లో' షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. దీనిపై విలేకరులు ప్రశ్నించడంతో ఈ పత్రాల ప్రామాణికతను ఆమె కొట్టిపారేశారు. మరోవైపు ఈ పత్రాల ఆధారంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సహరా, బిర్లా కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. యూపీ సీఎం అభ్యర్థిగా షీలాను కాంగ్రెస్ పార్టీ తొలగించే అవకాశముందని, ఆమె యూపీలో పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను కొట్టిపారేసిన షీలా.. తాజాగా సహరా, బిర్లా ముడుపుల వ్యవహారంలో ప్రధాని మోదీ స్వతంత్ర విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని ప్రశ్నించారు.