ఊరు వెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్లో తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు గుల్లచేశారు. బాధితుడి వివరాలివీ... కాలనీకి చెందిన అంజయ్య, కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి పదిరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన రూ.40వేల నగదుతోపాటు రెండు తులాల బంగారం మూటగట్టుకున్నారు.
పోతూపోతూ ఇంట్లోని సామానంతా ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి ఊరి నుంచి తిరిగి వచ్చిన అంజయ్య కుటుంబసభ్యులు ఇంట్లో పరిస్థితి చూసి బోరుమన్నారు. బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.