ఫైనల్లో మోహిత్, సౌమ్య
సాక్షి, హైదరాబాద్: చాంపియన్షిప్ సిరీస్ అండర్–12, 14 బాలబాలికల టెన్నిస్ టోర్నమెంట్లో మోహిత్ సాయిచరణ్ రెడ్డి, సౌమ్య టైటిల్ పోరుకు అర్హత సాధించారు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో శుక్రవారం జరిగిన అండర్–12 బాలుర సెమీస్లో మోహిత్ 1–6, 6–3, 6–3తో సమీర్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, శ్రీశరణ్ 6–4, 6–2తో అర్నవ్ అన్షుమన్ రావు (మహారాష్ట్ర)ను ఓడించాడు. బాలికల సెమీస్ మ్యాచ్ల్లో సౌమ్య (తెలంగాణ) 7–5, 6–1తో జి. శివాని (తెలంగాణ)పై, ఐరా (మహారాష్ట్ర) 6–3, 6–2తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొంది ఫైనల్కు చేరుకున్నారు.
అండర్–14 బాలుర సెమీస్లో కార్తీక్ నీల్ 7–5, 3–6, 6–4తో మోహిత్ సాయిచరణ్పై, రోహన్ 6–0, 6–2తో ఉద్భవ్పై విజయం సాధించారు. బాలికల సెమీస్లో అపూర్వ 6–4, 6–4తో అభయ వేమూరిపై, ఐరా (మహారాష్ట్ర) 6–2, 6–0తో సౌమ్యపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. డబుల్స్ సెమీస్ మ్యాచ్ల్లో అపూర్వ–అభయ జంట 8–1తో సౌమ్య–నిరాలి జోడీపై, మలిష్క (తెలంగాణ)–జ్యోషిత (తమిళనాడు) జంట 8–4తో పుష్టి–హియా జితేశ్ (తెలంగాణ) జోడీపై గెలుపొందాయి.