
సహారా గ్రూప్‌కు మరో ఎదురుదెబ్బ
సహారా ఏఎంసీ రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: సంక్షోభంలో ఉన్న సహారా గ్రూప్‌ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. పోర్ట్‌ఫోలియో మేనేజరుగా సహారా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌తో పాటు కొన్ని గ్రూప్ సంస్థల గత చరిత్ర, వ్యవహార శైలి .. సహారా ఏఎంసీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగించే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
దీంతో లెసైన్సు రెన్యువల్ కోసం సహారా ఏఎంసీ చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థకు దేశీ సెక్యూరిటీస్ మార్కెట్లో పోర్ట్‌ఫోలియో మేనేజరుగా కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు లేవంటూ 12 పేజీల ఆర్డరులో వ్యాఖ్యానించింది. సహారా ఏఎంసీ తన వ్యాపార కార్యకలాపాలను మరో పోర్ట్‌ఫోలియో మేనేజరుకైనా బదలాయించాలని లేదా ఇన్వెస్టర్లు తమ నిధులు, సెక్యూరిటీస్‌ను వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించాలని ఆదేశించింది.
సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 24,000 కోట్ల నిధులను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన కేసులో చైర్మన్ సుబ్రతా రాయ్ గతేడాది నుంచి జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. సహారా ఏఎంసీ లెసైన్సు విషయంలో సెబీ ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసులు ఎదుర్కొంటున్న రాయ్‌కి.. సహారా ఏఎంసీ ప్రమోటింగ్ సంస్థల్లో ఒకటైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో గణనీయంగా వాటాలు ఉన్నాయి. తద్వారా ఆయనతో పాటు ఇతర ప్రమోటింగ్ సంస్థలు కూడా సహారా ఏఎంసీ కార్యకలాపాలను ప్రభావితం చేసే అవకాశముందని సెబీ పేర్కొంది. గతేడాది డిసెంబర్ నాటికి కంపెనీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 147 కోట్లు.