18 నెలల్లో 36 వేల కోట్లు చెల్లించాలి
♦ సహారాకు సుప్రీం సమయ నిర్దేశం
♦ తొలుత రూ.10,000 కోట్ల పైనే బెయిల్!
♦ తరువాత ప్రతి 2 నెలలకూ రూ.3,000 కోట్లు కట్టాలి
♦ మిగిలిన బ్యాలెన్స్ చివరి వాయిదాతో చెల్లించాలి...
♦ మూడు వాయిదాలు విఫలమైతే మళ్లీ జైలే!
న్యూఢిల్లీ : సహారా బకాయిల చెల్లింపులకు సుప్రీంకోర్టు నిర్థిష్ట కాలపరిమితులను విధించింది. నిబంధనలకు విరుద్ధంగా మదుపుదారుల నుంచి సమీకరించిన నిధులకు సంబంధించి 18 నెలల్లో తొమ్మిది విడతలుగా రూ.36,000 కోట్లు చెల్లించాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఓఎఫ్సీడీ (ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు) ద్వారా రెండు గ్రూప్ కంపెనీలు ఎస్ఐఆర్ఆసీఎల్, ఎస్హెచ్ఎఫ్సీఎల్లు 2007-08 మధ్య వసూలు చేసిన నిధులు మొత్తం వడ్డీతో సహా జమ కావాల్సిందేనని స్పష్టం చేసింది.
2012 ఆగస్టు 31న అత్యున్నత న్యాయస్థానం ఒక రూలింగ్ ఇస్తూ, రూ.24,000 కోట్లు 15 శాతం వడ్డీచొప్పున మూడు నెలల్లో చెల్లించాలని సహారాను ఆదేశించింది. ఆ మొత్తం వడ్డీతోసహా ఇప్పటికి తడిచిమోపడయ్యింది. ఈ కేసులో కోర్టు ఇంతక్రితం నిర్దేశించిన విధంగా రూ.5,000 కోట్ల నగదు, రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ... వెరసి మొత్తం రూ.10,000 కోట్లు చెల్లిస్తేనే... సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతారాయ్, మరో ఇరువురు డెరైక్టర్లు జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలవుతారని సైతం సుప్రీంకోర్టు బెంచ్ పునరుద్ఘాటించింది. ఈ మేరకు 2014 మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేసింది.
టైంఫ్రేమ్ ఇదీ...
జైలు నుంచి విడుదలైన తరువాత, బకాయిల తీర్చే క్రమంలో విడతల వారీగా.. ప్రతి 2 నెలలకూ రూ.3,000 కోట్లు చెల్లించాలి. మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని చివరి వాయిదాలో చెల్లించాలి. ఏ రెండు వాయిదాలూ వరుసగా చెల్లించకపోయినా... బెయిల్ కింద చెల్లించిన రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీనీ సెబీ క్యాష్ చేసుకుంటుంది. ఏ మూడు వాయిదాలు వరుసగా చెల్లించకపోయినా, మళ్లీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులే వీరిని అరెస్ట్ చేస్తారు.
రాయ్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితుల్లో అందుకు 15 రోజుల ముందే ఆయన పాస్‌పోర్ట్‌ను కోర్టు ముందు డిపాజిట్ చేయాలి. ఆయన దేశం విడిచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఎక్కడ ఉందీ ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలి. 15 రోజులకు ఒకసారి తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలి.
గ్యారంటీ ఫార్మేట్‌ను ఆమోదించినా...: కాగా బ్యాంక్ గ్యారంటీకి ఒక ఆర్థిక సంస్థ ముందుకువచ్చిందని, ఇందుకు అనుగుణంగా గ్యారంటీ ఫార్మేట్‌ను ఆమోదించాలని గత వాయిదా సందర్భంగా సహారా ఉన్నతన్యాయస్థానానికి ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీని ప్రకారం సమర్పించిన ఫార్మేట్‌ను సుప్రీంకోర్టు ఆమోదించింది. అయితే అప్పట్లో గ్యారంటీ ఇస్తామని ముందుకు వచ్చిన ఆర్థిక సంస్థ ఇప్పుడు ఈ విషయంలో వెనక్కు వెళ్లిందని తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి సహారా తరఫు న్యాయవాది కపిల్ సిబల్ విన్నవించారు. పరిస్థితులకు అనుగుణంగా ఆమోదం నిమిత్తం మరో ఫార్మేట్‌ను సమర్పిస్తామని కూడా కోర్టుకు తెలిపారు. దీనితో ఇప్పట్లో రాయ్ తీహార్ జైలు నుంచి వచ్చే అవకాశాలు కనుమరుగయ్యాయి.
సదుపాయాల పొడిగింపు...
కాగా బెయిల్ కోసం రూ.10,000 కోట్లు సమకూర్చుకునే క్రమంలో ఆస్తుల అమ్మకానికి సంబంధించి రాయ్ చర్చలకు జైలులో టెలిఫోన్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలను ఎనిమిది వారాలు సుప్రీంకోర్టు పొడిగించింది.