న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కోఆపరేటివ్ సొసైటీల చిన్న డిపాజిటర్ల రిఫండ్ మొత్తాలపై గతంలో ఉన్న రూ.10,000 పరిమితిని ప్రభుత్వం రూ.50,000కు పెంచింది. సహకార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.
సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు సీఆర్‌సీఎస్ (సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్)–సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ.370 కోట్లను విడుదల చేసింది. రిఫండ్ మొత్తం పరిమితిని రూ. 50,000కి పెంచడంతో, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ. 1,000 కోట్ల చెల్లింపులు జరుగుతాయని అధికారి వెల్లడించారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చర్యలు
సహారా గ్రూప్ నాలుగు మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల వాస్తవ డిపాజిటర్లు క్లెయిమ్‌ల సమర్పణకు, డిపాజిట్ల వాపసుకు సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి సీఆర్‌సీఎస్–సహారా రిఫండ్ పోర్టల్ గత ఏడాది జూలై 18న ఏర్పాటయిన సంగతి తెలిసిందే.
వీటిలో స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హైదరాబాద్)సహా సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (లక్నో) సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ (భోపాల్), హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కోల్‌కతా) ఉన్నాయి.
2023 మార్చి 29 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2023 మే 19న సెబీ–సహారా రీఫండ్ ఖాతా నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కి రూ. 5,000 కోట్ల బదిలీ అయ్యాయి. డిజిటల్ రూపంలో డబ్బు పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment