సీజ్ చేయం.. గర్భిణులను తరలించం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మజ వెల్లడి
- సాయికిరణ్ ఆస్పత్రిలో మళ్లీ తనిఖీలు.. నోటీసులు జారీ
- అనుమతులు లేకుండానే అల్లోపతి ముసుగులో సరోగసీ
- ఐదేళ్లలో అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నది 400 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సరోగసీ దందా నిర్వహిస్తున్న సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. రెండ్రోజుల కిందట తనిఖీలు నిర్వహించిన తాము మరిన్ని రికార్డులు పరిశీలించేందుకు సోమవారం కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సరోగసీ బాధితులను విచారించిన అనంతరం కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రికి అల్లోపతి వైద్యానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, సరోగసీకి అనుమతి లేదని విచారణలో తేలిందన్నారు.
సరోగసీ నిర్వహించాలంటే ఆర్టిఫిషియల్ రీ ప్రొడక్షన్ టెక్నిక్స్(ఏఆర్సీ)లో నమోదై ఉండాలని, కానీ ఈ ఆసుపత్రి అందులో రిజిస్టర్ కాలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఈ ఆస్పత్రిపై రెండు మూడ్రోజుల్లో కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ‘‘ఇప్పటి కిప్పుడు ఆస్పత్రిని సీజ్ చేస్తే.. అందులో చికిత్స పొందుతున్న సరోగసీ గర్భిణులు ఇబ్బందులకు గురవుతారు. అందుకే మానవతా దృక్పథంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు. ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు ఉంటుంది’’ అని ఆమె వెల్లడించారు.
ప్రస్తుతం ఇక్కడ 48 మంది సరోగసీ ద్వారా గర్భం దాల్చినట్లు తెలిపారు. ఆస్పత్రి యజమాని సుమిత్ శేఖర్‌కు నోటీసులు అందించి, వివరణ కోరినట్లు తెలిపారు. అద్దె గర్భం దాల్చినందుకు తమకు రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు గర్భిణీలు అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో గత ఐదేళ్లలో ఇప్పటివరకు 400 మంది అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనివ్వగా.. వారంతా పేదరికంలో ఉన్న మహిళలేనన్నారు. ప్రస్తుతం అద్దె గర్భాలను మోస్తున్న బాధితుల్లో అత్యధికులు నాగాలాండ్, నేపాల్, మణిపూర్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు వివరించారు. 400 మందికి సరోగసీ చేసినట్లు లభించిన రికార్డుల్లో కొన్ని సంతకాలు పోలిక లేకుండా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు.
ఒక్కో విదేశీ కేసుకు కోటి?
సాయికిరణ్ ఆస్పత్రిలో ఐదేళ్ల నుంచి అనుమతులు లేకుండానే ఇన్ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రిలో 60 శాతం మంది.. విదేశీయులకు పిల్లల్ని కని ఇచ్చేందుకే సరోగసీ ద్వారా గర్భాలను మోస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో విదేశీయుడి నుంచి రూ.కోటి వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్వదేశీయులైతే రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.